logo

కిట్ చేతపట్టి..లెక్కల పని పట్టు!

విద్యార్థులంతా మార్కుల వేటలో పరుగులు పెడుతున్న రోజులివి. అయినప్పటికీ.. అనేక మంది విద్యార్థులకు మింగుడు పడని పాఠ్యాంశం గణితం. అటువంటి విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా.. కేబీఎన్‌(కాకరపత్తి భావనారాయణ కళాశాల) కళాశాల అధ్యాపకులు ‘టీం మ్యాథ్స్‌ కిట్‌’ను తయారు చేశారు.

Published : 04 Jul 2024 05:23 IST

గణిత బోధనకు నమూనాల తయారీ
ఈనాడు డిజిటల్, అమరావతి

నమూనాలపై తర్ఫీదు పొందుతున్న విద్యార్థులు

విద్యార్థులంతా మార్కుల వేటలో పరుగులు పెడుతున్న రోజులివి. అయినప్పటికీ.. అనేక మంది విద్యార్థులకు మింగుడు పడని పాఠ్యాంశం గణితం. అటువంటి విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా.. కేబీఎన్‌(కాకరపత్తి భావనారాయణ కళాశాల) కళాశాల అధ్యాపకులు ‘టీం మ్యాథ్స్‌ కిట్‌’ను తయారు చేశారు. గణితమంటే భయపడాల్సిన అవసరం లేకుండా.. భౌతిక, రసాయన శాస్త్రాల తరహాలో గణితంలో ప్రయోగాలు చేస్తూ ప్రతి లెక్కకూ నమూనాను రూపొందించారు. ఉపాద్యాయులకు కూడా.. ‘నేర్పించండి, ప్రయోగించండి, అన్వేషించండి, గణితం అంటే భయం పోగొట్టండి’ అంటూ ఈ కిట్‌ను వారికి అందజేసి సులభంగా లెక్కలు నేర్పిస్తున్నారు. ఆ నమూనాలతో విద్యార్థులకు గణితం బోధిస్తూ..లెక్కల చిక్కులను తేలికగా విప్పుతున్నారు. ఇతర విద్యార్థులతో పొలిస్తే.. కిట్‌ సహాయంతో నేర్చుకున్న వారికి గణితం సులభంగా అర్థమవుతుందని కేబీఎన్‌ కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు.

కేబీఎన్‌ కళాశాల అధ్యాపకులు గణితానికి సంబంధించి ప్రత్యేక ల్యాబ్‌ను 2003లో ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా అధ్యాపకులు గణిత నమూనాలను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు 300 మంది విద్యార్థులకు నమూనాలపై శిక్షణ ఇచ్చారు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు ఉపయోగపడే అన్ని రకాల గణిత నమూనాలను తయారు చేశారు. 200పైగా  నమూనాలను తయారు చేసి ల్యాబ్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన 26 నమూనాలతో కూడిన టీంకిట్‌ను తయారు చేశారు. వాటి గురించి ముందుగా కళాశాలలోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా నగరంలోని వివిధ పాఠశాలకు కిట్లు అందజేసి.. అందులోని నమూనాలు గురించి అక్కడి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు నగర పరిధిలోని 95 ప్రభుత్వ పాఠశాలల్లో టీంకిట్‌లను ఉచితంగా అందించారు. దాంట్లో ఉన్న ‘మ్యాజిక్‌ స్క్వేర్‌’కు ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి పేటెంట్‌ కూడా లభించింది. కళాశాలలో బీఈడీ విద్యార్థులు సైతం ఈ కిట్ల ద్వారా గణితంలో చిట్కాలు తెలుసుకుంటున్నారు. విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని దూరం చేస్తున్నారు.


ఆటల రూపంలో చెబుతున్నాం

నాకు చిన్నతనం నుంచి లెక్కలంటే భయం. కళాశాలలో కూడా లెక్కలు చేయడంలో చాలా ఇబ్బందులు పడేదాన్ని. తర్వాత అధ్యాపకులు ల్యాబ్‌కు తీసుకు వెళ్లి.. ప్లేయింగ్‌ కార్డ్స్, మ్యాజిక్‌ స్క్వేర్‌ వంటి నమూనాల ద్వారా లెక్కలు చెప్పేవారు. దాంతో గణితంపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ల్యాబ్‌లో ఉన్న నమూనాలపై అవగాహన పెంచుకున్నాను. పాఠశాలలకు వెళ్లి కిట్లు అందిస్తూ.. విద్యార్థులకు ఆటలు రూపంలో పాఠ్యాంశంలోని లెక్కలు గురించి చెబుతున్నాను.

ఎ.జ్యోతి మల్లిక, విద్యార్థిని


లెక్కలంటే భయం పోయింది

నాకు మొదట్నుంచి లెక్కలపై ఆసక్తి తక్కువ. పరీక్షల ముందు బట్టీపట్టే వాడిని. ల్యాబ్‌లోని టీంకిట్‌పై అవగాహన పెంచుకున్నాక లెక్కలంటే భయం తగ్గింది. ఇప్పుడు అలవోకగా చేయగలను. దీంతోపాటు అధ్యాపకులు మాకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి.. పాఠశాలలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు కిట్టుపై అవగాహన చేయమనేవారు. దాంతో.. చేసిన నమూనాలను మళ్లీ మళ్లీ చేయడంతో లెక్కలంటే భయం పోయి.. ఆసక్తి పెరిగింది.

ఎస్‌.వినయ్, విద్యార్థి 


పాఠ్యాంశం సులభంగా నేర్చుకోవచ్చు

గణిత పాఠ్యాంశమంటే విద్యార్థుల్లో ఆందోళన ఏర్పడుతుంది. వారికి చిన్నతనం నుంచే ఆ భయం పోగొట్టాలనే ఉద్దేశంతో కళాశాలలో గణిత నమూనాలను తయారు చేస్తున్నాం. లెక్కల్లో రాణిస్తే.. విద్యార్థి ఏ పాఠ్యాంశమైనా సులభంగా నేర్చుకోగలరు. ఒకటో తరగతి నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రతి ఒక్కరికీ ఈ టీంకిట్‌ ఉపయోగపడుతుంది. అందుకే పాఠశాలలకు ఉచితంగా కిట్లు పంపిణీ చేస్తున్నాం.

పి.కల్మబేగం, గణిత విభాగాధిపతి, కేబీఎన్‌ కళాశాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని