logo

పుట్టగానే కవల శిశువుల మృతి

పుట్టిన వెంటనే కవల శిశువులతో పాటు బాలింత కూడా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

Updated : 04 Jul 2024 06:07 IST

ఆపై బాలింత కన్నుమూత
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన

మృతి చెందిన కవల శిశువులు, తల్లి మాధవి

పటమట(విజయవాడ), న్యూస్‌టుడే: పుట్టిన వెంటనే కవల శిశువులతో పాటు బాలింత కూడా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోయారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరుకు చెందిన మాధవి(24) గతంలో వాలంటీర్‌గా పని చేశారు. మాధవి భర్త ప్రశాంత్‌ గంగూరు సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మాధవి కవల పిల్లల గర్భిణి. ఆమెకు మూడో నెల వచ్చినప్పటి నుంచి పటమటలోని పద్మావతి ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందుతోంది. ఈ నెల 2వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో నొప్పులు రావడంతో పటమటలోని పద్మావతి ఆసుపత్రిలో చేర్చించారు. 12.30 గంటలకు సాధారణ ప్రసవం జరిగి ఒకరు మగ శిశువు జన్మించి మరణించాడు. రాత్రి ఒంటి గంటకు శస్త్రచికిత్స చేసి డెలివరీ చేయగా రెండో మగ శిశువు కూడా కన్నుమూశాడు. మాధవికి కామెర్లు ఉన్నట్లు గుర్తించారు. అధిక రక్తస్రావం కూడా కావడంతో తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ నక్కల రోడ్డులోని ఆంధ్రా ఆసుపత్రిలో చేర్చించారు. మాధవి అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి బుధవారం ఉదయం 10 గంటలకు మరణించింది. భార్యతో పాటు ఇద్దరు శిశువులు కన్నుమూయడంతో ప్రశాంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ముగ్గురూ మృతి చెందారని పద్మావతి ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. సరైన వైద్యం అందించకపోవడంతో తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటమట పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నివేదిక వచ్చాక చర్యలు

బాలింతతో పాటు ఇద్దరు కవల శిశువుల మృతిపై విచారణ కమిటీ వేశాం. బాలింత చికిత్స పొందిన ఆంధ్రా ఆసుపత్రితో పాటు శిశువులు కన్నుమూసిన పటమటలోని పద్మావతి ఆసుపత్రికి విచారణ కమిటీ వెళ్లి పరిశీలించింది. బాలింతకు ఇచ్చిన మందులు, చేసిన వైద్య పరీక్షల గురించి ఆరా తీసింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత విచారణ కమిటీ నివేదిక అందజేస్తారు. ఆ నివేదికలో వైద్యుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం.

సుహాసిని, జిల్లా వైద్యాధికారిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని