logo

పెడన-విస్సన్నపేట హైవే విస్తరణకు సన్నాహాలు

రాష్ట్ర హైవే నుంచి జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన పెడన-విస్సన్నపేట మార్గం విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు

Published : 03 Jul 2024 05:43 IST

సుదీర్ఘ బైపాస్‌ నిర్మాణం
భూసేకరణకు కార్యాచరణ

భూ సేకరణ కోసం సర్వే చేస్తున్న రెవెన్యూ సిబ్బంది 

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే:  రాష్ట్ర హైవే నుంచి జాతీయ రహదారిగా గుర్తింపు పొందిన పెడన-విస్సన్నపేట మార్గం విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు వరసలుగా ఉన్న ఈ రహదారిని నాలుగు నుంచి ఆరుకు అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల కిందటే ప్రణాళికలు రూపొందించారు. కేంద్ర రవాణా, హైవే మంత్రిత్వ శాఖ(మోర్త్‌) ఆధ్వర్యంలో ఈ ఏడాది చివర్లో విస్తరణ పనులు ప్రారంభించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే సమగ్ర నివేదిక(డీపీఆర్‌)ను సిద్ధం చేసిన యంత్రాంగం, భూసేకరణ ప్రక్రియ ఆరంభించింది. ఈ క్రమంలోనే కీలకమైన హనుమాన్‌జంక్షన్‌ను విస్తరణ నుంచి మినహాయిస్తూ సుదీర్ఘ బైపాస్‌ నిర్మించే ప్రతిపాదన కూడా ఖరారైంది. కాకుంటే అధికారులెవ్వరూ దీనిపై నోరు మెదపకపోవడం, పలుచోట్ల రైతులకు సమాచారం లేకుండానే సర్వే జరపడం అనుమానాలకు తావిస్తోంది. 

216 హెచ్‌ రహదారిగా నామకరణం చేసిన ఈ మార్గాన్ని పెడన నుంచి లక్ష్మీపురం (తిరువూరు సమీపం) వరకు దాదాపు 121 కి.మీ. మేర విస్తరించనున్నారు. బందరు పోర్టు, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడు రైల్వేస్టేషన్లను కూడా దీంతో అనుసంధానించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల అంచనా వ్యయం రూ.1,800 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తం అయిదు నియోజకవర్గాల పరిధిలో వ్యాపించి ఉన్న ఈ మార్గం నాలుగు హైవేలను అనుసంధానం చేస్తుంది. పెడన వద్ద 216, గుడివాడ వద్ద 165, హనుమాన్‌జంక్షన్‌ వద్ద 16, లక్ష్మీపురం వద్ద 13వ జాతీయ రహదారులను దాటుకుంటూ ముందుకు వెళుతుంది. మరోవైపు తెలంగాణకు రాకపోకలు సాగించడానికి కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో దీనిని త్వరితగతిన విస్తరించనున్నారు.

ముమ్మరంగా సర్వే  :  రహదారి విస్తరణ, సుదీర్ఘ బైపాస్‌ ప్రతిపాదనల నేపథ్యంలో భూ సేకరణకు వీలుగా ముమ్మర సర్వే చేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఓ ప్రముఖ సంస్థకు కన్సల్టెన్సీగా వ్యవహరించిన క్రమంలో ఇప్పటికే డీపీఆర్‌ తయారు చేసి మోర్త్‌కు అప్పగించారు. దీని ప్రకారం సుమారు రెండు వేల హెక్టార్లు భూమి అవసరంగా గుర్తించారు. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికార్లు విస్తరణ, బైపాస్‌ల నిర్మాణానికి అనుగుణంగా సేకరించాల్సిన భూ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. గత కొన్ని వారాలుగా క్షేత్రసర్వే నిర్వహిస్తున్నారు. వేలేరు వంటి గ్రామాల్లో రైతులకు సమాచారం లేకపోడం, ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా పేర్కొనడం, ఎవరి భూమి ఎంత మేరకు పోతుందనేది హద్దులు చూపలేదనే ఆరోపణలతో సర్వే ప్రక్రియ వివాదాస్పదమైంది.

సుదీర్ఘంగా బైపాస్‌ : 216 హెచ్‌ని విస్తరించే క్రమంలో హనుమాన్‌జంక్షన్‌తో పాటు పలుచోట్ల భూ సేకరణ, ఆక్రమణల తొలగింపు అనేక వ్యయ, ప్రయాసలతో కూడుకున్నట్లుగా భావించడంతో బైపాస్‌ నిర్మించడమే మేలని నిర్ణయించారు. అందుకే డీపీఆర్‌లో బైపాస్‌ను ఖరారు చేశారు. పెదపారపూడి, నందివాడ, బాపులపాడు మండలాల మీదుగా దాదాపు 22 కి.మీ మేర బైపాస్‌ నిర్మాణం జరగనుంది. 34 కి.మీ నుంచి 56 కి.మీ వరకు బైపాస్‌ వ్యాపించి ఉంటుంది. పెదపారపూడి మండలం పాములపాడు, నందివాడ మండలం నూతులపాడు, పుట్టగుంట, నందివాడ, పెదలింగాల, బాపులపాడు మండలం కానుమోలు, శేరీనరసన్నపాలెం, బాపులపాడు, వేలేరు గ్రామాల మీదుగా బైపాస్‌ నిర్మంచేలా మార్గం రూపొందించారు.


పారదర్శకత కావాలి

బైపాస్‌ నమూనా, భూ సేకరణ ప్రక్రియలో పారదర్శకత లేదనిపించి ఉన్నతాధికార్లకు ఫిర్యాదు చేశాం. దీంతో వేలేరులో గ్రామసభ నిర్వహించారు. రైతులకు అన్యాయం జరగకుండా, సక్రమంగా భూ సేకరణ ప్రక్రియ జరిపితే సహకరిస్తాం. లేకుంటే అడ్డుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశాం. మోర్త్‌ అధికార్లు కూడా పారదర్శకంగా వివరాలు బహిర్గత పర్చాలి.

- వేములపల్లి శ్రీనివాసరావు, రైతు నాయకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని