logo

అంకితభావంతో విధులు నిర్వహించండి

ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ బాలాజీ నూతనంగా ఉద్యోగం పొందిన వారికి సూచించారు

Published : 03 Jul 2024 05:45 IST

కారుణ్య నియామక పత్రం అందజేస్తున్న కలెక్టర్‌ బాలాజీ, పక్కన డీఆర్వో చంద్రశేఖరరావు 

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్‌ బాలాజీ నూతనంగా ఉద్యోగం పొందిన వారికి సూచించారు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అర్హత సాధించిన ఐదుగురికి మంగళవారం కలెక్టర్‌ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఉద్యోగాలు పొందిన బి.రాజేంద్రను ఆడిట్‌ శాఖలో జూనియర్‌ ఆడిటర్‌గా, ఎం.అవినాష్‌ను రవాణా శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, షేక్‌ జాస్మిన్‌ను విజయవాడ సర్వజనాసుపత్రిలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, ఎ.పవన్‌ను ఎన్టీఆర్‌ జిల్లాలో గ్రేడ్‌-2 గ్రామ రెవెన్యూ అధికారిగా, టీడీ పవన్‌కుమార్‌ను రవాణా శాఖలో కార్యాలయ సబార్డినేట్‌గా నియమించినట్టు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు, కలెక్టరేట్‌ ఏవో నాంచారయ్య పాల్గొన్నారు.

 పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ..

కలెక్టరేట్‌(మచిలీపట్నం): జిల్లాలోని అన్ని పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు తగు రక్షణ కల్పించేలా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ బాలాజీ ఆదేశించారు. మహిళల లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వీసీ ద్వారా కలెక్టర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. చట్టాన్ని అమలు చేసేందుకు కలెక్టర్‌ ఛైర్‌పర్సన్‌గా ఐదు మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. మహిళలపై ప్రత్యేకశ్రద్ధ వహించే సామాజిక కార్యకర్తగా విశ్రాంత ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సూవిజ్జు, సీడీపీవో సముద్రవేణి, బాలల హక్కుల ఫౌండేషన్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ ఫ్రాన్సిస్, న్యాయసలహాదారుగా కోటేశ్వరమ్మలతో పాటు ఐసీడీఎస్‌ పీడీ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా కమిటీలో ఉంటారన్నారు. ఈ కమిటీతో పాటు ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంఘటిత, అసంఘటిత రంగాలకు సంబంధించి పనిచేసే ప్రదేశాల్లోనూ ఐదుగురు సభ్యులతో కూడిన అంతర్గత(ఇంటర్నల్‌) కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కమిటీలు సజావుగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించేందుకు రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల నుంచి 29 మంది నోడల్‌ అధికారులను నియమించామన్నారు. ఎక్కడైనా మహిళలు వేధింపులు, హింసకు గురైనా, మాటలు, చేతల రూపంలో అసభ్య ప్రవర్తన బారిన పడినా వెంటనే అంతర్గత కమిటీలకు ఫిర్యాదు చేయాలన్నారు. బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు అన్ని విధాలా అండ, రక్షణ కల్పిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఐసీడీఎస్‌ పీడీ సువర్ణ, ఈవో విజయలక్ష్మి, సఖి కేంద్ర పరిపాలనాధికారి, ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బంది, అంతర్గత కమిటీ సభ్యులు, నోడల్‌ అధికారులు వీసీకి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని