logo

Gudivada: నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’

గతంలో టిడ్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు. దీనికెంత బిల్లు చేసుకున్నారో తెలుసా...? అక్షరాలా రూ. 28 లక్షల రూపాయలు! పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నాటి వైకాపా నేతలు  అమ్మేసుకున్నారు..ఎంతకో తెలుసా..? ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు... అంతేకాదు.. ఫోర్జరీ సంతకాలతో రూ. 70 లక్షలు కొట్టేసేందుకూ ఎత్తుగడ వేసిన ఘనులు.

Updated : 04 Jul 2024 08:07 IST

టిడ్కో ఇళ్ల పేరుతో రూ. 50 కోట్ల దోపిడీ
అధికారి సంతకం ఫోర్జరీ చేసి దొంగ బిల్లులు
అమృత్‌ పథకంలో ఎన్నో అక్రమాలు
నాటి వైకాపా పాలనలో అంతా అరాచకమే
ఈనాడు, అమరావతి - న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం

గతంలో టిడ్కో కాలనీ ప్రారంభోత్సవ సభలో నిమ్మకాయ నీళ్లు సరఫరా చేశారు. దీనికెంత బిల్లు చేసుకున్నారో తెలుసా...? అక్షరాలా రూ. 28 లక్షల రూపాయలు! పేదలకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లను నాటి వైకాపా నేతలు  అమ్మేసుకున్నారు..ఎంతకో తెలుసా..? ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు... అంతేకాదు.. ఫోర్జరీ సంతకాలతో రూ. 70 లక్షలు కొట్టేసేందుకూ ఎత్తుగడ వేసిన ఘనులు.

ఇలా ఒకటికాదు.. రెండు కాదు...

నాటి ఐదేళ్ల వైకాపా పాలనలో గుడివాడను పీల్చిపిప్పి చేసేశారు ఆనాటి ప్రజాప్రతినిధి, ఇతర నాయకులు. మైకుల ముందు బూతులు... వెనకాలేమో దొంగ పనులు! ప్రజలను పట్టించుకోలేదు.. వారి బాధలనూ చూడలేదు... జనం సొమ్మును మాత్రం నిస్సిగ్గుగా దోచేశారు.

నాటి జగన్‌ జమానాలో గుడివాడ పురపాలకసంఘాన్ని విచ్చలవిడిగా దోచేశారు వైకాపా నాయకులు. టిడ్కో ఇళ్లను అక్రమంగా అమ్మేసుకోవడం, ఇంటింటికీ కుళాయిల మరమ్మతులు పేరుతో దొంగ బిల్లులు పెట్టడం.. ఇలా దొరికినకాడికి దోచేశారు. బినామీ పేర్లతో అందినంత నొక్కేశారు. నాటి ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన అనుచరులు చెలరేగిపోయారు. తాజాగా ప్రభుత్వం మారడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నాటి మున్సిపల్‌ కమిషనర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి.. దొంగ బిల్లులు పెట్టుకుని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన విషయం తాజాగా కలకలం రేపుతోంది.

పైపులైన్ల పేరుతో....

గుడివాడ పురపాలకసంఘంలోని 36 వార్డుల్లో ఇంటింటికీ మంచినీటిని అందించేందుకు కేంద్రప్రభుత్వ అమృత్‌ పథకం కింద రూ. 30 కోట్లతో పైపులైన్లు వేశారు. ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేశామంటూ గుత్తేదారులు మొత్తం బిల్లులు చేసుకున్నారు. కానీ.. చాలా ప్రాంతాల్లో వీధుల్లో పైపులైన్లు ఉన్నా.. దాదాపు 2 వేల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వనేలేదు. చాలాచోట్ల ప్రజలు నిలదీయడంతో మరో కొత్త గుత్తేదారును తెచ్చి ఆ పనులు ప్రారంభించారు. ఇందుకోసం కొత్తగా బిల్లులు పెట్టి భారీగా సొమ్ము గుంజేశారు. అంటే.. అమృత్‌ పథకంలో వేశామంటూ బిల్లులు పెట్టుకున్నవాటికే.. రెండోసారి మున్సిపాల్టీ నుంచి వసూలు చేసుకున్నారన్నమాట. వాస్తవానికి అమృత్‌ పథకం కింద ఎక్కడెక్కడ పనులు చేశారు? ఇళ్లకు ఎక్కడెక్కడ కనెక్షన్లు ఇచ్చారో పక్కాగా లెక్కలు చూపించాలి. ఇవేమీ చేయకుండానే సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది.

దొంగ సంతకాలతో....

గుడివాడలో అమృత్‌ పథకం పైపులైన్ల లీకేజీలకు మరమ్మతుల పేరుతో రూ. లక్షల్లో కొల్లగొట్టేశారు ఓ వైకాపా నేత, అతనికి అనుకూలంగా ఉండే బినామీ గుత్తేదారు. చాలా ఇళ్లకు గతంలో ఉన్న కనెక్షన్లకే అమృత్‌ పైపులైను అనుసంధానించడంతో తరచూ నీరు లీకయ్యేది. దీన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్న వైకాపా నాయకులు ఓ మహిళా ఏఈ సహకారంతో రూ. కోట్లలో దండుకున్నారు. పైగా గతంలో మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేసిన వి.మురళీకృష్ణ సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 70 లక్షలకుపైగా బిల్లులు రావాలంటూ ఎన్నికలకు ముందు దస్త్రం పెట్టారు. ఇది బయటకు పొక్కడంతో వివాదంగా మారింది. ప్రస్తుతం సత్తెనపల్లి ఆర్డీవోగా పని చేస్తున్న నాటి కమిషనర్‌ వి.మురళీకృష్ణ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. తన సంతకం ఫోర్జరీ చేసినవారిపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలంటూ గుడివాడ పురపాలక అధికారులను డిమాండ్‌ చేశారు.

గుడివాడ-పామర్రు రోడ్డులో పైపులైను లీకేజీ


గుడివాడలో అమృత్‌ పథకం కింద చేసిన పనులు, ఆ తర్వాత మళ్లీ ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం, లీకుల పేరుతో పెట్టిన బిల్లులు.. వీటన్నింటిపై లోతుగా విచారణ చేయిస్తే.. భారీ కుంభకోణం బయటపడడం ఖాయం.


1600 టిడ్కో ఇళ్లు అమ్మేసుకుని...

గుడివాడ పురపాలకసంఘంలో గతంలో సహాయ కమిషనర్‌గా చేసిన ఓ అధికారి... కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన నాయకుడు కలిసి ఏకంగా 1600కుపైగా టిడ్కో ఇళ్లను అమ్మేసుకున్నారు. నిబంధనలతో సంబంధం లేకుండా, మున్సిపాలిటీ పరిధిలోనివారు కాకుండా ఎక్కడెక్కడివాళ్లకో ఒక్కో ఇంటిని రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు అమ్మేశారు. ఇలా దాదాపు రూ. 50 కోట్ల వరకూ దోచుకున్నట్టు ఆరోపణలున్నాయి.

  • గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లను గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించగా.. వీటిలో ఏడువేల ఇళ్లను వైకాపా హయాంలో కేటాయించారు. ఇందులో 1600కుపైగా ఇళ్లను అమ్ముకున్నారు.
  • వాస్తవంగా మున్సిపాల్టీలో నివసిస్తూ.. ఆధార్, రేషన్‌కార్డు ఉన్నవారికే కేటాయించాలని నిబంధనలున్నాయి. కానీ.. ఎక్కడెక్కడివారినో తీసుకొచ్చి ఆధార్‌కార్డు చిరునామా గుడివాడకు మార్చేసి మరీ డబ్బులు తీసుకుని ఇళ్లను కేటాయించారు. దీనిపై అప్పట్లోనే తెదేపా నాయకులు బయటపెట్టినా పట్టించుకోలేదు.
  • పురపాలకసంఘంలో శానిటేషన్‌ నిధులు సైతం భారీగా పక్కదారి పట్టాయి. వీటిపై లోకాయుక్తకు సైతం ఫిర్యాదులు వెళ్లాయి.
  • నాటి సీఎం జగన్‌ టిడ్కో కాలనీ ప్రారంభోత్సవానికి గుడివాడ వచ్చినప్పుడు నిర్వహించిన బహిరంగ సభలో నిమ్మకాయ నీళ్లు పంపిణీ చేసినందుకు ఏకంగా రూ. 28 లక్షల బిల్లు వసూలు చేసుకున్నారు. ఇది తెలిసి అధికారులు నివ్వెరపోయారు.

నా సంతకం ఫోర్జరీ చేశారు

నేను గుడివాడ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్నప్పుడు దొంగ బిల్లులతో ఓ దస్త్రం తెచ్చారు. రూ. 70 లక్షల పనులు చేశారని, బిల్లులు మంజూరు చేస్తూ సంతకం చేయాలని కిందిస్థాయి అధికారులు కోరారు. అనుమానం వచ్చి వాటిని వెనక్కి తిప్పి పంపా. సంతకాలు చేయాలంటూ నాపై రాజకీయంగానూ ఒత్తిడి తెచ్చారు. బదిలీపై సత్తెనపల్లి వచ్చేశాక ఆ దస్త్రంపై నా సంతకాలను ఫోర్జరీ చేసి బిల్లులు చేసుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని తీవ్ర విషయంగా పరిగణించాలి. దొంగ బిల్లులను ఫోరెన్సిక్‌ అధికారులతో పరిశీలన చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి

వి.మురళీకృష్ణ, సత్తెనపల్లి ఆర్డీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని