logo

భరోసా నింపిన మంత్రి పర్యటన

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ తొలిసారిగా నవ్యాంధ్రలో కీలకమైన మల్లవల్లి పారిశ్రామికవాడను సందర్శించడం పారిశ్రామికవేత్తలు, రైతుల్లో నూతనోత్సాహం నింపింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది.

Published : 04 Jul 2024 05:13 IST

మల్లవల్లి పారిశ్రామికవాడను సందర్శించిన భరత్‌
పారిశ్రామికవేత్తలు, రైతుల్లో నూతనోత్సాహం

వీరపనేనిగూడెంలో వివరాలు తెలుసుకుంటున్న మంత్రి  భరత్, ఎమ్మెల్యే వెంకట్రావు, కలెక్టర్‌ బాలాజీ

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ తొలిసారిగా నవ్యాంధ్రలో కీలకమైన మల్లవల్లి పారిశ్రామికవాడను సందర్శించడం పారిశ్రామికవేత్తలు, రైతుల్లో నూతనోత్సాహం నింపింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం లభించింది. పారిశ్రామికవేత్తలు, రైతులు, తెదేపా, జనసేన నాయకులు టీజీ భరత్‌ను తోడ్కొని వచ్చారు. దాదాపు మూడు గంటల పాటు మంత్రి వివిధ పరిశ్రమలను పరిశీలించడం, కీలక అంశాలకు పరిష్కారం చూపే విధంగా కలెక్టర్, ఏపీఐఐసీ అధికార్లతో సమీక్ష నిర్వహించడం గమనార్హం. విద్యుత్తు అంతరాయం, నీటి కొరత, పోలీసు భద్రత వంటి సమస్యలను పారిశ్రామికవేత్తలు ఏకరవు పెట్టగానే, సత్వరమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి సంబంధిత అధికార్లను ఆదేశించారు. అశోక్‌ లేల్యాండ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి రప్పిస్తామంటూ టీజీ భరత్‌ పేర్కొనడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. పారిశ్రామికవాడ భూసేకరణ సమయంలో అర్హులైన కొంతమంది రైతులకు పరిహారం రాని విషయాన్ని జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, మంత్రి దృష్టికు తీసుకువెళ్లగానే ఆ సమస్యను కూడా పరిష్కారిస్తామంటూ హామీ ఇవ్వడంతో నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు. తొలుత ఫుడ్‌పార్కు ప్రాంగణంలో ఉన్న ఫోర్‌ కిడ్స్‌ న్యూట్రీ ఫుడ్‌ యూనిట్‌ను సందర్శించిన మంత్రి, అక్కడ తయారవుతున్న ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. యూనిట్‌ విస్తరణలో భాగంగా ఏర్పాటు చేసిన అధునాతన యంత్రాలను ఎమ్మెల్యే యార్లగడ్డతో కలిసి ప్రారంభించారు. ఒకప్పుడు ఎన్నారైగా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న వంశీ, సోదరుడు చైతన్యతో కలిసి సొంతంగా యూనిట్‌ నెలకొల్పి 600 మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. కలెక్టర్‌ డీకే బాలాజీ, ఆర్డీవో పద్మావతి, తహసీల్దార్‌ శ్రీనివాసు, నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మించాలి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: వీరపనేనిగూడెం ఏపీఐఐసీ పారిశ్రామికవాడకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని మంత్రి టీజీ భరత్‌ను పారిశ్రామికవేత్తలు కోరారు. ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లి రైల్వేగేట్‌తో పాటు తెంపల్లి గ్రామంలోని ఇరుకైన దారుల్లో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. ప్రత్యామ్నాయ రహదారి చాలా అవసరమన్నారు. గొల్లపూడి-చిన్నఆవుటపల్లి ఆరులైన్ల జాతీయ రహదారికి మర్లపాలెం వద్ద సర్వీసు రోడ్డు నిర్మించాలని, తద్వారా తెంపల్లి గ్రామ శివారు నుంచి వీరపనేనిగూడెం చేరుకొనే ప్రస్తుత మార్గాన్ని విస్తరించడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ మార్గంగా వీరపనేనిగూడెం-తెంపల్లి మర్లపాలెం రోడ్డు విస్తరణకు అధికారులతో చర్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని