logo

కృష్ణా డెల్టాకు.. పట్టిసీమ మహాభాగ్యం

ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు.

Updated : 03 Jul 2024 06:21 IST

నేడే పంపుల ద్వారా నీరు విడుదల 
సరైన సమయంలో ఆదుకుంటున్న గోదావరి

ఐదేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు పుష్కలంగా పారనున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లు పట్టిసీమను వట్టిసీమగా మార్చి గతేడాది మాత్రం 33 టీఎంసీలు అత్యవసరంగా తీసుకున్నారు. గతేడాది ఆగస్టు 11న పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించి కేవలం నెల రోజులకే నిలుపుదల చేశారు. గోదావరిలో జలాలు ఉన్నా.. డెల్టాకు అవసరం ఉన్నా.. గత ఏడాది మాత్రం పట్టిసీమ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో పట్టిసీమకు, కృష్ణా డెల్టాకు మహర్దశ పట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పంపులను బుధవారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి జలాలు చేరనున్నాయి. సరైన వర్షాలు లేక ప్రకాశం బ్యారేజీ అడుగంటి, పులిచింతల ఎండిపోయిన ఈ పరిస్థితుల్లో పట్టిసీమ వరప్రదాయినిగా మారింది. గోదావరిలో ప్రస్తుతం 26.72 అడుగుల స్థాయిలో వరద ప్రవాహం ఉంది. కేవలం 14 అడుగులు దాటితే పట్టిసీమ ఎత్తిపోతలకు నీరు అందే అవకాశం ఉంది. పట్టిసీమ సామర్థ్యం 8,500 క్యూసెక్కులు. బుధవారం దాదాపు అన్ని పంపులను నిర్వహణలోకి తెచ్చి దాదాపు 6వేల క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు, నీటి ఆవిరితో కలిపి ఈ ఖరీఫ్‌కు 155.40 టీఎంసీలు కావాల్సి ఉంది. గత ఏడాది కృష్ణా డెల్టాకు 194.62 టీఎంసీలు వినియోగించినట్లు ఇంజినీర్లు లెక్కలు వేశారు. ఈ ఏడాది గోదావరి పొంగినా పట్టిసీమ నుంచి నీరు తీసుకోలేదు. పులిచింతలలో ఉన్న నీరు ఖాళీ చేశారు. మూసీ వరద రావడంతో 32.67 టీఎంసీలకు నీరు అదనంగా తీసుకున్నారు. గత ఏడాది వరదల వల్ల వచ్చిన జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. నీరు లేదని రెండో పంటకు విడుదల చేయలేదు. రబీకి క్రాప్‌ హాలిడే ప్రకటించారు. విజయవాడ నగరానికి తాగునీటికి కటకట అయింది. గ్రామీణంలోనూ చెరువుల వద్ద పోలీసు బలగాలను పెట్టి వేసవిలో తాగునీటి కోసం కాలువల ద్వారా నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది పట్టిసీమ నీరు తీసుకోకపోవడం వల్ల డెల్టా రైతులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 

దిగుబడి పెరగనుంది..

గోదావరి జలాలు కృష్ణా డెల్టాలో పారితే వరి దిగుబడులు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. ఇది 2016 ఖరీఫ్‌ నుంచి రుజువైంది. 2019 నుంచి 23 వరకు పాలకుల పుణ్యమాని గోదావరి జలాలు లేక వరి దిగుబడులు తగ్గాయి. మళ్లీ ఈ ఏడాది పట్టిసీమ నీరు అందిస్తున్నారన్న సమాచారం రైతుల్లో ఆనందం నింపుతోంది. కృష్ణా జలాల కన్నా గోదావరి జలాల్లో ఒండ్రు మట్టి ఎక్కువ ఉండి పోషకాలు అందుతాయని విశ్లేషిస్తున్నారు. పోలవరం కాలువ వెంట గన్నవరం నియోజకవర్గానికి మోటార్ల ద్వారా నీటిని తోడుకునే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ, మాజీ ఎమ్మెల్యే వంశీ ఇద్దరూ విజ్ఞప్తి చేశారు. 
- ఈనాడు, అమరావతి ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని