logo

నీ స్ఫూర్తి మరువం.. నీ కీర్తి పదిలం..

లాద్దాఖ్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Updated : 02 Jul 2024 06:05 IST

అమరుడైన సైనికుడికి అశ్రునివాళి
సైనిక లాంఛనాలతో దహన సంస్కారాలు
చెమ్మగిల్లిన చేవేండ్ర

నాగరాజు పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచుతున్న కృష్ణా కలెక్టర్‌ బాలాజీ, ఎస్పీ నయీమ్‌ అస్మీ

మువ్వన్నెలపై అనురాగం..
భరతజాతిపై మమకారం..
దేశరక్షణకు సంకల్పించి..
వినమ్రుడవై అడుగేశావు...
సేవకుడై ఉరికావు..
సైనికుడై నిలిచావు..
ఉన్నతంగా ఎదిగావని..
ఊరంతా మురిసేలోపు...
కల నెరవేర్చుకున్నావని..
కన్నోళ్లు సంతోషించేలోపు..
కలలను కూల్చిన వరద..
కడలిని మించిన వేదన..
నీవు లేకున్నా..
నీ స్ఫూర్తి మరువం..
నీవు రాకున్నా..
నీ కీర్తి పదిలం..

పెడన, న్యూస్‌టుడే: లాద్దాఖ్‌లో శనివారం జరిగిన ప్రమాదంలో అమర వీరుడైన సైనికుడు సాదరబోయిన నాగరాజు పార్థివ దేహానికి సోమవారం రాత్రి పెడన మండలం చేవేండ్రలోని ఆయన స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకముందు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన నాగరాజు మృతదేహాన్ని ఆర్మీ వాహనంలో చేవేండ్రకు సాయంత్రం 6గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. అనంతరం సైనిక లాంఛనాలతో రాత్రి 9 గంటల ప్రాంతంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు

కుటుంబానికి ప్రభుత్వం అండ: కలెక్టర్‌ బాలాజీ

పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ, ఆర్డీవో వాణి తదితర ప్రముఖులు నాగరాజు పార్థివదేహానికి చేవేండ్రలో నివాళులర్పించారు. దేశరక్షణలో అసువులు బాసిన నాగరాజు త్యాగాన్ని ఈ దేశం మరువదని కలెక్టర్‌ అన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే, కలెక్టర్‌లు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

తరలివచ్చిన ప్రజలు: నాగరాజు మృతదేహాన్ని చూసేందుకు చేవేండ్రకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దీంతో రహదారులు జనంతో నిండిపోయాయి. మచిలీపట్నం-గుడివాడ రహదారిపై వడ్లమన్నాడు నుంచి 8 కి.మీ దూరంలో ఉన్న చేవేండ్రకు ఊరేగింపుగా మృతదేహాన్ని తీసుకువెళ్లారు. దారి పొడవున ప్రజలు అమర్‌రహే నాగరాజు అంటూ నివాళులర్పించారు. అనంతరం ఇంటి వద్ద కుటుంబ ఆచారం ప్రకారం క్రతువు పూర్తిచేసిన అనంతరం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ ప్రసాద్, సీఐ నాగేంధ ప్రసాద్, తహసీల్దార్‌ రాంబాబు, ఆర్‌ఐ మణికుమార్, ఎంపీడీవో రెడ్డియ్య ఎస్సై సూర్యశ్రీనివాస్‌ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

మంత్రి నారా లోకేశ్‌ సంతాపం

తాడేపల్లి: ముగ్గురు జవాన్ల మృతిపై మంత్రి నారా లోకేశ్‌ సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. లద్దాఖ్‌ ప్రమాదంలో నాగరాజు, సుభానాఖాన్, ఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

శ్మశానవాటికలో సైనిక వందనం

తీవ్రంగా కలచివేసింది: బాలశౌరి

మచిలీపట్నం (గొడుగుపేట): లద్దాఖ్‌ ప్రమాదంలో సైనికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. నాగరాజు, రామకృష్ణారెడ్డి, సుభాన్‌ఖాన్‌ల మృతికి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైనికుడు నాగరాజు మృతికి తెదేపా నేతలు బూరగడ్డ వేదవ్యాస్, కొనకళ్ల నారాయణరావు, జనసేన నాయకుడు బండి రామకృష్ణ తదితరులు సంతాపం తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని