logo

వైకాపాలో స్థాయీ సంఘం ఎన్నికల చిచ్చు

నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్‌గా నామపత్రాలు దాఖలు చేశారు.

Published : 02 Jul 2024 04:58 IST

రెబల్స్‌గా బరిలో ఇద్దరు
సభ్యుల ఏకగ్రీవానికి చెల్లుచీటీ!

తెదేపా నుంచి నామపత్రాలు దాఖలు చేస్తున్న చెన్నగిరి రామ్మోహనరావు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరపాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు వైకాపా పాలక పక్షంలో చిచ్చు రేపాయి. ఆ పార్టీ పాలకవర్గం నిర్ణయానికి భిన్నంగా ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు రెబల్స్‌గా నామపత్రాలు దాఖలు చేశారు. మరోవైపు తెదేపా పక్షం అభిప్రాయాన్ని వైకాపా తోసిపుచ్చడంతో ఆ పార్టీ కూడా ఎన్నికల బరిలోకి తమ అభ్యర్థిని దింపింది. ఫలితంగా స్థాయీ సంఘం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయానికి ఈసారి గండిపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి వైకాపా పాలకపక్షంలో ఆందోళన రేపుతుండగా, వర్గ విబేధాలు బయటపడ్డాయి.

హెచ్‌ఎంటీ చట్టం ప్రకారం...

హెచ్‌ఎంటీ చట్టం 2010లో తెచ్చిన మార్పుల తర్వాత వార్డు కమిటీలు మాయమయ్యాయి. మేయర్‌గా ఎవరుంటే వారే స్థాయీ సంఘం ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. స్థాయీ సంఘం సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా ఏటా జరిగే స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికతో నూతన స్థాయీ సంఘాన్ని (స్టాండింగ్‌ కమిటీ) ఏర్పాటు చేస్తారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఏడాది వరకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కార్పొరేటర్లే మూడు నియోజకవర్గాల నుంచి ఇద్దరు చొప్పున ఏకగీవ్రంగా ఎన్నికయ్యేవారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం మారిపోయి, కూటమి అధికారంలోకి రావడం, ముగ్గురు వైకాపా శాసనసభ్యులు ఓడిపోవడంతో ఆ ప్రభావం నగరపాలక సంస్థ పాలకపక్షంపై పడింది. అదే సమయంలో వైకాపాలో వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. ఎవరికి వారే తమ స్థాయిని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఫలితంగా మేయర్, వైకాపా ఫ్లోర్‌లీడర్, డిప్యూటీ మేయర్లు తమకు అనుకూలమైన కార్పొరేటర్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. విషయం తెలిసినా వైకాపా అధిష్ఠానం పట్టీపట్టనట్టు వ్యవహరించింది. ఫలితంగా స్థాయీ సంఘం ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు వైకాపా నాయకులు వెనుక నుంచి పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏకగ్రీవానికి గండికొట్టేలా తమ వారిని పోటీకి దించినట్లు చెబుతున్నారు.

సమతుల్యత దెబ్బతినడమేనా?

ఇప్పటి వరకు స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికల్లో ఓ బలమైన సామాజికవర్గానికి చోటు దక్కుతూ వచ్చింది. మరో సామాజికవర్గానికి తగిన చోటు దక్కడం లేదన్న అసంతృప్తి కొందరిలో ఉంది. అది ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో అది బయట పడింది. ఫలితంగా పాలకపక్షం ఎంపిక చేసిన ఆరుగురు వైకాపా సభ్యులకు వ్యతిరేకంగా, ఇద్దరు వైకాపా కార్పొరేటర్లు స్థాయీ సంఘం సభ్యులుగా పోటీ చేసేందుకు నామపత్రాలు దాఖలు చేశారు.

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో తెదేపా జోరుమీద ఉంది. తమ పార్టీలోని ఒకరిద్దరు కార్పొరేటర్లకు స్థాయీ సంఘంలో స్థానం కల్పించాలని మేయర్‌ను కలిసి విన్నవించారు. వైకాపాలో వర్గపోరుతో తెదేపాకు సానుకూల సాంకేతాలు అందలేదు. దీంతో తెదేపా ఎన్నికల బరిలోకి దిగింది. 32వ డివిజన్‌ తెదేపా కార్పొరేటర్‌ చెన్నగిరి రామ్మోహనరావును ఆ పార్టీ బరిలోకి దించింది. కౌన్సిల్లో సాంకేతికంగా తెదేపాకు 13 ఓట్లు ఉండగా, వైకాపా వర్గ విభేదాలు తమకు కలిసి వస్తాయని తెదేపా ఆశతో ఉంది.

ఒంటెత్తుపోకడలతో...

వైకాపా నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ప్రస్తుతం స్థాయీ సంఘం ఎన్నికల బరిలోకి దిగారు. పశ్చిమ నుంచి 48వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ అత్తిలి ఆదిలక్ష్మి రెబల్‌గా నామపత్రాలు దాఖలు చేయగా, 53వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ మహదేవు అప్పాజీరావు బలపర్చారు. మధ్య నుంచి వైకాపా రెబల్‌గా భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి పోటీకి దిగగా, 45వ డివిజన్‌ వైకాపా అసోసియేట్‌ కార్పొరేటర్‌ మైలవరపు మాధురీ లావణ్య బలపపర్చారు. వారు రెబల్స్‌గా బరిలో దిగడానికి అంతర్గత విభేదాలు, పార్టీ నాయకుల ఒంటెద్దుపోకడలే కారణాలుగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని