logo

నాగేంద్రాయ స్వాహా

గడువులోగా పనులను ప్రారంభించకపోయినా... పూర్తి చేయకపోయినా.. గుత్తేదారుకు నోటీసులిచ్చి ఒప్పందం రద్దు చేస్తారు. లేదా జరిమానా విధిస్తారు. దాదాపు దశాబ్దం గడిచినా లజ్జబండ టెండరు రద్దు చేయకుండా..

Updated : 05 Jul 2024 05:08 IST

చక్రం తిప్పిన మాజీ మంత్రి జోగి
లజ్జబండ డ్రెయిన్‌ పనుల్లో అవకతవకలు

గడువులోగా పనులను ప్రారంభించకపోయినా... పూర్తి చేయకపోయినా.. గుత్తేదారుకు నోటీసులిచ్చి ఒప్పందం రద్దు చేస్తారు. లేదా జరిమానా విధిస్తారు. దాదాపు దశాబ్దం గడిచినా లజ్జబండ టెండరు రద్దు చేయకుండా.. గడువు పెంచుకుంటూ.. మరో పనిని ఆయనకే అప్పగించడం ఒక్క వైకాపా నాయకులకే సాధ్యం!

ఈనాడు, అమరావతి

ఆ రెండూ ఒకే తరహా పనులు... లజ్జబండ డ్రెయిన్‌లో పూడిక తీయడం. మొదటి పనికి టెండరు దక్కించుకున్న గుత్తేదారు పదేళ్లపాటు కాలయాపన చేసినా.. రెండో పనిని అదే గుత్తేదారుకు అధిక ధరకు అప్పగించేలా చక్రం తిప్పారు నాటి వైకాపా మంత్రి జోగి రమేష్‌. అదీ అంచనాలు పెంచి! కాకపోతే సాంకేతికంగా పట్టుబడకుండా ఏజెన్సీ (గుత్త సంస్థ) పేరు మార్చారు. ప్రజాధనం అంటే ఎంత నిర్లక్ష్యమో... ఎలా దోచిపెట్టవచ్చో కృష్ణా జిల్లా డ్రెయినేజీ విభాగంలోని లజ్జబండ డ్రెయిన్‌ ఆధునికీకరణ, పూడికతీత పనుల వ్యవహారం మరో ఉదాహరణ. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక కృష్ణా డెల్టా ఆధునికీకరణ మొత్తం ఆగిపోయింది. అంతకుముందు పిలిచిన టెండర్లను రద్దు చేశారు. ఒక్క పెడన నియోజకవర్గంలో తప్ప. ఎందుకంటే నాటి మంత్రి జోగి రమేష్‌ చక్రం తిప్పి ఓ గుత్తేదారుపై అపార ప్రేమ కురిపించడమే!

పెడన నియోజకవర్గంలో లజ్జబండ డ్రెయిన్లో పూడిక తీతకు 2012-13లో ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌) కింద టెండరును రూ. 5.20 కోట్ల అంచనాతో గుత్తేదారు నాగేంద్ర దక్కించుకున్నారు. 0 నుంచి 7వ కిలోమీటరు వరకు పూడిక తీసేందుకు డ్రాయింగ్‌ డిజైన్లు, ఇతర భూసేకరణ మార్కింగ్‌ వంటివన్నీ గుత్త సంస్థే చూసుకోవాలి. కానీ.. 2013 నుంచి పట్టించుకోకుండా భూసేకరణ జరగలేదంటూ సాకు చూపిస్తూ వచ్చారు. పూడికతీతకు భూసేకరణ నామమాత్రమే. అయినా అధికారులు గుత్తేదారుకు నోటీసులివ్వకుండా..ఈ పనిని రద్దు చేయకుండా దస్త్రాల్లో మాత్రం ఈవోటీ ఇస్తూ వచ్చారు.

నాటి వైకాపా మంత్రి జోగి రమేష్‌ 7.5 కిలోమీటరు నుంచి 15వ కిలోమీటరు వరకు పూడిక తీయాలంటూ రూ. 8.98 కోట్లతో జలవనరుల శాఖ ఎస్‌ఈ ద్వారా ప్రతిపాదించారు. పరిశీలించిన ఈఎన్‌సీ రూ. కోటి వరకు ఎక్కువ వేసినట్టు గుర్తించారు. ఒత్తిడి తెచ్చిన జోగి.. రూ. 7.98 కోట్లకు మంజూరు చేయించుకున్నారు. వాస్తవానికి అంచనాల్లో తేడాలుంటే తిరిగి రూపొందించాలి. ఇదే సమయంలో పాత ఈపీసీ ప్యాకేజీని కొనసాగిస్తానంటూ పాత గుత్తేదారు నాగేంద్ర లేఖ రాశారు. దీనికి జలవనరుల శాఖ తలూపింది. అంతేకాదు.. కొత్త ప్యాకేజీని కూడా నాన్‌ ఈపీసీ కింద ఆయనే దక్కించుకున్నారు. ఇక్కడే మతలబు జరిగింది. నాన్‌ ఈపీసీ కింద టెండర్లో కోట్‌ చేసిన ధరలకే పనులు చేయాలి. ఈపీసీ టెండర్‌లో పనులను ప్రస్తుత ధరల ప్రకారం అంచనా వేస్తారు. దీంతో రూ. 5.20 కోట్ల పాత ప్యాకేజీ ధర ఇపుడు దాదాపు రెట్టింపు కానుంది. ఈ డ్రెయిన్‌ పనులు నిలిచిపోయిన విషయాన్ని ఈఈ నమోదు చేయకుండా జరుగుతున్నట్టు గత దశాబ్దకాలంగా చూపించడం వెనుక మర్మం ఏమిటో బయటపడాల్సి ఉంది.

  • డ్రెడ్జింగ్‌ నీటిలో చేస్తారు. తీసిన మట్టి ఎంతో లెక్కలు తీయాలి. కానీ.. పాత పనుల పేరుతో ఇవేమీ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
  • రెండు పనులను ఒకే గుత్తేదారు చేయడం.. ఈపీసీలో ధరల పెరుగుదల కింద భారీగా లబ్ధి పొందేందుకే పక్కా ప్రణాళిక ప్రకారం కథ నడిపినట్టు తెలుస్తోంది.
  • గతేడాది డ్రెయిన్‌ పనులను సక్రమంగా చేయకపోవడం వల్లనే వరద నీరు వెనక్కి తన్ని పొలాలు నీట మునిగాయి.

 ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర ఈ లజ్జబండ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. డ్రెయినేజీ విభాగం అక్రమాలకు నిలయంగా మారిందని సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గోపాల కృష్ణ ఆరోపించారు. అక్రమాలపై మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడుకు ఫిర్యాదు చేశామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని