logo

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 95 శాతం పింఛన్ల పంపిణీ

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 02 Jul 2024 05:30 IST

మాట్లాడుతున్న మంత్రి కొలుసు పార్థసారథి

కానూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా తాడిగడప వందడుగుల రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 28 కేటగిరీలలో 95 శాతం పంపిణీ చేయడం జరిగిందన్నారు. కూటమి నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయడానికి వెళితే ప్రజలు మేళతాళాలతో ఆహ్వానం పలికి పండగ వాతావరణం కల్పించారన్నారు. రాష్ట్రంలో 61.7 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4170 కోట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. కేవలం 1.35 లక్షల సచివాలయ ఉద్యోగులతో 12 గంటల సమయంలో ఈ రికార్డు సాధించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా ఇలా పకడ్బందీగా చేయలేకపోయారన్నారు. గత ఏప్రిల్‌లో అప్పటి వైకాపా ప్రభుత్వం బ్యాంకుల్లో పింఛన్లు వేసి అనేక మంది వృద్ధుల చావుకు కారణమయ్యిందన్నారు. అప్పటి తప్పిదాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రుద్దాలని చూశారన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రూ.వెయ్యి పెంచితే.. కూటమి ప్రభుత్వం 15 రోజుల్లోనే రూ.1000 పెంచి రికార్డు స్థాయిలో పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో రూ.50 ఉన్న పింఛను వెయ్యి, తరువాత రూ.2 వేలు, ఇప్పుడు రూ.4వేలు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని