logo

8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు

జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్‌ జి.సృజన వెల్లడించారు.

Published : 05 Jul 2024 04:13 IST

జిల్లాలో అందుబాటులో 3,69,588 క్యూబిక్‌ మీటర్లు
తవ్వకం, లోడింగ్, రవాణా, సీనరేజీలకు నామ మాత్ర ఫీజు

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సృజన

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనున్నట్టు కలెక్టర్‌ జి.సృజన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉచిత ఇసుక విధానాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. రేవుల్లో ఇసుక తవ్వకం, లోడింగ్, రవాణా, సీనరేజీల కింద నామ మాత్ర ఫీజు వసూలు చేస్తారని తెలిపారు. ఇలా వసూలు చేసే సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరదన్నారు. నేరుగా స్థానిక సంస్థలైన జిల్లా మండల, పరిషత్తు, పంచాయతీలకు చేరుతుందని చెప్పారు. ఈ మొత్తాలతో రేవుల అభివృద్ధికి, వాటికి ఉన్న రహదారుల కోసం వినియోగించనున్నట్టు వివరించారు. నగరంలోని కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్సీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రస్తుతం 12 ఇసుక రేవులు ఉండగా, 8 రేవుల్లో 3,69,588 క్యూబిక్‌ మీటర్ల మేర ఇసుక నిల్వలు ఉన్నట్టు చెప్పారు. ఇసుక నిల్వలు, ఉచిత అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలని చెప్పారు. ఇసుక కొరత లేకుండా పూడిక రూపంలో ఉన్న పాయింట్లను ముందుగానే గుర్తించాలన్నారు. సమావేశంలో గనుల శాఖ డీడీ జి.వెంకటేశ్వర్లు, డీపీవో ఎన్‌.వి.శివప్రసాద్‌ యాదవ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య మిషన్‌ ఎస్‌ఈ డి.వి.రమణ, భూగర్భ జల శాఖ డీడీ బి.నాగరాజు, డీటీసీ ఎం.పురేంద్ర, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, ఆయా ప్రాంతాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని