logo

లద్దాఖ్‌ సైనిక ఘటనలో ఆర్మీ జవాన్‌ వీరమరణం

దేశభక్తితో ఆర్మీలోకి వెళ్లిన ఆ యువకుడ్ని మృత్యువు కబళించి విగతజీవిగా తిరిగి వస్తున్నాడన్న సమాచారం అతడి స్వగ్రామం కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామస్థులను ఉలిక్కి పడేలా చేసింది.

Updated : 01 Jul 2024 06:11 IST

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

పెడన, న్యూస్‌టుడే: దేశభక్తితో ఆర్మీలోకి వెళ్లిన ఆ యువకుడ్ని మృత్యువు కబళించి విగతజీవిగా తిరిగి వస్తున్నాడన్న సమాచారం అతడి స్వగ్రామం కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామస్థులను ఉలిక్కి పడేలా చేసింది. ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్న తమ గ్రామ వాసి వీరమరణం పొందాడని తెలుసుకున్న స్థానికులు ‘మీ బిడ్డ వీరమరణం దేశం మర్చిపోదని’ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. జిల్లాకు చెందిన సైనికులు, మాజీ సైనికులు పోలీసు అధికారులు తరలివెళ్లి అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సాదరబోయిన వెంకన్న, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె కాగా.. కుమారులు నాగరాజు(32), శివయ్యలు ఆర్మీలో సైనికులుగా పనిచేస్తున్నారు. ఈ కుటుంబం చేవేండ్రలోని పాటిమీద ప్రాంతంలో స్థిరపడింది. కుమార్తె, ఇరువురు కుమారులు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడడంతో తల్లిదండ్రులు సంతృప్తిగా జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి లద్దాఖ్‌  నుంచి పెద్ద కుమారుడు నాగరాజు దుర్మరణ సమాచారం ఆ కుటుంబానికి చేరింది. దీంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. 2015లో ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత నాగరాజు ఆర్మీలోకి వెళ్లారు. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ల్‌ోని 52 ఆర్మ్‌డ్‌ రెజిమెంట్‌లో టెక్నీషియన్‌(సీఎఫ్‌ఎన్‌)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 అక్టోబరు 13న కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన మంగాదేవితో నాగరాజు వివాహం జరిగింది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె హాసిని ఉంది. మంగాదేవి పెడన మండలం ఉరివి సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.


చేవేండ్ర నుంచి ఐదుగురు

- ఆవుల వీరాంజనేయులు, ఆర్మీ ఏఆర్‌టీవై సెంటర్‌ ఇన్‌స్ట్రక్టర్, హైదరాబాద్‌

మా గ్రామం నుంచి ఐదుగురు ఆర్మీలో ఉన్నాం. ఇటీవల ఒకరు స్వచ్ఛంద పదవీ విరమణలో బయటకు వచ్చారు. నాగరాజు సోదరులు తనను స్ఫూర్తిగా తీసుకుని ఆర్మీలో చేరారు. ఆ సమయంలో సోదరులకు మార్గదర్శకం చేశారు. ఈ దుర్ఘటన జరగడం బాధాకరం. వాస్తవాధీన రేఖ సమీపంలో యుద్ధ ట్యాంకులతో మన సైన్యం రెక్కీ చేస్తుంటుంది. శత్రువులను హతమార్చేందుకు ట్యాంకుల ద్వారా జలప్రవాహాలను దాటాల్సి వస్తుంది. ఆ ప్రాక్టీసు చేసే సమయంలో నదిలో భారీగా వరద వచ్చి ట్యాంకు కొట్టుకుపోయింది.


నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

మచిలీపట్నం(గొడుగుపేట), పెడన: నాగరాజుకు సోమవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. పార్థివదేహం మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుతుందని, అక్కడి నుంచి చేవేండ్రకు తరలిస్తామన్నారు.  జిల్లా సైనిక్‌ సంక్షేమ అధికారి, సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు అందరితో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంత్యక్రియల్లో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌లు పాల్గొంటారని తహసీల్దార్‌ రాంబాబు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని