logo

మదర్సా నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే కరిష్మా మృతి

అజిత్‌సింగ్‌నగర్‌లోని మదర్సాలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని కరిష్మా (17) మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు షేక్‌ మస్తాని, సుభానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 05 Jul 2024 04:03 IST

సీపీ కార్యాలయం వద్ద తల్లిదండ్రులు, బంధువుల బైఠాయింపు
న్యాయం చేయాలని డిమాండ్‌

కన్నీరు మున్నీరవుతున్న కరిష్మా తల్లి మస్తాని

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : అజిత్‌సింగ్‌నగర్‌లోని మదర్సాలో నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని కరిష్మా (17) మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు షేక్‌ మస్తాని, సుభానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మదర్సా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట బంధువులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మదర్సా నిర్వాహకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్తచర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

న్యాయం చేయాలని డిమాండ్‌

సంప్రదాయం నేర్చుకునేందుకు మదర్సాలో చేరిస్తే నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ తల్లి మస్తానీ కన్నీరుమున్నీరయ్యారు. జూన్‌ 27వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి వాంతులు అయ్యాయని సీసీ ఫుటేజీలో గమనించామని తెలిపారు. కరిష్మాకు వాంతులు అవుతున్నా.. నిర్వాహకులు పట్టించుకోలేదని ఆరోపించారు. 13 గంటల పాటు ఇబ్బందులు పడిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లారని.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వాంతులు అవుతున్న విషయం ముందుగా చెప్పినా.. తామే మంచి ఆసుపత్రిలో చూపించుకునే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు మరణంపై మదర్సా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే కేసు పెట్టారుగా... చట్టంలో లొసుగులు మాకు తెలుసంటూ హేళనగా మాట్లాడి క్షోభ పెట్టారని వాపోయారు. మదర్సా నిర్వాహకులు బయట ఉంటే తమకు న్యాయం జరగదని, భయంగా ఉందంటూ బంధువులు నిరసనకు దిగారు.

హామీ ఇవ్వటంతో ఆందోళన విరమణ

కరిష్మా మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణను కలిసేందుకు వచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవటంతో డీసీపీ కె.శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆయన తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో.. ఆందోళనకారులు వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం బాధితులు కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని