logo

పట్టిసీమ పరవళ్లు

కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు.

Published : 04 Jul 2024 05:00 IST

పంపుల నుంచి నీటి విడుదల

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే-పోలవరం: కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు. వైకాపా విచ్ఛిన్నం చేసిన ఎత్తిపోతల పథకాలను నెత్తిన నెట్టుకుని కాపాడుకుంటామని భరోసా నింపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోగా వరద నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టి పట్టిసీమ ద్వారా రైతు అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పది లక్షల ఎకరాలకు ఆయువు పట్టులా ఉండే పథకాన్ని వైకాపా గాలికొదిలేసిందని విమర్శించారు.

ప్రత్యేక పూజలు: ఉదయం 7.27 గంటలకు ఎత్తిపోతల మూడు మోటార్ల మీట నొక్కి నీరు విడుదల చేశారు. ఒక్కో మోటార్‌ నుంచి 350 క్యూసెక్కుల చొప్పున 1050 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. నీటి డిశ్ఛార్జ్‌ పాయింట్‌ దగ్గర పూజలు చేశారు.

ఆశల చిగురింత: పట్టిసీమ ఎత్తిపోతలకు 24 ద్వారాలుండగా బుధవారం నాలుగు ద్వారాల గుండా నీటిని విడుదల చేశారు. క్రమంగా గోదావరిలోకి వచ్చి చేరే వరద నీటి సామర్థ్యాన్ని బట్టి కృష్ణాడెల్టా అవసరాలకు అనుగుణంగా మిగిలిన ద్వారాల ద్వారా 8500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని మంత్రి నిమ్మల, అధికారులు తెలిపారు. ఈ నీటి ద్వారా కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. దాహం తీరే మార్గం లేక అవస్థలు పడుతున్న వేల గ్రామాలకు తాగునీరు అందుతుంది. గోదావరి పరవళ్లతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మళ్లీ మంచిరోజులొచ్చాయని హర్షం వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని