logo

బ్యాంకులో దగాకోరులు!

విజయవాడలోని పటమటకు చెందిన బాబు తన స్థలాన్ని గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో తనఖా పెట్టి రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. ఇది చెల్లించలేకపోవడంతో స్థలం వేలానికి వచ్చింది

Updated : 03 Jul 2024 06:18 IST

కమీషన్‌ ఏజెంట్లుగా ‘గాంధీ’ డైరెక్టర్లు

రుణగ్రహీతలకు అధిక వడ్డీలకు సొమ్ము
వైకాపా నేతల అండతో రెచ్చిపోయిన పాలకవర్గం

ఈనాడు, అమరావతి: విజయవాడలోని పటమటకు చెందిన బాబు తన స్థలాన్ని గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో తనఖా పెట్టి రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. ఇది చెల్లించలేకపోవడంతో స్థలం వేలానికి వచ్చింది. విలువైన ఈ స్థలాన్ని విక్రయించడం ఇష్టంలేని ఆయన స్థానిక తెదేపా నాయకుడిని సంప్రదించారు. ఆయన సిఫార్సుతో బ్యాంకు సిబ్బందిని కలవగా.. రుణం, వడ్డీ కలిపి రూ. 7 లక్షలు చెల్లించాలని తేల్చారు. అక్కడే ఉన్న బ్యాంకు డైరెక్టర్‌ ఒకరు ఆ మొత్తం చెల్లించారు. తిరిగి నెల వ్యవధిలో ఆ వ్యక్తి రుణాన్ని నవీకరించి రూ. 15 లక్షలకు పెంచారు. సదరు బ్యాంకు డైరెక్టరు ఇచ్చిన రూ. 7 లక్షలకు నెలకు వడ్డీ, కమీషన్‌ కలిపి మరో రూ. 1.50 లక్షలు తీసుకుని మిగిలిన సొమ్ము ఆ వ్యక్తికి ఇచ్చారు. కేవలం నెల రోజులకు దాదాపు రూ. లక్షన్నర వసూలు చేశారు. రుణం ఇచ్చినందుకు రూ. 50 వేలు లంచం కింద గుంజుకున్నారు. 

అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన అనిల్‌ రూ. 6 లక్షలు ఇంటి తనఖా రుణం తీసుకున్నారు. ఇందుకోసం ఓ డైరెక్టర్‌కు కమీషన్‌ కింద రూ. 50 వేలు ఇవ్వాల్సి వచ్చింది. వడ్డీ భారం ఎక్కువగా ఉండడంతో ఇటీవలే రుణం తీర్చేసి ఓ జాతీయ బ్యాంకులో తీసుకున్నారు.  

ఇదీ ఘనత వహించిన గాంధీ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో కమిషన్ల బాగోతం. ప్రజల సొమ్ముతో పాలకవర్గం పేరుతో కొంతమంది డైరెక్టర్లు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. రుణాల పేరుతో కమీషన్లు గుంజుతున్నారు. డాక్యుమెంట్లు సరైనవా కాదా? పట్టించుకోవడం లేదు. లేకపోతే కొర్రీలు వేసి రుణం ఇవ్వడం లేదు. బ్యాంకు సభ్యులైనా సరే.. రుణం కోసం కమీషన్లు ముట్టజెప్పాల్సిందే. రుణగ్రహీతల అవసరాలను అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ముతోనే వడ్డీ వ్యాపారం చేయడం గమనార్హం. స్వప్రయోజనాల కోసం బ్యాంకు పదవులను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదిస్తున్నారు. గత ఎన్నికల్లో అయితే.. వైకాపా నాయకుల అండతో పాలకవర్గం రెచ్చిపోయింది. ఆ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో ఛైర్మన్‌ పాల్గొనగా.. ఓ డైరెక్టర్‌ తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పాల్గొన్నారు. గతంలోనే ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసివ్వగా వైకాపా పెద్దల జోక్యంతో కొంతమంది డైరెక్టర్లను తమవైపు తిప్పుకున్నారు. 

దళారులుగా అవతారం..

గాంధీ కోపరేటివ్‌ బ్యాంకులో బ్యాంకు డైరెక్టర్లే దళారులుగా, వడ్డీ వ్యాపారులుగా అవతారమెత్తారు. రుణగ్రహీతల నిస్సహాయతను తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు గుంజుతున్నారు. వీలుంటే.. ఆర్థిక సహాయం చేసి వేలానికి వచ్చిన ఆస్తులను విడిపించడం, తరువాత రుణం రెట్టింపు చేసి తమ వడ్డీ, కమీషన్‌ తీసుకోవడం.. లేదా వేలానికి వచ్చిన ఆస్తులనే బినామీ అవతారాలతో తక్కువ ధరలకు దక్కించుకుని వెంటనే విక్రయించేయడం.. ఇవీ వారు చేస్తున్న పనులు. అదే ఆస్తిని తమ బ్యాంకులో తనఖా పెట్టి రుణం మంజూరు చేయించడం ఎన్నాళ్ల నుంచో జరుగుతోంది. తనఖా రుణాలు తీసుకున్నవారిలో సగంమందికిపైగా డాక్యుమెంటేషన్‌ సరిగా లేదని విశ్వసనీయ సమాచారం. లోతుగా పరిశీలన చేస్తే కళ్లు బైర్లుకమ్మే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఉన్న అన్ని శాఖల్లోనూ ఒకరిద్దరు తప్ప మిగిలిన డైరెక్టర్లదే పెత్తనం. వీరంతా వైకాపా అభిమానులే. జగన్‌ సీఎం అవుతారంటూ ఓ డైరెక్టర్‌ పందెం కూడా కాశారు. రుణాలను ఎక్కువశాతం వైకాపా అభిమానులకే మంజూరు చేశారన్న ఆరోపణ కూడా ఉంది. గత ఐదేళ్లుగా బ్యాంకు తీరు నచ్చక సభ్యులు వైదొలగుతున్నారు. కొంతమంది డిపాజిట్లను ఉపసంహరించుకుంటున్నారు. 

నా దగ్గరకు తీసుకురండి..

 బ్యాంకుపై వస్తున్న ఆరోపణలను ఛైర్మన్‌ వేమూరి వెంకట్రావు ఖండించారు. డైరెక్టర్లు వడ్డీ వ్యాపారం చేస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ‘నా దగ్గరకు తీసుకురండం’టూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కొంతమంది పనిగట్టుకుని ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. మరోవైపు సోమవారం ఒక్కరోజే రూ. 8 కోట్ల బ్యాంకు డిపాజిట్లను వాపసు తీసుకున్నారని చెప్పారు. పాలకవర్గం చేస్తున్న ప్రైవేటు వడ్డీ వ్యాపారాన్ని ఖాతాదారులు ఎందుకు సహిస్తారో బ్యాంకు ఛైర్మన్‌ గ్రహించాలని మిగిలిన డైరెక్టర్లు సూచిస్తున్నారు.

జోగరాజు తొలగింపు..?

గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు బోర్డు సమావేశాన్ని మంగళవారం రాత్రి ఛైర్మన్‌ వేమూరి వెంకట్రావు అత్యవసరంగా నిర్వహించారు. సాయంత్రం 6.10 గంటలకు వాట్సప్‌ సందేశం పంపి రాత్రి 7 గంటలకు సమావేశం అని పేర్కొన్నారు. ముగ్గురు తప్ప మిగిలినవారు హాజరైనట్లు తెలిసింది. డైరెక్టర్‌ జోగరాజును తొలగిస్తున్నట్లు మినిట్స్‌ పుస్తకంలో రాశారు. ఆయన వైకాపా తూర్పు ఇంఛార్జి దేవినేని అవినాష్‌ అనుచరుడు కావడం గమనార్హం. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో జోగరాజు పాల్గొన్నట్టు ఆరోపణలు రావడంతో రాజీనామాకు ఒత్తిడి చేశారు. పాలకవర్గంపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనను తొలగిస్తున్నట్లు మినిట్స్‌లో నమోదు చేసి సమావేశాన్ని అయిదు నిమిషాల్లో ముగించేశారు. మినిట్స్‌లో రాస్తే తొలగించినట్లు రాదని వ్యతిరేకవర్గం వాదిస్తోంది.


అక్రమాలపై విచారణ

బ్యాంకు నిర్వహణ తీరు, పాలకవర్గం అవినీతిపై వచ్చిన ఆరోపణలు అన్నింటిపైనా విచారణ చేస్తున్నాం. సహకార శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు లోతుగా దర్యాప్తు చేస్తున్నాం.

- జిల్లా సహకార అధికారి (డీసీవో) శ్రీనివాసరెడ్డి.

విచారణ, దర్యాప్తు కోసం ప్రస్తుతం మూడు బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకు ప్రధాన శాఖ కార్యాలయంతోపాటు అన్ని శాఖలపైనా దృష్టి పెట్టాం. 
- డిప్యూటీ రిజిస్ట్రార్‌ (డీఎల్‌సీవో) కిరణ్‌కుమార్‌

విజయవాడ కేంద్రంగా ఉన్న గాంధీ కోపరేటివ్‌ బ్యాంకులో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ ప్రారంభమైంది. గత ఆరు నెలల్లో ఇది రెండో విచారణ కావడం గమనార్హం. బ్యాంకు పాలకవర్గం వైకాపా నాయకులతో అంటకాగుతూ.. వారి సేవలో తరిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిందిపోయి.. గత అయిదేళ్లుగా వైకాపా పాట పాడింది. అక్రమ వ్యవహారాలపై ‘ఈనాడు’లో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు రంగంలోకి దిగారు. శనివారం పటమట శాఖలో విచారణ జరిపారు. గత ఎన్నికల సమయంలో ఈ శాఖ నుంచి దాదాపు రూ. 4 కోట్ల వరకు అనధికారిక చెల్లింపులు జరిపినట్టు ఫిర్యాదులొచ్చాయి. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులపై వైకాపా నాయకులు రాజకీయపరమైన ఒత్తిడి తెస్తున్నారు. ఆరోపణల నేపథ్యంలో జోగరాజు అనే డైరెక్టర్‌ను రాజీనామా చేయాలని ఛైర్మన్‌ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. 

పాలకవర్గంపై వచ్చిన ఆరోపణలివే.. 

  • నష్టాల్లో ఉన్న గుంటూరు శాఖను మూసేయకుండా మరింత నష్టాలు వచ్చేవిధంగా వ్యవహరిస్తున్నారు. హనుమాన్‌జంక్షన్, నూజివీడు శాఖల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండగా.. పాలకవర్గానికి తెలియకుండా, ఆమోదం లేకుండానే కార్యాలయాల కోసం రూ. కోట్లు వెచ్చించి అధిక ధరలకు స్థలాలను కొనుగోలు చేశారు.
  • గాజువాకలో కొత్త శాఖ ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమతి లేదు. అయినా ఇంటి యజమానితో ఒప్పందం లేకుండా దాదాపు రూ. 37 లక్షల వరకు ఖర్చు చేశారు.
  • గతేడాది అన్యాయంగా సుమారు 8 వేలమంది (తెదేపా సానుభూతిపరులుగా అనుమానం) సభ్యత్వం నోటీసు ఇవ్వకుండానే తొలగించారు.
  • ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అర్బన్‌ బ్యాంకులో ఏడుగురు, గ్రామీణ బ్యాంకులో ఆరుగురు ఉద్యోగులు ఉండాలి. ఇష్టానుసారం అంతకుమించి నియమించేశారు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని