logo

పోలీసులకు చేరిన కరిష్మా పోస్ట్‌మార్టం నివేదిక

అజిత్‌సింగ్‌నగర్‌ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్‌మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టం చేశారు.

Published : 02 Jul 2024 04:55 IST

నిపుణుల నివేదిక వస్తేనే కేసు కొలిక్కి

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : అజిత్‌సింగ్‌నగర్‌ మదర్సాలో గత నెల 28న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కరిష్మా (17) పోస్ట్‌మార్టం నివేదిక ఇక్కడి పోలీసులకు చేరింది. అయితే నిపుణుల పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతే దీనిపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందని పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టం చేశారు. రీగర్‌ మార్టిస్‌ (మరణించిన తర్వాత శరీరం బిగుసుపోవడం) ప్రారంభం కాలేదని నివేదికలో పేర్కొన్నారు. అంటే.. ఆసుపత్రికి తీసుకువెళ్లే ముందే చనిపోయి ఉండొచ్చని ఇది చెబుతున్నా.. స్పష్టంగా చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. మరణించి 12 గంటల దాటిన తర్వాత బిగుసుపోయిన శరీరం.. లూజుగా మారుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. పోలీసులు ఉదయం 8.47 గంటలకు ఆసుపత్రికి తీసుకువెళుతుండగా చనిపోయిందని చెబుతున్నారు. కానీ బంధువులు, ఇతరులు మాత్రం ముందు రోజు రాత్రే చనిపోయిందని ఆరోపిస్తున్నారు. రీగర్‌ మార్టిస్‌ ప్రారంభం కాకపోవడంతో బంధువులు చెబుతున్నట్లు రాత్రి వేళ మరణించి ఉండొచ్చని లేదా పోలీసులు చెబుతున్నట్లు ఉదయం పూటైనా మరణించి ఉండొచ్చని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే.. నిపుణుల నివేదిక రావాల్సిందేనని పోలీసులు పేర్కొంటున్నారు. మరణానికి కారణం, మరణం సమయం రెండూ ఈ కేసులో కీలకం కావడంతో పోలీసులు సైతం జాగ్రత్తలు తీసుకున్నారు. పోస్ట్‌మార్టం ఆలస్యం కాకుండా కలెక్టర్‌తో ప్రత్యేక అనుమతి తీసుకుని.. అదే రోజు రాత్రి అయినా వైద్యుల బృందం ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. శరీరంలోని కొన్ని భాగాలను ఫోరెన్సిక్‌ ఇతర పరీక్షల నిమిత్తం పంపించారు.

ఆ మూడు విభాగాల నుంచి..

కరిష్మా పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక వచ్చినప్పటికీ పూర్తి స్థాయి నివేదిక వచ్చేందుకు మరింత సమయం పడుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. శరీరం నుంచి సేకరించిన భాగాలను పూర్తి స్థాయిలో పరీక్షించి మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు హిస్టో పాథాలజీ, మైక్రో బయాలజీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లకు పంపించారు. వాటి నుంచి పూర్తి స్థాయి పరీక్షా నివేదికలు వస్తేనే కారణం తెలుసుకోగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి వచ్చేందుకు మరో నాలుగైదు రోజులు పడుతుంది. అప్పుడే.. కరిష్మా దేని వల్ల మరణించింది? ఫుడ్‌ పాయిజనింగా? లేక మరే ఇతర కారణం ఉందా? అనే తేలుతుంది. కాగా మహిళా కమిషన్‌ సైతం కరిష్మా మరణాన్ని సుమోటాగా స్వీకరించి.. దీనిపై నివేదిక ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణను కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని