logo

బాధ్యతగా భావించు.. శిరస్త్రాణం ధరించు..

రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు.. మద్యం తాగి వాహనాలు నడపుతుండటం, శిరస్త్రాణం లేకపోవడం వల్లే సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో తలకు జరిగే ఏ చిన్న గాయమైనా... ప్రాణాపాయం కలిగిస్తోంది.

Published : 01 Jul 2024 05:40 IST

కుటుంబాన్ని వీధిన పడేయొద్దు
విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

చింతగుంట ఆనంద్‌ ప్రకాశ్‌ (40)కు ఇద్దరు మగపిల్లలు. జూన్‌ 25వ తేదీ రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొంది. దీంతో అతని తల డివైడర్‌కు తగిలి.. బలమైన గాయమైంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిరస్త్రాణం ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదేమో? ఇద్దరు పిల్లలు తండ్రి లేని వారయ్యారు. 


 

మధురానగర్‌కు చెందిన రాజారాం (21)... బి.టెక్‌ చదువుతున్నాడు. ద్విచక్రవాహనంపై వెళుతూ ఆటో ఢీ కొనటంతో అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయమై ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొంది చనిపోయాడు. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు మృతితో.. ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


 

నగరానికి చెందిన వెంకట్‌ (45)... ప్రైవేటు ఉద్యోగి. రోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లేప్పుడు.. అతని భార్య శిరస్త్రాణం తీసుకుని వచ్చి.. ఎదురుగా నిలబడి ఉంటుంది. వెంకట్‌.. శిరస్త్రాణం ధరించి ఆఫీస్‌కు వెళతారు. ఒక రోజు మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీ కొంది. కాలు, చెయ్యి విరిగాయి. శిరస్త్రాణం పెట్టుకోవడం వల్ల తలకు బలమైన గాయాలు కాలేదు. రెండు నెలల్లో కోలుకున్నారు. 

రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు.. మద్యం తాగి వాహనాలు నడపుతుండటం, శిరస్త్రాణం లేకపోవడం వల్లే సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో తలకు జరిగే ఏ చిన్న గాయమైనా... ప్రాణాపాయం కలిగిస్తోంది. శిరస్త్రాణం ధరిస్తే కనీసం 70 శాతం మరణాలు తగ్గించవచ్చని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు. శిరస్త్రాణం ధరించకపోవడంతో.. ప్రమాదాల్లో వాహనదారులు మరణించడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. శిరస్త్రాణం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. 

ప్రాణాలు కాపాడుతుంది...

రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహన చోదకుల ప్రాణాలను కాపాడేది ఎక్కువగా శిరస్త్రాణమే. 2023 సంవత్సరంలో ఎన్టీఆర్‌ కమిషనరేట్‌లో 1,522 ప్రమాదాలు జరిగాయి. 373 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో అత్యధికంగా చనిపోయింది ద్విచక్రవాహన చోదకులే కావణం గమనార్హం. ఆటోలు, కార్లు, లారీ తదితరాలతో పోలిస్తే ద్విచక్రవాహన మరణాలే ఎక్కువగా ఉన్నాయి.


ఫ్యాషన్‌ కాదు... అది మీ పాలిట పాశం

ద్విచక్రవాహనాలను నడుపుతున్న యువతను గమనిస్తే.. వారిలో 90 శాతం మంది శిరస్త్రాణం ధరించరు. జుట్టు పాడైపోతుందని, శిరస్త్రాణం లేకుండా వెళ్లడం ఒక ఫ్యాషన్‌ అని చెబుతుంటారు. కానీ అది ఫ్యాషన్‌ కాదని... మీ పాలిట యమ పాశమని పెద్దలు చెబుతున్నారు. అనుకోని సంఘటన జరిగి ప్రాణాలు కోల్పోతే.. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య.. తట్టుకోలేరు. నాన్న ఏరంటూ ముక్కుపచ్చలారని బిడ్డలు అడుగుతుంటే జవాబు చెప్పలేని తల్లులు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు. రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని వీధుల పాలు చేస్తుందని, అలాంటి పరిస్థితి మనకు రాకూడదనే విషయాన్ని గుర్తెరిగి.. ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే మేలు

చాలా మంది తక్కువ ధరకు వస్తుందని.. నాసిరకం శిరస్త్రాణాలు కొంటుంటారు. అవి ధరించినా ప్రమాదాల్లో.. రక్షణ ఇవ్వలేవని నిపుణులు చెబుతున్నారు. ఐ.ఎస్‌.ఐ మార్కు ఉన్నవి తీసుకుంటే.. రోడ్డు ప్రమాదంలో నేలకు తగిలినా అపాయం కలగదని పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ ఐ.ఎస్‌.ఐ. మార్కు ఉన్నవే ధరించాలని సూచిస్తున్నారు. అలా చేస్తే.. రోడ్డు ప్రమాదాల్లో ప్రధానంగా ద్విచక్రవాహన మరణాల్లో చాలా వరకు తగ్గించవచ్చని.. ఆ దిశగా ప్రతి ఒక్కరం అడుగు ముందుకు వేయాలని చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని