logo

వ్యాపారి దారుణ హత్య

బంటుమిల్లి మండలం జానకిరామపురానికి చెందిన ఉల్లి టోకు వ్యాపారి చిగురుశెట్టి సుభాష్‌ చంద్రబోస్‌(42) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు

Published : 07 Jul 2024 05:19 IST

గుర్తుతెలియని వ్యక్తులు సైకిల్‌ పంపుతో దాడి 
బంటుమిల్లి మండలం నారాయణపురంలో కలకలం

సుభాష్‌ చంద్రబోస్‌ (పాత చిత్రం) 
బంటుమిల్లి, పెడన, న్యూస్‌టుడే: బంటుమిల్లి మండలం జానకిరామపురానికి చెందిన ఉల్లి టోకు వ్యాపారి చిగురుశెట్టి సుభాష్‌ చంద్రబోస్‌(42) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తమ షాపు నుంచి ట్రక్‌ ఆటోలో నారాయణపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మచిలీపట్నం డీఎస్పీ సుభాని, రూరల్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 

బంటుమిల్లి మండలం ములపర్రుకు చెందిన చంద్రబోస్‌ జానకిరామపురంలోని రెండు గుళ్ల సెంటర్‌లో వర్తక రీత్యా ఐదేళ్ల కిందట స్థిరపడ్డారు. ఆర్థికంగా స్థితిమంతుడైన చంద్రబోస్‌కు భార్య శిరీష, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం రాత్రి నారాయణపురంలో ఉల్లిపాయల బస్తాలను డెలివరీ ఇచ్చేందుకు వెళుతున్న చంద్రబోస్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. 216 జాతీయ రహదారికి కి.మీ. లోపలికి నారాయణపురం రోడ్డులో ఆటో వెళ్లిన తర్వాత సైకిల్‌కు గాలికొట్టే పంపుతో అతడిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఆటోను పక్కనే ఉన్న పంట బోదెలోకి తోసేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొన ఊపిరితో ఉండగా ఆస్పత్రికి తరలింపు : తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న చంద్రబోస్‌ను స్థానికులు గుర్తించి 108లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతి చెందారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా, పోస్ట్‌మార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వివిధ కోణాల్లో దర్యాప్తు : ఈ హత్య కేసు ఛేదించే క్రమంలో పెడన సర్కిల్‌ పరిధిలోని నలుగురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. హత్యకు గురైన సుభాష్‌ చంద్రబోస్‌తో పాటు కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్‌ కాల్‌ డేటా ఇప్పటికే సేకరించారు. క్లూస్‌టీంను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించారు. దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న గాలిపంపు.. ఘటనా స్థలంలో ఉండడంతో దానిపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. పోలీసు జాగిలాన్ని తీసుకొచ్చి దర్యాప్తు చేపట్టగా అది జాతీయ రహదారి వైపు వెళ్లి ఆగింది. దీని ఆధారంగా నిందితులు జాతీయ రహదారిపై నుంచి పరారై ఉంటారని భావిస్తున్నారు.

హత్యపై అనుమానాలు: చంద్రబోస్‌కు వ్యక్తిగత కక్షలు లేవని, అలాగే ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు కూడా లేవని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. ఓ వ్యక్తిని అనుమానించి పొరుగు జిల్లాలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. హత్యలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తికి, చంద్రబోస్‌ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ నిందితుడు ఈ హత్యకు ఎందుకు పథకం రచించాడు? తదితర వివరాలు లోతుగా దర్యాప్తు చేస్తేకానీ వెల్లడయ్యే పరిస్థితి లేదు. ఈ సంఘటనపై మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని