logo

వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు

తెదేపా రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ నగర వైకాపా నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు.

Published : 04 Jul 2024 04:46 IST

విజయవాడకు చెందిన 50 మందికి పైగా పాత్ర
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు

ఈనాడు - అమరావతి: తెదేపా రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులైన వైకాపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ నగర వైకాపా నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఈ కేసుపై పోలీసులు దృష్టి సారించడంతో అరెస్టు భయంతో బెజవాడ నాయకులు ఫోన్‌ స్విచాఫ్‌ చేసి అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతున్నారు. 2021 అక్టోబరు 19న మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకదాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో కేసును పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు విచారణ వేగవంతం చేశారు. దాదాపు 50 మందికి పైగా నాయకులు, వారి అనుచరుల పాత్ర ఉన్నట్లు తేలింది.

అంతా అవినాశ్‌ అనుచరులే...

దాడిలో పాల్గొన్న వారు గుణదల, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల వారిగా గుర్తించారు. వీరంతా వైకాపా నాయకుడు దేవినేని అవినాశ్‌ అనుచరులుగా తేలింది. నిందితుల్లో పలువురు కార్పొరేటర్లు ఉన్నట్లు తెలిసింది. 18వ డివిజన్‌ కార్పొరేటర్, వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ అరవ సత్యం, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ పుప్పాల కుమారి కుమారుడు రాజా, దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు బచ్చు మాధవి, గాంధీ సహకార బ్యాంకు డైరెక్టర్‌ జోగరాజు, మాజీ ఉప మేయర్‌ చల్లారావు తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి ప్రమేయంపై సాక్ష్యాలు కూడా  సేకరించినట్లు తెలిసింది. వీరంతా తమ వాహనాల్లో నగరం నుంచి అనుచరులను తీసుకెళ్లి మరీ దాడి చేయించారు. ఎం.పవన్, సాయి, దుర్గారావు, ఇతని బంధువు శేఖర్, సిరాజ్, జోగ రమణ, పంతల సాయి, చైతన్య అలియాస్‌ వర, సంతోష్, తదితరులు దాడి చేసిన వారిలో ఉన్నారు. 18, 21, 22 డివిజన్ల నుంచి ఎక్కువ మంది పాల్గొన్నారు.

అజ్ఞాతంలోకి పంపించారు...

దాడి ఘటన నిందితులను అజ్ఞాతంలోకి వెళ్లమని వైకాపా ముఖ్య నాయకుడి నుంచి సూచనలు వెళ్లినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామనీ, ఇబ్బంది లేదని వారిలో భరోసా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులు అరెస్టు అయి.. అసలు సూత్రధారుల పేరు చెబితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని కంగారు పడుతున్నారు. త్వరలో అవినాశ్‌ అనుచరుల అరెస్టులు ఉండవచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని