logo

పింఛను పండగొచ్చింది

‘కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఈనెల ప్రతి పింఛనుదారు ఇంటిలోనూ పండగ వాతావరణమే ఉండబోతోంది. గత జగన్‌ ప్రభుత్వంలో ప్రతినెలా పంపిణీ చేసిన రూ.3వేల పింఛనును తాజాగా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద రూ.4వేలకు పెంచారు.

Updated : 01 Jul 2024 06:36 IST

ఈ నెల రూ.7000 చొప్పున రూ.323 కోట్ల పంపిణీ
కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 4.78 లక్షల మంది లబ్ధిదారులు
ఇంటికే వెళ్లి ఒక్క రోజులో అందించేలా ఏర్పాట్లు
ఈనాడు, అమరావతి న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్‌

‘కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఈనెల ప్రతి పింఛనుదారు ఇంటిలోనూ పండగ వాతావరణమే ఉండబోతోంది. గత జగన్‌ ప్రభుత్వంలో ప్రతినెలా పంపిణీ చేసిన రూ.3వేల పింఛనును తాజాగా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద రూ.4వేలకు పెంచారు. అదికూడా గత ఏప్రిల్‌ నుంచే రూ.4వేల పెంపు అమలవుతుందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. దీని ప్రకారం ఈనెలకు సంబంధించి రెండు జిల్లాల్లో ఉండే 4,78,736 మంది పింఛనుదారులు రూ.7వేల చొప్పున నేడు అందుకోనున్నారు.

జులై నెలకు రూ.4వేలు, ఏప్రిల్‌ నుంచి గత మూడు నెలలకు రూ.వెయ్యి చొప్పున రూ.3వేలు కలిపి మొత్తం రూ.7వేలను ఒకేసారి ఇంటికే వచ్చి సచివాలయ సిబ్బంది సోమవారం నుంచి అందజేయనున్నారు. అందుకే పింఛనుదారులెవరూ ఎలాంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రెండు జిల్లాల్లోని 12వేల మందికి పైగా సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకే వచ్చి అత్యంత తేలికగా పంపిణీ చేసి వెళ్తారు. ఎన్నికల ముందు జగన్‌ ప్రభుత్వం, వైకాపా నేతలు కావాలని పింఛనుదారులను బ్యాంకుల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేశారనే విషయం ఈ రోజుతో మరింత స్పష్టంగా ప్రజలందరికీ అర్థమవ్వబోతోంది.’


వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, చేనేత, డప్పు కళాకారులు, హిజ్రాలు సహా పది రకాల పింఛనుదారులకు రూ.3వేల నుంచి రూ.4వేలకు పింఛను పెరిగింది. వీరందరికీ రూ.7వేల చొప్పున ఈ నెల పంపిణీ చేయనున్నారు. మిగతా పింఛనుదారుల్లో దివ్యాంగులకు రూ.3వేలుండగా.. ఈ నెల నుంచి రూ.6వేలకు పెంచారు. కృష్ణాలో 34,355 మంది, ఎన్టీఆర్‌లో 27,302 మంది కలిపి మొత్తం 61,657 మంది దివ్యాంగులున్నారు. వీరందరికీ ఇక నుంచి రెట్టింపు పింఛను అందబోతోంది. వీరుకాకుండా కిడ్నీ వ్యాధిగ్రస్థులు, అవయవమార్పిడి చేసుకున్న వారు, మంచానికే పరిమితమైన వారికి ఇప్పటివరకూ రూ.5వేలు ఉండగా.. చంద్రబాబు ప్రభుత్వం రూ.10వేలకు పెంచింది. ఇలాంటివారు రెండు జిల్లాల్లో వెయ్యి మంది ఉన్నారు. వీరిలో పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.5వేలు ఉండగా ఇప్పుడు రూ.15వేలకు పెంచడం గమనార్హం. వీళ్లు కూడా రెండు జిల్లాల్లో కలిపి 500 మంది వరకూ ఉన్నారు.


కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కలిపి 4,78,736 మంది పింఛనుదారులున్నారు. జూన్‌లో రూ.3వేల చొప్పున కృష్ణాలో 2,42,856 మందికి.. రూ.71.31కోట్లు పంపిణీ చేయగా.. ఈ నెల రూ.7 వేల చొప్పున రూ.162.49కోట్లు పింఛనుదారులకు అందించబోతున్నారు. గత నెల ఎన్టీఆర్‌లో 2,35,880 మందికి రూ.70.25కోట్లు పంపిణీ చేయగా.. ఈసారి రూ.160.53కోట్లు ఇవ్వబోతున్నారు. గత నెల రెండు జిల్లాల్లో కలిపి పింఛనుదారులకు అందించిన మొత్తం రూ.141.56కోట్లు. ఈనెల ఏకంగా రూ.323 కోట్లకు పైగా అంటే రెట్టింపు డబ్బులు రెండు జిల్లాల్లోని పింఛనుదారులకు అందబోతున్నాయి. 


యంత్రాంగం సర్వసన్నద్ధం 

రెండు జిల్లాల్లోనూ ఇంటికే వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం అత్యంత తేలిక. ప్రభుత్వ ఆదేశాలతో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లోని సచివాలయ ఉద్యోగుల్లో ఒకొక్కరు 50 పింఛన్లు తగ్గకుండా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో మొత్తం 1113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 11 మంది సిబ్బంది చొప్పున 11,130 మంది అందుబాటులో ఉన్నారు. ఒక్కొక్కరు 43 మంది ఇంటికి వెళ్లి పింఛను అందిస్తే చాలు. రెండు జిల్లాల్లోని 4.78లక్షల మంది పింఛనుదారులకు ఉదయం ఆరంభిస్తే.. మధ్యాహ్నానికి తేలికగా పింఛన్లను పంపిణీ చేసేయొచ్చు. 


నగరపాలక సంస్థ పరిధిలో 

  • విజయవాడలో 286 వార్డు సచివాలయాల్లో 2574 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. నగరంలో 67వేల మంది పింఛనుదారులు ఉన్నారు. అంటే 286 సచివాలయాల్లో ఒక్కో దాని పరిధిలో 235 పింఛన్లు మాత్రమే ఉన్నాయి. 2574 మంది ఇంటింటికీ వెళ్లి ఒక్కొక్కరూ కేవలం 26 మందికి పంపిణీ చేస్తే చాలు. 
  • మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 50 సచివాలయాలు.. 500 మంది సిబ్బంది ఉన్నారు. మచిలీపట్నంలోని 19,136 మంది పింఛనుదారులు ఉన్నారు. ఒక్కో సిబ్బంది కేవలం 38 మందికి పింఛన్లను పంపిణీ చేస్తే సరిపోతుంది.
  • గ్రామాల్లోనూ తేలికగానే పంపిణీ చేసేయొచ్చు. ఒక్కో గ్రామంలో 11 మంది సచివాలయ సిబ్బంది ఉండగా.. 500 మంది వరకూ పింఛనుదారులు ఉన్నారు. ఒక్కొక్కరూ 50 మందికి పంచితే చాలు.

నగదుతో పాటు రసీదు ఇస్తాం..

- నాగేశ్వరనాయక్, డీఆర్‌డీఏ ఇన్‌ఛార్జి పీడీ

ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్టీఆర్‌ భరోసా పథకం ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. పింఛనుదారులకు రసీదుతో పాటు నగదు ఇంటికే వెళ్లి అందజేస్తారు. అక్కడక్కడా కొన్నిచోట్ల బయోమెట్రిక్‌ యంత్రాలు మొరాయించినా ఏ ఇబ్బందీ లేకుండా పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు