logo

గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సమావేశం రసాభాస

విజయవాడలో ఆదివారం నిర్వహించిన ది గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బ్యాంకులో అవినీతిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జవాబు చెప్పాలని ఛైర్మన్‌ వేమూరి వెంకట్రావ్‌ను డిపాజిటర్లు నిలదీశారు.

Published : 01 Jul 2024 05:57 IST

పత్రికల్లో కథనాలపై ఛైర్మన్‌ను నిలదీసిన ఖాతాదారులు
అక్రమాలు, అవినీతి నిగ్గు తేల్చాలని డిమాండ్‌

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: విజయవాడలో ఆదివారం నిర్వహించిన ది గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బ్యాంకులో అవినీతిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జవాబు చెప్పాలని ఛైర్మన్‌ వేమూరి వెంకట్రావ్‌ను డిపాజిటర్లు నిలదీశారు. లెక్కలు చూపించాలని, ఖాతాదారుల సొమ్మును, అధిక వడ్డీల రూపంలో దోచేసిన వ్యక్తుల వివరాలు బహిర్గత పరచాలని డిమాండ్‌ చేశారు. అన్నింటికీ సమాధానాలు చెబుతానని వెంకట్రావు హామీ ఇవ్వగా.. అతని తీరు నచ్చక కొంతమంది వెళ్లిపోయారు. కొంతమంది అడిగిన కొన్ని ప్రశ్నలకు ఛైర్మన్‌ సమాధానాలు ఇవ్వకుండా దాటవేశారు. బ్యాంకు మహాజన సభ (సర్వసభ్య సమావేశం) ఆదివారం విజయవాడ అమ్మ కల్యాణ మండపంలో నిర్వహించారు. ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసిన వారినే సమావేశానికి అనుమతించారు. మీడియాను లోపలికి పంపించలేదు. సమావేశం వివరాలు బయటకు వెళ్లకుండా ఛైర్మన్‌ నేతృత్వంలో సిబ్బంది శతవిధాలా ప్రయత్నించారు. పోలీసుల పహారా పెట్టారు. తొలుత 2023-24 ఆర్థిక సంవత్సర బ్యాంకు లావాదేవీలపై చర్చ జరిగింది. ఆ సమయంలో కొంత మంది సభ్యులు, ఖాతాదారులు పత్రికల్లో వచ్చిన కథనాలకు సమాధానాలు చెప్పాలని నిలదీశారు. కాసేపు ఛైర్మన్‌ మాట్లాడినా సభ్యులు అంగీకరించలేదు. గొడవ పెద్దది అవుతున్న తరుణంలో సభ్యులు, ఖాతాదారులను బుజ్జగించేందుకు కొందరు డైరెక్టర్లు ప్రయత్నించారు. తమ వైపున్న తప్పులు కప్పిపుచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. భోజన సమయం వరకు జరగాల్సిన సమావేశాన్ని త్వరగా ముగించేందుకు ఉత్సాహం చూపారు. సమావేశానికి డైరెక్టర్లు కోగంటి వెంకట రామయ్య, జోగరాజు, తల్లాప్రగడ సుబ్బారావు, కళ్లే నాగేశ్వరరావు హాజరు కాలేదు. పాలకమండలి వైస్‌ ఛైర్మన్‌ అబ్దుల్‌ ఖయ్యూమ్‌ అన్సారీ, డైరెక్టర్లు సగ్గుర్తి నాగేశ్వరరావు, ఆంజనేయరాజు, ఎస్‌.వెంకటేశ్వరరావు, భోగాది శివరామకృష్ణప్రసాద్, సజ్జా వెంకట నాగసుభాష్‌ తేజ, సీఈవో పద్మిని, ఖాతాదారులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని