logo

నందిగామ పురపాలికపై తెదేపా పట్టు అధికార పార్టీలో చేరిన వైకాపా కౌన్సిలర్లు

నందిగామ పురపాలక సంఘంలో మరో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గతంలో చేరిన ముగ్గురితో కలిపి మొత్తం ఐదుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరడంతో పురపాలక సంఘంలో తెదేపాకు పూర్తి ఆధిక్యత వచ్చింది.

Published : 05 Jul 2024 04:06 IST

ఎమ్మెల్యే సౌమ్య సమక్షంలో తెదేపాలో చేరిన కౌన్సిలర్లు వాణి, సాంబయ్య 

నందిగామ, న్యూస్‌టుడే : నందిగామ పురపాలక సంఘంలో మరో ఇద్దరు వైకాపా కౌన్సిలర్లు తెదేపాలో చేరారు. గతంలో చేరిన ముగ్గురితో కలిపి మొత్తం ఐదుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరడంతో పురపాలక సంఘంలో తెదేపాకు పూర్తి ఆధిక్యత వచ్చింది. స్థానిక కాకాని నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో 9, 17 వార్డులకు చెందిన వైకాపా కౌన్సిలర్లు విశ్వనాథపల్లి వాణి, బాపట్ల సాంబయ్య తెదేపాలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కౌన్సిలర్లు మారం అమరయ్య, గద్దె శేషుకుమారి, అచ్చి దివ్య వైకాపాను వీడి తెదేపాలోకి వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌన్సిలర్లు పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. మరికొందరు వైకాపా కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి తెదేపాలోకి రానున్నట్లు వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీ బోర్డును తెదేపా కైవసం చేసుకుంటుదని చెప్పారు. అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఛైర్మన్‌ను ఎన్నుకుంటామని తెలిపారు. నందిగామలో మంచి పరిపాలన ప్రజలకు అందిస్తామన్నారు. గత ఐదేళ్లల్లో అప్పటి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సోదరులు లేని వంద పడకల వైద్యశాల తీసుకొచ్చినట్లు, లేని కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించినట్లు అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు. పట్టణంలో విగ్రహాలను అటు, ఇటు మారుస్తూ కాలం వెళ్లదీశారని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ముఖ్యంగా పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ సమస్యపైన దృష్టి సారిస్తామన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు.

పూర్తి ఆధిక్యంతో....

నందిగామ పురపాలక సంఘం పరిధిలో 20 వార్డులు ఉన్నాయి. పురపాలక సంఘం ఎన్నికల్లో వైకాపా 13, తెదేపా ఆరు, జనసేన ఒక వార్డు చొప్పున విజయం సాధించాయి. గతంలో తెదేపా నుంచి ఒక కౌన్సిలర్‌ వైకాపాలో చేరారు. అనారోగ్యంతో ఛైర్‌పర్సన్‌ మండవ వరలక్ష్మి, వైస్‌ ఛైర్‌పర్సన్‌ మాడుగుల నాగరత్నంలు మృతి చెందారు. వీరి స్థానంలో తిరిగి వార్డుల్లో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం ఇన్‌ఛార్జి ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఛైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెదేపా, జనసేనకు కలిపి 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదనంగా ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్‌ ఓట్లు రెండు ఉంటాయి. దీంతో పూర్తి ఆధిక్యంతో మున్సిపల్‌ బోర్డును తెదేపా కైవసం చేసుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని