logo

Jogi Ramesh: జోగి కబ్జాలో... ఎవరి పాపం ఎంత?

సర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు.

Updated : 04 Jul 2024 05:53 IST

చిరుద్యోగులపై వేటేసి తిమింగలాలను వదిలేశారా?
అధికారులకు తెలియకుండానే సర్వే నంబరు మార్చారా?
నేటికీ తేలని నిజాలు.. కేసు నమోదులో పోలీసుల తాత్సారం
ఈనాడు, అమరావతి

వివాదం లేని భూమిని సర్వే చేయాలంటేనే తహసీల్దారు అనుమతి తప్పనిసరి. అలాంటిది అగ్రిగోల్డ్‌ భూములుగా సీఐడీ జప్తు చేశాక తహసీల్దారు, ఆర్డీవోకు సమాచారం లేకుండానే సర్వే చేశారా? వారికి తెలియకుండానే సవరణ చేశారా? ఒకవేళ అలా చేసి ఉంటే పైస్థాయిలో ఎవరు ఒత్తిడి తెచ్చారు?

ఈ మొత్తం వ్యవహారంలో తహసీల్దారు మొదలుకుని సంయుక్త కలెక్టరు వరకూ ఎవ్వరూ బాధ్యులు కాదట.. క్షేత్రస్థాయి సంఘటనలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన వీఆర్వో కూడా బాధ్యులు కాదట... సవరణ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌పై కూడా చర్యల్లేవు.. ఇదంతా విస్మయం కలిగిస్తోందని తెదేపా శ్రేణులంటున్నాయి. ?

ర్వే నంబరు మార్చేసి.. సీఐడీని ఏమార్చేసి... రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసిన వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులపై చర్యలకు పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డీజీపీకి నివేదిక అందిన విషయం తెలిసిందే. బాధ్యులపై ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగంలోని తిమింగలాలను వదిలి కిందిస్థాయి ఉద్యోగులను బలి చేశారన్న వాదన వినబడుతోంది. ఏకంగా సీఐడీ అటాచ్‌ చేసిన భూమిని.. నిషేధిత జాబితాలో ఉన్నా సరే.. సర్వే నంబరు మార్చేసి కబ్జా చేయడానికి ఉన్నతస్థాయిలోని వ్యక్తుల ప్రమేయం లేకుండా కిందిస్థాయి సిబ్బంది ఎలా సహకరిస్తారన్నది ప్రశ్న. వాస్తవానికి ఈ వ్యవహారం ఆరు నెలల క్రితమే పోలీసుల దృష్టికి వచ్చినా.. నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో దస్త్రాన్ని తొక్కిపెట్టారు. తాజాగా కదలిక వచ్చి దాదాపు 20 రోజులైనా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

పెద్దల పాత్ర లేదా..?

జోగి కుటుంబం కబ్జా వెలుగు చూశాక గ్రామీణ మండల తహసీల్దారు జాహ్నవి ఇచ్చిన నివేదిక ప్రకారం డిప్యూటీ తహసీల్దారు విజయ్‌కుమార్, మండల సర్వేయరు రమేష్, గ్రామ సర్వేయరు దేదీప్యలను నాటి కలెక్టరు డిల్లీరావు సస్పెండ్‌ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మొదట్లో మండల సర్వేయరు, గ్రామ సర్వేయరును మాత్రమే బాధ్యులుగా చేస్తూ నివేదిక ఇవ్వగా కలెక్టరు మండిపడి మరోసారి రిపోర్ట్‌ రప్పించుకున్నారు. తహసీల్దారు, ఆర్డీవో పాత్రపై విచారణ చేయాలని ఆయన సిఫార్సు చేశారు. ఆ మర్నాడే డిల్లీరావు బదిలీ అయ్యారు.

  • ఆ భూమిని వివాదాస్పదం చేశారని తహసీల్దారు జాహ్నవి పోలీసులకిచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. 2023 మార్చి 1న సర్వే నంబరు మార్పు కోసం సర్వే చేసిన సమయంలో తహసీల్దారుగా జాహ్నవి ఉన్నారు. ఈమెకు తెలియకుండానే ఎఫ్‌ లైన్‌ నివేదిక, భూస్వాధీన ఉత్తర్వులు జారీ అయ్యాయని చెబుతున్నారు. ఇదెలా జరిగిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలోనే సబ్‌ కలెక్టరుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అదితిసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి వద్దకు కూడా దస్త్రం వెళ్లినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సంయుక్త కలెక్టరుకు తెలియజేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారిపై ఉంది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను సవరణ పేరుతో ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారన్నదానిపై ఏ స్థాయిలోనూ ఎవరూ ప్రశ్నించలేదు. ఆ సమయంలో జేసీగా శ్రీనివాస్‌నుపూర్‌ అజయ్‌ ఉన్నారు.
  • గ్రామ వీఆర్వో శ్రీనివాస్‌ పాత్ర లేదని తహసీల్దారు చెబుతున్నారు. కానీ.. సర్వే నంబరు 88లో భూమి లేదని, సర్వే నంబరు 87లో ఉందని నివేదించిన తొలి వ్యక్తి వీఆర్వోనే.

జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు కబ్జా చేసిన భూమి ఇదే..

పోలీసుల వ్యూహమేమిటి?

అగ్రిగోల్డ్‌ భూములను కబ్జా చేశారని 2023 జనవరిలోనే విజయవాడ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందినా పక్కన పెట్టేశారు. కానీ.. ఓ ఎస్సై దీన్ని మండల రెవెన్యూ కార్యాలయానికి పంపడంతో తహసీల్దారు విచారణ చేసి 2023 మార్చిలో నివేదిక పంపారు. ఈలోగా ఎన్నికలొచ్చాయి. అప్పటికే జోగి రమేష్‌ మంత్రిగా ఉన్నారు. దీంతో వ్యవహారాన్ని అధికారులు వెలుగులోకి తీసుకురాలేదు. ఇటీవల బయటపడ్డప్పుడు రెండో పట్టణ సీఐ గణేష్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు రాలేదని అబద్ధం చెప్పారు. మీడియాలో ప్రసారమయ్యాక అప్పుడు దస్త్రాలను వెదికారు. తాజా పరిణామాలేమంటే.. సీఐడీ అధికారులు సదరు భూమిని పరిశీలించి వెళ్లారు. అక్కడి నుంచి ఫిర్యాదు అందాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. డీజీపీ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కేసు నమోదు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకు ఆ దిశగా చర్యలు కనబడడం లేదు. జోగి కుటుంబం నుంచి ఆ భూమిని కొనుగోలు చేసిన వైకాపా కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి బంధువులు మాత్రం కిమ్మనడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని