logo

పసుపు నోము పండగ.. వెలిగె మోము నిండుగ!

తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది.

Updated : 02 Jul 2024 06:06 IST

పింఛన్ల పంపిణీలో రికార్డు
ఒకే రోజు 95 శాతం మందికి అందజేత
ఈనాడు - అమరావతి

తెెలతెలవారుతుండగానే కృష్ణా తీరాన ఒకటే సందడి. సామాజిక పింఛనుదారుల ఇళ్ల వద్ద పండగ.. పెరిగిన పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చేందుకు తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు, సచివాలయాల సిబ్బంది రావడంతో ప్రతిచోటా ఆనందం తాండవించింది. ఉదయం 6 గంటల నుంచే దాదాపు 11 వేలమంది సచివాలయాల సిబ్బంది ఉత్సాహంగా రంగంలోకి దిగి సాఫీగా పంపిణీ చేశారు. పెంచిన పింఛను రూ.4 వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్‌ నెలల బకాయి రూ.3 వేలు కలిపి మొత్తం రూ. 7 వేలను లబ్ధిదారులు ఒకేసారి అందుకున్నారు. దివ్యాంగులకు పెంచిన రూ. 3 వేలు కలిపి రూ. 6 వేల చొప్పున అందజేశారు.

విజయవాడ గిరిపురంలో వృద్ధురాలికి పింఛను అందిస్తున్న కలెక్టర్‌ సృజన,
పక్కన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

నాడు వైకాపా సర్కారు వికృత క్రీడ

గత మే నెలలో సరిగ్గా ఎన్నికలకు పదిరోజుల ముందు పింఛన్ల పంపిణీ పేరుతో నాటి జగన్‌ ప్రభుత్వం, వైకాపా నేతల వికృత క్రీడను లబ్ధిదారులు ఎప్పటికీ మరచిపోలేరు. వేల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్, ఫోన్‌ నంబర్లు లింకు కాకపోవడంతో అవి స్తంభించిపోయాయని తెలిసి మరీ వాటిల్లోనే జమ చేశారు. నాడు లబ్ధిదారులు మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగి నరకం అనుభవించారు. అంతటా వృద్ధులు, దివ్యాంగులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. 40 డిగ్రీలకుపైబడి ఉష్ణోగ్రతను తట్టుకోలేక చాలామంది సొమ్మసిల్లగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. గ్రామాల నుంచి ఆటోల్లో బ్యాంకులకు వచ్చారు. ఆనాడు కూడా సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేసే వెసులుబాటు ఉన్నా.. జగన్‌ ప్రభుత్వం కావాలనే వికృత క్రీడకు తెర తీసింది. తాజాగా తెదేపా కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితోనే నిరాటంకంగా పింఛన్ల పంపిణీని చేసి చూపించింది.

మచిలీపట్నం: జిల్లాపరిషత్‌ సెంటరు ప్రాంతంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న
మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ బాలాజీ తదితరులు

కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచి తెదేపా, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు, నాయకులు, సచివాలయాల సిబ్బంది పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఉదయం 8 గంటలకే 30 శాతానికిపైగా పంపిణీ చేశారు. మధ్యాహ్నానికి 60 శాతం, సాయంత్రం 5 గంటలకు 80 నుంచి 90 శాతం పంపిణీ పూర్తయింది. రాత్రి 7 గంటల సమయానికి కృష్ణాలో 95 శాతం, ఎన్టీఆర్‌ జిల్లాలో 93 శాతం పంపిణీ చేశారు. అక్కడక్కడా సర్వర్‌ సమస్యలు తలెత్తినా పెద్దగా ప్రభావం చూపలేదు. కృష్ణా జిల్లాలో సాయంత్రం 5 గంటల్లోపే రూ. 150.53 కోట్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో రాత్రి 7 గంటల సమయానికి రూ. 151.21 కోట్లను లబ్ధిదారులకు అందించారు.

మొదటి నెల రూ.7 వేల పింఛను అందుకున్న వృద్ధుల్లో ఆనందం

ఆనందానికి అవధుల్లేవు.. ఇచ్చిన మాట మేరకు బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే పెంచిన పింఛన్ల దస్త్రంపై సంతకం చేశారు. అన్నట్టుగానే జులై 1న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు సహా లబ్ధిదారులందరికీ పింఛన్లను అందించారు.

అన్ని నియోజక వర్గాల్లోనూ చంద్రబాబు, ప్రధాని మోదీ, ఉప ముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ల చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు చేశారు.

రెడ్డిపాలెంలో ఒకేసారి రూ.7 వేల నగదు చేతికివ్వడంతో ఆనందంతో వాటిని నేలపరిచి కళ్లనిండా చూసుకుంటున్న పోసిన మహాలక్ష్మీ


కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, వితంతువులు సహా మొత్తం పింఛనుదారులు 4,78,736
సోమవారం రాత్రి 7 గంటల సమయానికి పింఛనుదారులు అందుకున్న సొమ్ము రూ. 323 కోట్లు
రెండు జిల్లాల్లోని సచివాలయాలు 1,113
వీటి పరిధిలోని సిబ్బంది సుమారు  11,000
రాత్రి 7 గంటలకు పంపిణీ శాతం
కృష్ణా జిల్లాలో  95%
ఎన్టీఆర్‌లో.. 93%


వైద్య ఖర్చుల కష్టాలు తీరాయి

వేకనూరులో పక్షవాతంతో మంచంపై ఉన్న నూకల వెంకటేశ్వరమ్మకు పింఛను ఇస్తూ..

నా పేరు నూకల వెంకటేశ్వరమ్మ. మాది అవనిగడ్డ మండలం వేకనూరు. నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాను. నా పనులు కూడా నేను చేసుకోలేని పరిస్థితి. గతంలో నెలకు రూ.5 వేలు ఇచ్చేవారు. వైద్య ఖర్చులు భరించలేకపోతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచిన పింఛను గ్రామ కార్యదర్శి పద్మావతి ద్వారా రూ.15 వేలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై నా కష్టాలు గట్టెక్కినట్లే.


ఆర్థిక భద్రత ఏర్పడింది

మాది గుడ్లవల్లేరు. నా పేరు ధారావత్‌ లక్ష్మీరాజ్యం. నా కుమార్తె వివాహం చేసుకొని వేరేగా ఉంటోంది. నేను ఒంటరిగా ఉంటున్నాను. గత ప్రభుత్వం రూ. 3 వేలే పింఛను ఇచ్చేది. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను బకాయితో సహా కలిపి ఓకేసారి రూ. 7 వేలు ఇంటికి తెచ్చి ఇవ్వడం ఆనందంగా ఉంది. దీంతో ఆర్థిక భద్రత ఏర్పడి ధైర్యంగా జీవించగలమనే నమ్మకాన్ని చంద్రబాబు కల్పించారు.


ఒకే ఇంట్లో నలుగురికి..

కుమారుడు వెంకట రమణ, కుమార్తె శ్రావణి, అల్లుడు ఫారుక్‌ హుస్సేన్‌లతో పద్మ

చుట్టుగుంటవాసి రణస్థలం పద్మ (47) వితంతువు. ఈమెకు బధిరులైన కొడుకు వెంకట రమణ, కూతురు శ్రావణి ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. కుమార్తె శ్రావణి, అల్లుడు హుస్సేన్‌లు పద్మ వద్దే ఉంటున్నారు. సోమవారం పింఛన్ల పంపిణీలో భాగంగా పద్మకు రూ.4 వేల పింఛను, మూడు నెలల బకాయిలతో కలిపి మొత్తం రూ.7 వేలు ఇచ్చారు. బధిరులకు రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6వేలకు పింఛను పెంచడంతో.. కుమార్తె, అల్లుడు, కుమారుడికి రూ.6 వేలు చొప్పున రూ.18 వేలు ఇచ్చారు. మొత్తంగా నలుగురికి కలిపి రూ.25వేలు అందగా ఆ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. తమకెంతో సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు పది కాలాలపాటు చల్లగా ఉండాలని వారు దీవించారు. కాగా.. పద్మ కోడలు అనిత కూడా బధిరురాలే. ఆమె తెలంగాణ యువతి. సోమవారం ఆమె కూడా తెలంగాణలో రూ.4వేల పింఛను అందుకుంది.

న్యూస్‌టుడే, చుట్టుగుంట


మా పాలిట దేవుడు

వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సహా పింఛనుదారులంతా ఈ రోజు ఇంత ఆనందంగా బతుకుతున్నామంటే ఆ ఘనత చంద్రబాబుదే. ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ పింఛన్లు పెంచుతూనే వచ్చారు. రూ. 200 నుంచి ఆయనే రూ. 2 వేలకు పెంచారు.  బాబు మళ్లీ సీఎంకాగానే ఒకేసారి రూ. వెయ్యి పెంచి రూ. 4 వేలిచ్చారు. మా పాలిట దేవుడు చంద్రబాబే. మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు.

కొనకళ్ల పాపరత్నం, ఉయ్యూరు


గౌరవంగా బతికే అవకాశం ఇచ్చారు

వృద్ధాప్యం అంటే శాపంగా ఉండేది. చంద్రబాబు వచ్చాక ఓ వరంగా మార్చేశారు. నెలకు రూ. 4 వేల పింఛను ఇవ్వడం వల్ల మా కష్టాలు చాలావరకు తీరతాయి. మూడు నెలలకు సంబంధించి వెయ్యి చొప్పున కూడా కలిపి మొత్తం రూ. 7 వేలను ఇంటికి తెచ్చి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఎవరి మీదా ఆధారపడకుండా గౌరవంగా బతికే అవకాశం ఇచ్చారు.

బట్టా సుందరమ్మ, కామయ్యతోపు


పడిగాపుల నుంచి ఊరట

గత మూడు నెలలు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సామాజిక పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం బ్యాంకుకు వెళ్తే సాయంత్రానికి కానీ నగదు అందేది కాదు. అలాంటిది నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడంతో పాటు, గత ఏప్రిల్‌ నుంచే దీనిని అమల్లోకి తెచ్చి, ఇంటి వద్దకే నగదు ఇవ్వడం పడిగాపులకు ఊరట లభించింది.

పేర్ల సీత, బాపులపాడు


రెట్టింపు చేయడం ఎన్నటికీ మరువం..

దివ్యాంగులకు గత ప్రభుత్వం రూ. 3 వేలే పింఛనుగా ఇచ్చింది. బాబు వచ్చిన వెంటనే రూ.6 వేలకు పెంచారు. ఆయన చేసిన మేలు మేం మరచిపోలేం. వైకల్యంతో బాధపడుతున్నా. ఇప్పుడు చంద్రన్న భరోసాగా ఉన్నారనే ధైర్యం వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఈ మొత్తాన్ని పెంచాలని వేడుకుంటూనే ఉన్నాం. ఇన్నాళ్లకు చంద్రబాబు మా బాధను అర్థం చేసుకున్నారు.

మట్టా ఆంధ్రేయ, పెనమలూరు


చంద్రబాబు భరోసా ఇచ్చారు

అవనిగడ్డ: దివ్యాంగురాలికి పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

మాది అవనిగడ్డ. మా కుమార్తె నామన అనూషకు మాటలు రావు. అధిక మొత్తంలో ఖర్చుచేసి శస్త్ర చికిత్సలు చేయించాము. గతంలో నెలకు రూ.5 వేలు పింఛను అందేది. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా రూ.15 వేలకు పెంచిన పింఛను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఇంటికొచ్చి అందజేశారు. దివ్యాంగురాలైన తమ కుమార్తెకు భరోసా లభించిందని భావోద్వేగంతో చెబుతూ తల్లి కన్నీళ్లపర్యంతమైంది.


చేతిలో డబ్బులుండడం ధైర్యంగా ఉంది

గత ప్రభుత్వ హయాంలో పింఛను రూ.2 వేల నుంచి ఏటా కొసరి కొసరి పెంచుతూ వచ్చారు. గ్రామాల్లో నలుగురు కూర్చునే చోట ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చెబుతూ వచ్చారు. వాలంటీర్లు లేకపోతే ఇళ్లకు వచ్చి ఎవరు ఇస్తారు? అయినా రూ.7 వేలు ఇవ్వడం సాధ్యమేనా? ఇలా అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు ఏదైతే చెప్పారో అధికారంలోకి వచ్చిన తరువాత అలానే చేసి మా జీవితాలకు భరోసా కల్పించారు. సోమవారం అందుకున్న రూ.7వేలలో కొంత మొత్తాన్ని పిల్లలకు ఇచ్చా. మిగిలింది అట్టిపెట్టుకున్నా. చేతిలో డబ్బులు ఉండడంతో చాలా ధైర్యంగా ఉంది.

పి.నాగేశ్వరమ్మ, బుద్ధాలపాలెం, బందరు మండలం


ఐసీయూలో పింఛను అందజేత

పెడన 19వ వార్డు వాసి వీరంకి శివపార్వతి గత కొద్ది రోజులుగా అస్వస్థతతో ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు పింఛను అందజేయాలన్న సంకల్పంతో 19వ వార్డు తెదేపా ఇన్‌ఛార్జి పరసా జితేంద్ర, మహిళా సంరక్షణ కార్యదర్శి మౌనికలు ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు బయోమెట్రిక్‌ ద్వారా రూ.7 వేలు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఈపింఛను అక్కరకు వచ్చిందని కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పెడనకు ఏలూరు 80 కిమీల దూరంలో ఉంటుంది. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట్రామయ్య ప్రత్యేక చొరవతో ఈ పంపిణీ పూర్తయింది.

న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్, ఉయ్యూరు, కానూరు, పెనమలూరు, పెడన, వేకనూరు(అవనిగడ్డ), గుడ్లవల్లేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని