logo

ఊపిరిపోసిన వర్షం

జలాశయాల్లో నీరు లేకపోవడం, ఖరీఫ్‌ సమయం ఆసన్నం కావడంతో కాలువల్లో నీరు కొంత ఆలస్యంగా విడుదలైనా సాగుకు ఇబ్బందిలేకుండా ఉండాలని అన్నదాతలు ప్రకృతి కనికరించకపోతుందా? అన్న ఆశలో వెదసాగు చేపట్టారు.

Published : 01 Jul 2024 05:55 IST

సాగు పనుల్లో రైతుల నిమగ్నం
మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే

జలాశయాల్లో నీరు లేకపోవడం, ఖరీఫ్‌ సమయం ఆసన్నం కావడంతో కాలువల్లో నీరు కొంత ఆలస్యంగా విడుదలైనా సాగుకు ఇబ్బందిలేకుండా ఉండాలని అన్నదాతలు ప్రకృతి కనికరించకపోతుందా? అన్న ఆశలో వెదసాగు చేపట్టారు. కొందరు అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోవడం ఇంకొందరు కాలువల్లో ఉన్న నీటిని ఇంజిన్ల ద్వారా తోడి నారుమడులు పోశారు. అలాంటి వారంతా ఇటీవల వరకు వర్షాలు పడక ఆందోళన చెందుతున్న తరుణంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట నిస్తున్నాయి. 

11వేల హెక్టార్లకు పైగా వెదసాగు

గత కొన్నేళ్లుగా రైతులు వెదసాగుపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 1,65,789 హెక్టార్లలో వరి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇప్పటికే 11 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వెదసాగు చేపట్టారు. బందరు, గుడ్లవల్లేరు, గుడివాడ, ఉయ్యూరు, ఘంటసాల, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను ఇలా వివిధ మండలాల్లో కొందరు రైతులు నారుమళ్లు పోస్తుండగా ఎక్కువ శాతం మంది వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ విధానంపై మొగ్గు చూపుతున్నారు. అత్యధికంగా ఉంగుటూరు మండలంలో 4 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వెదసాగు చేపట్టగా ఆ తరువాత పెడన మండలంలో 3,500 హెక్టార్లలో సాగు చేశారు. మిగిలిన మండలాల్లో కూడా ఎక్కువమంది ఈ సాగు చేస్తున్నారు. రబీలో అపరాల సాగుకు అనువుగా ఉండడంతోపాటు పెట్టుబడి కూడా తక్కువ అవుతుందని భావించి రైతులు ఈ తరహా సాగువైపు మొగ్గుచూపుతున్నారు. గత ఖరీఫ్‌లో 46వేల హెక్టార్లలో వెదసాగు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

నారుమడులు పోస్తున్న కర్షకులు

బీపీటీ 5204 లాంటి తక్కువ పంట కాలం కలిగిన సన్నరకాలు సాగు చేద్దామని భావించిన రైతులు కూడా సంతోష పడుతున్నారు. ప్రస్తుతం సాగుకు పట్టిసీమే ఆధారం. సరిపడ నీటి మట్టం చేరిన తరువాత కాల్వలకు నీళ్లు వదులుతామని అధికారులు చెబుతున్నారు. జులై 15 నాటికి కానీ కాలువలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని భావించడంతో అప్పుడే నారుమళ్లు పోసుకోవచ్చు అని నీరు ఎదురు చూస్తున్న రైతులు కూడా ఈ వర్షాలతో పొలాల్లో నీరు నిలవడంతో నారుమడులు పోసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 900 హెక్టార్లలో నారుమడులు పోసినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అత్యధికంగా పెదపారుపూడి మండలంలో 290 హెక్టార్లలో నారుమళ్లుపోయగా పమిడిముక్కల మండలంలో 230 హెక్టార్లలో పోశారు. బాపులపాడు, తోట్లవల్లూరు, గుడివాడ, పామర్రు తదితర మండలాల్లో కూడా రైతులు 50 నుంచి 100 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. మెట్ట ప్రాంతాల్లో చెరకు, వేరుశనగ లాంటి పంటల సాగుకు కూడా రైతులు సిద్ధమవుతున్నారు. 

కృత్తివెన్ను మండలంలో అత్యధిక వర్షపాతం 

జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నాటికి 36.04 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో అత్యధికంగా కృత్తివెన్ను మండలంలో 72.02 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. పెడన మండలంలో 17.08 అత్యల్పం నమోదయ్యింది. నందివాడ 57.4, బంటుమిల్లి 54.02, పెదపారుపూడి 53.02, గుడివాడ 48.02, పామర్రు 46.02, నాగాయలంక 44.08, గుడ్లవల్లేరు 44.08, ఉయ్యూరు 43.04, ఉంగుటూరు 42.06, ఘంటసాల 41.08, పమిడిముక్కల 38.06, చల్లపల్లి 34.06, తోట్లవల్లూరు 33.04, పెనమలూరు 32.02, కంకిపాడు 28.02, అవనిగడ్డ 26.08, గన్నవరం 26.04, కోడూరు 23.04, మచిలీపట్నం 21.06, మోపిదేవి 20.02, బాపులపాడు 19.08, మొవ్వ 18.08, గూడూరు మండలంలో 18.02 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.


అందుబాటులో విత్తనాలు

- ఎన్‌.పద్మావతి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి 

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు అనుకూలించాయి. ఎక్కువమంది రైతులు వెద పద్ధతిలో సాగు చేస్తున్నా నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న రైతులు కూడా అంతే ఎక్కువగా ఉన్నారు. నారుమళ్లు పోసుకునేందుకు రైతులు అందుబాటులో ఉన్న రాయితీ విత్తనాలను వినియోగించుకోవాలని కోరుతున్నాం. జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతుభరోసా కేంద్రాలు విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. కావాల్సిన వారు వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని