logo

Vijayawada: వంచకుడు అంజాద్‌పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్‌మెంట్‌

జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్‌ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు.

Updated : 04 Jul 2024 09:59 IST

జమ్మూ నుంచి విజయవాడ చేరుకున్న ప్రత్యేక బృందం
యువతిని తల్లికి అప్పగించిన పోలీసులు
నిందితుడిని నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పటమట: జమ్మూలో ఆచూకీ దొరికిన భీమవరం యువతి తేజస్విని కేసు కీలక మలుపు తిరిగింది. తనను అంజాద్‌ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. గత 9 నెలల నుంచి కనిపించకుండా పోయిన హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థిని తేజస్విని, అంజాద్‌ను విజయవాడ పోలీసులు జమ్మూ నుంచి బుధవారం తెల్లవారుజామున విమానంలో బెజవాడ తీసుకొచ్చారు. అనంతరం మాచవరం పోలీసులు వీరిని తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి స్టేట్‌మెంట్లను తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను విజయవాడ నుంచి గత ఏడాది అక్టోబరు 28న అంజాద్‌ బలవంతంగా తీసుకెళ్లాడని చెప్పింది. 9 నెలల్లో ఎక్కడా తనను ఇతరులతో ఫోన్‌లో మాట్లాడనీయలేదని, తాము చాలా ప్రాంతాలు తిరిగి.. చివరకు జమ్మూలో దిగినట్లు స్టేట్‌మెంట్‌లో యువతి వివరించింది. జమ్మూలో తనను ఓ గదిలో ఉంచాడని, అక్కడ తనకు భాష రాకపోవడంతో ఎక్కడికీ వెళ్లలేకపోయినట్లు చెప్పింది. తాము ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు అంజాద్‌ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. తేజస్విని స్టేట్‌మెంట్‌ ఆధారంగా అంజాద్‌పై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా బంధించడం, పెళ్లి చెసుకుంటానని బలవంతాన తీసుకెళ్లడం, దాడి చేయడం, బంధించడం వంటి నేరాలపై బిఎన్‌ఎస్‌లోని 342, 366, 323 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. యువతిని పోలీసులు తల్లికి అప్పగించారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

రెండు గంటల్లో జమ్మూ పోలీసుల ఆపరేషన్‌... గత ఏడాది నవంబరులో హైదరాబాద్, కేరళ, ముంబయి, రాజస్థాన్‌కి వెళ్లారు. అనంతరం డిసెంబరులో దిల్లీలో జమ్ముతావి రైలెక్కి జమ్మూ స్టేషన్‌లో దిగారు. అక్కడ ఓ హోటల్‌కు వెళ్లిన అంజాద్‌.. ఇద్దరం ప్రేమికులమనీ, ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో జమ్మూ వచ్చినట్లు చెప్పాడు. హోటల్‌లో నెలకు రూ.7,500 పనికి కుదిరాడు. యజమాని వసతి కూడా ఇవ్వడంతో తేజస్వినిని గదిలో ఉంచాడు. జీతం ద్వారా వచ్చిన డబ్బుతో పొదుపు చేసుకుని.. మార్చిలో ఫోన్‌ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కూడా యువతికి మాట్లాడేందుకు ఫోన్‌ ఇవ్వలేదు. సోమవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో అంజాద్‌ లేని సమయంలో ఫోన్‌ తీసుకుని సోదరికి ఇన్‌స్టాలో సందేశం పంపించింది. ఈమె వెంటనే విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చింది. చిరునామాపై స్పష్టత వచ్చే సరికి సాయంత్రం 5 గంటలైంది. వెంటనే జమ్మూ పోలీసులకు వివరాలను విజయవాడ నుంచి పంపించారు. స్థానిక పోలీసులు అక్కడకు వెళ్లి.. యువతీ, యువకులను తమ అదుపులోకి తీసుకుని జమ్మూలోని గాంధీనగర్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో వీరిద్దరి ఫోటోలను విజయవాడ పోలీసులకు పంపించారు. రెండు గంటల్లో జమ్మూ పోలీసులు ఆపరేషన్‌ ముగించి తేజస్విని, అంజాద్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు.


నా కుమార్తె దక్కుతుందని అనుకోలేదు

- శివకుమారి, తేజస్విని తల్లి

నాకు నా కుమార్తె దక్కుతుందని అనుకోలేదు. 9 నెలలుగా తేజస్విని ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించగానే నా కుమార్తె దొరికింది. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటాను. నేను వ్యక్తిగతంగా వెళ్లి పవన్‌ను కలుస్తా. విజయవాడ పోలీసులు కేసు ఛేదనలో తీవ్రంగా కృషి చేశారు. మాకు ఫోన్‌ చేయనీయకుండా అంజాద్‌ అడ్డుకున్నాడు. ప్రస్తుతం డిప్రెషన్‌లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు