logo

ప్రేమ వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 06 Jul 2024 04:36 IST

ఆజాద్‌ హుస్సేన్‌లస్కర్‌

పెనమలూరు, న్యూస్‌టుడే: ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో అసోం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు కానూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... ఆజాద్‌ హుస్సేన్‌ లస్కర్‌ (23) అసోం రాష్ట్రం ననత్‌బస్తి పట్టణం సమీపంలోని కస్సార్‌ గ్రామ నివాసి. ఇతని కుటుంబం మూడేళ్ల కిందట బతుకుదెరువు కోసం కానూరు మురళీనగర్‌ వచ్చి స్థిరపడ్డారు. హుస్సేన్‌ లస్కర్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి  ఇతను తన స్వగ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఇటీవల మందలించారు.అప్పటి నుంచి ఇతను మానసికంగా బాధపడుతూ ఎవరితోనూ మాట్లాడడం లేదు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లస్కర్‌ తాడుతో ఉరేసుకొన్నాడు. కొంతసేపటికి ఇంటి యజమాని కుమార్తె గుర్తించి యువకుడి తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో వచ్చి పరిశీలించగా అప్పటికే కుమారుడు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఘటనపై తండ్రి ఫిర్యాదు చేయగా పెనమలూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


దాడిలో గాయపడి.. మహిళ మృతి

సరిహద్దు విషయమై బంధువుల మధ్య వివాదం  

మృతి చెందిన పరసాదేవి

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: సరిహద్దు వివాదంలో జరిగిన దాడిలో గాయపడి గుడివాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ శుక్రవారం మృతి చెందింది. సేకరించిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామానికి చెందిన పరసా బాలాజీ ఇంటి సరిహద్దులో అతని సోదరుడు తుమ్మా సురేష్‌ నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సరిహద్దులోని డ్రెయినేజీ విషయమై ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఈనెల 3న జరిగిన ఘర్షణలో బాలాజీ భార్య పరసాదేవి(34)పై సురేష్‌ దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యుల సూచనల మేరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా బాగో లేదని చెప్పడంతో తిరిగి గుడివాడ తీసుకొచ్చి ఏలూరు రోడ్డులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మృతి చెందింది. ఈమేరకు ముదినేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని