logo

ప్రజా సమస్యలు సానుకూలంగా పరిష్కరించాలి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు.

Published : 02 Jul 2024 05:08 IST

ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ బాలాజీ, జేసీ గీతాంజలిశర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూల చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన జేసీ గీతాంజలిశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావుతో కలిసి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 87 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. 2020లో కురిసిన అకాల వర్షాల కారణంగా బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.3 కోట్లు వెంటనే అందచేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘ జిల్లా కమిటీ కార్యదర్శి జి.నాగేశ్వరరావు, తదితరులు వినతిపత్రం అందచేశారు. పెడన మండలం నందమూరుకు చెందిన వీరమ్మ తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహాన్ని నిర్మించుకున్నామని, ఇవ్వాల్సిన రూ.2 లక్షల్లో కేవలం రూ.62 వేలు మాత్రమే తనకు చెల్లించారని, మిగిలిని సొమ్ము ఇప్పించాలని కోరారు. పేదకుటుంబానికి చెందిన తన కుమార్తెకు సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలని ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన శ్రీనివాసరావుతో పాటు వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు అర్జీలు సమర్పించారు.

బాధిత మహిళలకు అండగా సఖి కేంద్రం

హింసకు గురైన బాలికలు, మహిళలకు అండగా సఖి కేంద్రం అందుబాటులో ఉందని కలెక్టర్‌ బాలాజీ తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన రూపొందించిన సఖి కేంద్ర గోడపత్రికను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, బాలికలు ఎవరైనా హింసకు గురైతే 181 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌చేయాలన్నారు. మచిలీపట్నం పోర్టురోడ్‌లోని సఖి వన్‌స్టాప్‌ కేంద్రంలో బాధిత బాలికలు, మహిళలకు ఐదు రోజుల పాటు వసతి సౌకర్యంతో పాటు వైద్య, న్యాయ, పోలీస్‌ పరమైన సేవలు అందిస్తారన్నారు. అత్యవసర సమయాల్లో ఛైల్డ్‌హెల్ప్‌లైన్‌ నెం.1098, టోల్‌ఫ్రీ నెంబర్లు 100, 112లను వినియోగించుని సహాయం కోరవచ్చన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని