అన్నతోడు.. అరాచకమే చూడు

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్‌ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు.

Updated : 05 Jul 2024 06:03 IST

వైకాపా హయాంలో ఆర్థికంగా వర్సిటీల నిర్వీర్యం
ఆరోగ్య వర్సిటీకి నిర్వహణ నిధులూ ఇవ్వని జగన్‌
పొదుపు చేసిన రూ.400 కోట్లనూ మళ్లించిన దారుణం
‘‘కృష్ణా’’ ఖాతాల్లోని డబ్బులూ హారతిలా కరిగించిన తీరు

ఈనాడు, అమరావతిన్యూస్‌టుడే, ఆరోగ్య విశ్వవిద్యాలయం: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్‌ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. దశాబ్దాలుగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో విశ్వవిద్యాలయాలకు వచ్చే డబ్బులను జాగ్రత్తగా పొదుపు చేస్తూ రాగా.. వాటిపై వైకాపా ప్రభుత్వం కన్నేసింది. ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్ల నిధులను రాత్రికి రాత్రి పావులు కదిపి.. 2021లో ప్రభుత్వ ఖజనాలోకి తీసుకెళ్లింది. ఏటా రూ.2 కోట్లు వడ్డీ పేరుతో ఇస్తున్నారు. పైగా గతంలో విశ్వవిద్యాలయం నిర్వహణకు ఏటా ఇచ్చే రూ.8 కోట్లనూ జగన్‌ సర్కారు ఆపేసింది. దీంతో వర్సిటీ అభివృద్ధికి ఒక్క అడుగు పడలేదు. ఓ భవనం కట్టాలన్నా డబ్బులు లేక దిక్కులు చూడాల్సిందే. బందరులో కృష్ణా విశ్వవిద్యాలయం పరిస్థితినీ ఇలాగే దిగజార్చారు. దశాబ్దాలుగా విద్యార్థులు కట్టే ఫీజుల ద్వారా కృష్ణా వర్సిటీకి వచ్చే ఆదాయాన్ని పొదుపు చేసుకోగా.. వాటినీ హారతి కర్పూరంలా కరిగించి.. కనీస అభివృద్ధి కూడా ఐదేళ్లలో చేయకుండా వదిలేసి వెళ్లిపోయారు.
వైద్య విద్య ప్రవేశాలకు కీలకమైన ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. విద్యార్థుల ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దశాబ్దాలుగా బ్యాంకుల్లో దాస్తూ వచ్చారు. ఈ మొత్తం వైకాపా అధికారంలోకి వచ్చే సమయానికి రూ.400 కోట్ల వరకూ బ్యాంకుల్లో ఉంది. ఏటా ప్రభుత్వం ఇచ్చే రూ.8 కోట్లనే వర్సిటీ నిర్వహణ కోసం వినియోగిస్తూ.. ఫీజుల ద్వారా వచ్చేది భవిష్యత్తు అవసరాల కోసం దాచారు. ఆ నిధులపై కన్నేసిన జగన్‌ ప్రభుత్వం.. 2021లో వాటినీ బ్యాంకుల నుంచి తీసేసి.. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌సీఎల్‌)కు మళ్లించింది. ఇది దారుణమని.. వర్సిటీ ఉద్యోగులు బహిరంగ ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. వైకాపాతో అంటకాగిన అప్పటి వీసీ శ్యామ్‌ప్రసాద్‌ ద్వారా ఈ నిధులు మళ్లించారు. ఇప్పటికీ ఆ నిధులు ఏమయ్యాయో, తిరిగి ఎప్పుడిస్తారో చెప్పడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. మీ డబ్బులు ఎప్పుడు కావాలన్నా తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికిన నాటి అధికారులు, పాలకులు ఇప్పుడు లేరని వాపోతున్నారు. విశ్వవిద్యాలయం భవిత, అభివృద్ధి పనులు, ఉద్యోగుల భరోసా కోసం దశాబ్దాలుగా దాచిన డబ్బులన్నీ.. జగన్‌ దెబ్బకు పూర్తిగా తమకు కాకుండా పోయాయంటున్నారు.

వైకాపాతో అంటకాగిన వీసీ బాబ్జీ..

ఇటీవల రాజీనామా చేసిన వీసీ డాక్టర్‌ కె.బాబ్జీ హయాంలోనూ విచ్చలవిడిగా నిధుల దుర్వినియోగం జరిగింది. వైకాపాకు చెందిన మాజీ మంత్రికి వియ్యంకుడైన ఈయన నియామకం నుంచి వివాదాస్పదంగానే వ్యవహరించారు. బాబ్జీ వీసీగా వచ్చినప్పటి నుంచి విశ్వవిద్యాలయం సొమ్మును నీళ్లలా ఆడంబరాల కోసం ఖర్చు చేస్తూ నిధులు దుర్వినియోగం చేశారు. బాబ్జీ హయాంలో విచ్చలవిడి ఖర్చులు చూపిస్తూ.. వర్సిటీ ఆదాయాన్ని భారీగా పక్కదారి పట్టించారు. అవసరం లేకపోయినా.. రూ.లక్షలు వెచ్చించి ఖరీదైన వాహనాల కొనుగోళ్లు, భారీగా ఖర్చు పెట్టి తన ఛాంబరుకు సొబగులు సమకూర్చారు. ఉన్నత పదవిలో ఉన్నా.. వైకాపాపై తన స్వామి భక్తి చాటుకోవడానికి ఏస్థాయికైనా దిగజారతారనే విమర్శలు బాబ్జీపై ఉన్నాయి. వైద్య విద్యావ్యవస్థకు రాజకీయ రంగు పులమడం, వైకాపా అనుయాయులను వెంట తిప్పుకోవడం, వారు కోరిన పనులు చేయడం వంటివి చాలానే చేశారు.

స్వామిభక్తితో వైఎస్‌ విగ్రహం ఏర్పాటు...

ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎదుట వైఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తన స్వామి భక్తి చాటుకున్నారు. వీసీ చేసిన ప్రతిపనిలోనూ రిజిస్ట్రారు, ఇతర డిప్యూటీ రిజిస్ట్రార్లు, ఇంజినీర్లు పూర్తి సహకారం అందించడం గమనార్హం.
2014 - 2019 మధ్యలో పూలకుండీలకు ఉన్న పసుపు రంగును కూడా ఉపకులపతి ఆధ్వర్యంలో మార్చేశారంటే.. ఎంతగా వైకాపా విధేయులుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత.. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయానికి వచ్చి వైఎస్‌ పేరు తొలగించి ఎన్టీఆర్‌ పేరు ఏర్పాటు చేశారు. ఇక్కడా.. బాబ్జీ తన స్వామిభక్తి చాటుతూ.. తెలుగు యువత నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్‌ విగ్రహానికి పోలీసులతో పహారాను తాను ఉన్నంత వరకూ కొనసాగించారు.

రూ.37 కోట్లుకరిగించేశారు...

వైకాపా గద్దెనెక్కే నాటికి కృష్ణా విశ్వవిద్యాలయం ఖాతాలో రూ.110 కోట్లకు పైగా నిధులున్నాయి. గత ఐదేళ్లలో జగన్‌ ఆశీస్సులతో వచ్చిన వీసీలంతా ఈ నిధులపై కన్నేసి.. రకరకాల కారణాలు చూపిస్తూ వాటిలో రూ.37 కోట్లు కరిగించారు. ప్రస్తుతం కృష్ణా వర్సిటీ ఖాతాలో రూ.73.03 కోట్లు మాత్రమే మిగిలాయి. ఇవికాక ఏటా వర్సిటీకి రూ.6 కోట్ల వరకూ రకరకాల ఫీజుల రూపంలో ఆదాయం వస్తుంది. ఐదేళ్లలో ఇదో రూ.30 కోట్లతో కలిపితే.. మొత్తంగా రూ.67 కోట్లుపైగా వైకాపా ప్రభుత్వ హయాంలో వీసీలుగా వచ్చిన వాళ్లు అభివృద్ధి, ఆర్భాటాల పేరుతో నీళ్లలా ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ రెండు వర్సిటీల వీసీలు రాజీనామా సమర్పించి వెళ్లారు. ఈ ఐదేళ్లలో విశ్వవిద్యాలయంపై జరిగిన అవకతవకలు, అక్రమాలు, ఆర్థిక విధ్వంసంపై.. విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు తాజాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని