logo

ఉపాధి బకాయిల విడుదల ఎప్పుడో?

వేసవిలో సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న కూలీలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోకి తీసుకువచ్చిన ‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’’ వేతనాలు సక్రమంగా అందడం లేదు.

Published : 01 Jul 2024 05:36 IST

కంచికచర్ల, న్యూస్‌టుడే 

వేసవిలో సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న కూలీలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోకి తీసుకువచ్చిన ‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’’ వేతనాలు సక్రమంగా అందడం లేదు. పని కోరుకున్న ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలన్నదే పథకం ఉద్దేశం. ప్రస్తుతం పని చేసిన కూలీలకు వేతనాలు వెంటనే అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా పథకం పరిధిలో మొత్తం 16 బ్లాకులు, 289 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాబ్‌ కార్డుదారులు 1.72 లక్షల మంది ఉండగా.. వాటి ద్వారా ఉపాధి పొందుతున్న మొత్తం కూలీల సంఖ్య 2.99 లక్షలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 57.52 లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పని చేసిన ప్రతి కూలీకి వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి అప్పటివరకు చేసిన పని దినాలకు వచ్చే నగదును లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. అధికారుల సమాచారం ప్రకారం ఈ ఏడాది మే 20వ తేదీ వరకు కూలీలకు నగదు మంజూరు చేశారు. దాదాపు 5 వారాల నగదు బకాయి ఉంది. ఇప్పటివరకు ఉన్న బకాయి మొత్తం రూ.51.35 కోట్లుగా అధికారులు తెలిపారు. కొంత మంది కూలీలకు ఏడు వారాలకు పైగా నగదు బకాయి ఉన్నట్లు సమాచారం. బకాయిలు వెంటనే విడుదల చేయాలని కూలీలు కోరుతున్నారు.


త్వరలో విడుదల 

- సునీత, పీడి, డ్వామా 

గతంలోనూ రెండు మూడు వారాలకు నగదు వచ్చేది. ఈ సారి కొంత ఆలస్యమైన మాట నిజమే. గత మే 20 వరకు అందరికీ నగదు చెల్లించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతాయి. పది రోజుల్లో బకాయి నగదు చెల్లించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని