logo

ప్రేమ పేరుతో వల

హైదరాబాద్‌లోని ఓ షాపులో రూ.18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 03 Jul 2024 06:19 IST

 యువతులను ట్రాప్‌ చేయడం అంజాద్‌ నైజం
 పలు ప్రాంతాలు తిరిగి.. డబ్బుల్లేక అష్టకష్టాలు 
తేజస్విని ఆచూకీ లభ్యంతో ఊపిరిపీల్చుకున్న తల్లిదండ్రులు


ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - పటమట : గత తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన భీమవరం యువతి తేజస్విని ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో సీనియర్‌ అయిన అంజాద్‌ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తేజస్వినికి దగ్గరయ్యాడు. ఇదే విధంగా అమ్మాయిలకు వల వేస్తుంటాడని తెలిసింది. విజయవాడలో తేజస్విని చదివే కళాశాలలో చదువుతున్న ఓ యువకుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీని అంజాద్‌కు ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తేజస్వినితో మాటలు కలిపి ప్రేమ పేరుతో వల వేశాడు. రెండేళ్ల కిందట విజయవాడ నగరంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటూ ఓ యువతిని ఇలానే ప్రేమ పేరుతో ట్రాప్‌ చేశాడు. ఆ యువతిని తీసుకుని వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. అంజాద్‌తో పాటు యువతిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి యువతిని తల్లిదండ్రులతో పంపించారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా యువతులకు మాయమాటలు చెప్పి సన్నిహితంగా మెలిగేవాడని సమాచారం.

గత ఏడాది అక్టోబర్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు

తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అంజాద్‌ అలియాస్‌ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని ట్రాప్‌ చేశాడు. కొంతకాలం సన్నిహితంగా మెలిగిన తర్వాత గత ఏడాది అక్టోబర్‌ 28వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. వెళ్లేటప్పుడు అంజాద్‌.. ఇంటి నుంచి కొంత నగదును తీసుకెళ్లినట్లు తెలిసింది. మరుసటి రోజు సాయంత్రం కూడా భీమవరం రాకపోయేసరికి.. కంగారు పడిన యువతి తల్లి విజయవాడ వచ్చి.. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాచవరం పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

సోదరికి ఇన్‌స్టాలో మెసేజ్‌తో..

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశంతో కదిలిన నగర పోలీసులు తిరిగి దర్యాప్తు ప్రారంభించినా పురోగతి లభించలేదు. వీరు వాడుతున్న ఫోన్‌ నంబర్లు తెలియకపోవడమే ఇందుకు కారణం. విజయవాడ నుంచి వెళ్లినప్పటి నుంచి యువతిని ఇతరులతో మాట్లాడేందుకు అంగీకరించేవాడు కాదు. కొత్త ఫోన్‌ తీసుకున్న తర్వాత కూడా ఫోన్‌ ఇవ్వలేదు. అంజాద్‌ లేని సమయంలో అతని ఫోన్‌ నుంచి తన అక్కకు ఇన్‌స్ట్రాగ్రాంలో మెసేజ్‌ పెట్టింది. ఈ విషయాన్ని తేజస్విని కుటుంబ సభ్యులు.. సోమవారం సాయంత్రం విజయవాడ పోలీసులకు చేరవేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆమె అక్క ఫోన్‌ నుంచి తేజస్వినితో చాట్‌ ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. వారు ఎక్కడ ఉన్నారో.. స్పష్టంగా చెప్పలేకపోయింది. ఇన్‌స్టాగ్రాం ద్వారా ప్రస్తుత లొకేషన్‌ పంపించమని అడిగారు. దీంతో కరెంట్‌ లొకేషన్‌ను యువతి పంపింది. అది వేరే దేశానిది చూపించడంతో పోలీసులు నిరుత్సాహానికి గురయ్యారు. అమెజాన్‌ ద్వారా ఇటీవల.. ఫొటోఫ్రేమ్‌ను బుక్‌ చేశారు. దీని తాలూకూ పార్శిల్‌ పెట్టెపై ఉన్న చిరునామాను ఫొటో తీసి అక్కకు పంపించింది. దీని ద్వారా వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. ఆ చిరునామాను వెంటనే జమ్మూ పోలీసులకు పంపించారు. వారు పరిశీలించి.. అది జమ్మూలోని గాంధీనగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ప్రాంతంగా గుర్తించారు. వెంటనే బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి.. వారిని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో కథ సుఖాంతం అయింది.

ఫోన్లు, చెవి కమ్మలు అమ్మేసి..¸

కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. యువతీ, యువకుల ఫోన్ల సిగ్నళ్ల ఆధారంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు హోటల్‌కు చేరుకునేసరికి అక్కడ నుంచి వీరు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆచూకీ అక్కడి సీసీ కెమెరాల్లోనూ లభించలేదు. అనంతరం డబ్బులకు ఇబ్బంది రావడంతో హైదరాబాద్‌లోని ఓ షాపులో రూ.18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మేశారు. ఆ నగదుతో కేరళ వెళ్లిపోయారు. ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా ఫోన్లు విక్రయించిన దుకాణానికి వెళ్లి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరి స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టినా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.  తొలుత హైదరాబాద్‌ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ఇల్లు అద్దెకు దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. అది ఫలించకపోవడంతో కేరళకు వెళ్లి 10 రోజులు ఉన్నారు. అక్కడా ఇల్లు దొరక్కపోవడంతో తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. అక్కడ తేజస్విని తన చెవి కమ్మలు, బంగారు వస్తువులను రూ.15వేలకు అమ్మేసింది. అక్కడి నుంచి రాజస్థాన్‌ వెళ్లారు. కొంతకాలం తర్వాత మళ్లీ ముంబయికి.. అక్కడి నుంచి పూణే దిల్లీ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఉండి డబ్బులు అయిపోవడంతో.. రైలెక్కి జమ్మూ వెళ్లారు. అక్కడ తిరిగి తిరిగి ఓ హోటల్‌లో పనికి కుదిరాడు అంజాద్‌. హోటల్‌ యాజమాని కేటాయించిన గదిలో వీరిద్దరూ ఉంటున్నారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో తేజస్విని, అంజాద్‌లు పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. డబ్బుల్లేక పలు చోట్ల రైళ్లలో టికెట్‌ కొనకుండానే ప్రయాణం చేసినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని