logo

అక్రమ బట్టీలపై రెవెన్యూ అధికారుల కొరడా

ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం కొటికలపూడి, మూలపాడు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీలను నిర్వహిస్తున్న వైకాపా నాయకులకు రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు

Published : 03 Jul 2024 05:34 IST

వైకాపా నాయకులకు నోటీసులు

 మూలపాడులో ప్రభుత్వ భూమిలో ఇటుకబట్టీ 
ఇబ్రహీంపట్నంగ్రామీణం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం కొటికలపూడి, మూలపాడు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీలను నిర్వహిస్తున్న వైకాపా నాయకులకు రెవెన్యూ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు.. మూలపాడులోని నదీ పరివాహక ప్రాంత సర్వే నంబరు-209 ప్రభుత్వ భూమిలో వైకాపా నాయకుడు గొట్టుముక్కల పోతురాజు, కొటికలపూడి గ్రామానికి చెందిన ఆంధ్రా ఫీల్డ్‌ లేబరు కో-అపరేటీవ్‌ సొసైటీకి చెందిన సర్వే నంబరు-121లో వైకాపా నాయకులు గరికపాటి రాంబాబు ఇరువురు వ్యవసాయం కోసం పొలాలు లీజుకు తీసుకుని వాటిలో దీర్ఘకాలంగా అక్రమంగా ఇటుక బట్టిలు నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు ఆయా గ్రామాలకు చెందిన కొందరు గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లు రంగంలోకి దిగి సర్వే చేశారు. వాటిని కేవలం సాగు కోసమే లీజుకు ఇచ్చినట్లు రెవెన్యూ దస్త్రాల్లో ఉన్నట్లు నిర్ధారించారు. అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న వారికి నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో వివరించారు. 

ఫిర్యాదు మేరకే విచారణ: నదీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి సర్వే చేసి ఇటుక బట్టీల నిర్వాహకులను విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది. 
- బిఎస్‌విఎస్‌ఆర్‌ఎల్‌ రాజు, తహసీల్దారు, ఇబ్రహీంపట్నం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని