logo

భార్య చేతిలో భర్త హతం

పద్ధతి మార్చుకోవాలని మందలించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చినతుమ్మిడి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది.

Published : 04 Jul 2024 05:03 IST

బంటుమిల్లి మండలం చినతుమ్మిడిలో ఘటన

అప్పారావు (పాత చిత్రం) నిందితురాలు కీర్తన

బంటుమిల్లి, పెడన, న్యూస్‌టుడే: పద్ధతి మార్చుకోవాలని మందలించినందుకు భర్తను భార్య హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం చినతుమ్మిడి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి వెలుగు చూసింది. పెడన రూరల్‌ సీఐ నాగేంద్ర ప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. చినతుమ్మిడికి చెందిన గుకిమి అప్పారావు(35), కీర్తనలు భార్యాభర్తలు కాగా.. వారికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే ఈ కుటుంబంలో గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య నడవడికపై అనుమానం పెంచుకున్న భర్త అప్పారావు ఆమెను పలుమార్లు మందలిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు పెరిగి తరచూ వివాదాలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి మద్యం మత్తులో ఉన్న అప్పారావు.. భార్యతో మరోసారి వివాదానికి దిగాడు. నీ నడవడికపై అనుమానం ఉందని ప్రశ్నించాడు. ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. అర్ధరాత్రి సమయంతో ఇరువురు మరోసారి గొడవకు దిగారు. దీంతో కీర్తన తన భర్తపై ఇనుప స్క్రూడ్రైవర్‌తో తల వెనుక నుంచి దాడి చేసింది. ఈఘటనలో తీవ్రగాయాలైన అప్పారావు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృతుడి సోదరి అచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ కేసు నమోదు చేశారు. అప్పారావు మృతదేహానికి మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై జి.వాసు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని