logo

వివాదాస్పద దేవదాయశాఖ ఏసీపై వేటు

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కె.శాంతిపై మంగళవారం సస్పెన్షన్‌ వేటు పడింది.

Published : 03 Jul 2024 05:36 IST

వైకాపా హయాంలో చక్రం తిప్పిన అధికారి

ఈనాడు, అమరావతి: కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కె.శాంతిపై మంగళవారం సస్పెన్షన్‌ వేటు పడింది. ఎన్టీఆర్‌ జిల్లాలోని పలు దేవాలయాల పరిధిలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి ఈమెపై తొమ్మిది అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెపై బదిలీ వేటు వేస్తూ.. దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. కె.శాంతి విశాఖపట్నంలో పనిచేస్తున్న సమయంలో తన పై అధికారిపై ఇసుకపోసి.. వివాదాస్పదమయ్యారు. ఆ సమయంలో వైకాపాకు సంబంధించిన కీలక ఎంపీ అండదండలు ఆమెకు ఉండడంతో దేవాదాయశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా.. బాధితుడైన సదరు ఉన్నతాధికారిని అక్కడ నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత.. శాంతిని తీసుకొచ్చి కృష్ణా జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. పక్కనే ఉన్న ఎన్టీఆర్‌ జిల్లాకు కూడా ఈమెనే ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో అప్పటి నుంచి రెండు జిల్లాల పరిధిలో దేవదాయశాఖలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు, అవినీతికి పాల్పడిన వారికి కొమ్ముకాస్తూ వచ్చారు. తాజాగా ఈమెపై తొమ్మిది అభియోగాలతో ఛార్జెస్‌ ఫ్రేమ్‌ చేసి సస్పెన్షన్‌ వేటు వేశారు.  

బాధ్యతల స్వీకరణ

కృష్ణా జిల్లాకు ఎన్‌.సంధ్యా, ఎన్టీఆర్‌ జిల్లాకు సీతరావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు. సీతారావమ్మ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని