logo

ఫుట్‌పాత్‌లే ఆధారం

కడుపున పుట్టిన పిల్లలు వదిలేశారని ఒకరు.. తల్లిదండ్రులు తిట్టారని మరొకరు.. దారిలేక కొందరు.. దారి తప్పి మరికొందరు.. పని కోసం ఒకరు.. పనిలేక ఇంకొకరు. ఇలా చాలా మంది విజయవాడ నగరానికి చేరుకుంటున్నారు.

Updated : 30 Jun 2024 06:09 IST

నగరంలో నిరాశ్రయుల నరకయాతన

సరిపడా లేని వసతి గృహాలు

దుర్గగుడి సమీపంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అభాగ్యులు

ఫుట్‌పాత్‌పై వరుసగా పక్కపక్కనే నిద్రిస్తున్న వీరంతా ఒక ఊరోళ్లు కాదు.. కనీసం ఒక ప్రాంతానికి చెందినవారూ కాదు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి విజయవాడకు వచ్చిన నిరాశ్రయులు. రోజూ నగరంలోని దుర్గగుడి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఇలా పడుకుంటారు. ఉదయం ఎవరి పనికి వారు వెళ్లి రాత్రయ్యేసరికి ఇలా ఒకచోటికి చేరి నిద్రిస్తారు.

ఈనాడు డిజిటల్, అమరావతి: కడుపున పుట్టిన పిల్లలు వదిలేశారని ఒకరు.. తల్లిదండ్రులు తిట్టారని మరొకరు.. దారిలేక కొందరు.. దారి తప్పి మరికొందరు.. పని కోసం ఒకరు.. పనిలేక ఇంకొకరు. ఇలా చాలా మంది విజయవాడ నగరానికి చేరుకుంటున్నారు. వీరిలో అధిక శాతం మంది మద్యానికి బానిసలై ఇంటి నుంచి వచ్చేసినవారే. వారు ఉదయమంతా ఏదోఒక పనిచేస్తూ.. లేదంటే ఎక్కడోచోట గడిపేస్తున్నారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఫంక్షన్‌ హాల్స్‌ల్లో జరిగే కార్యక్రమాల్లో మిగిలే ఆహారాన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందించే ఆహారంతో కడుపు నింపుకొంటున్నారు. ఉపాధి కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితో పాటు దారితప్పి తమిళనాడు, చత్తీస్‌గఢ్‌ ఒడిశా, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి రోడ్డుపాలైన వారు నగరంలో చాలా మంది ఉన్నారు.

రెండు వేల మందికి పైగా..

విజయవాడ నగరంలో సుమారు రెండు వేల మంది వరకూ.. రోడ్ల పక్కనే జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా బెంజిసర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు, రైల్వేస్టేషన్, బస్టాండ్, కృష్ణానది ఒడ్డున, దుర్గగుడి ఫ్లైఓవర్‌ కింద, ప్రకాశం బ్యారేజీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నారు. ఉదయం లేచిన తర్వాత.. నగరపాలక సంస్థ మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో కాలకృత్యాలు తీర్చుకుని, బయలుదేరి తమకు పనిదొరికే ప్రదేశాలకు వెళ్లిపోతారు. మళ్లీ.. రాత్రయ్యేసరికి పడుకునేందుకు ఇదే ప్రాంతాలకు చేరుకుంటున్నారు. 

 బీఆర్‌టీఎస్‌ రోడ్డులో..

నగరంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డు ఇది. ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు.. రోజూ వందల మంది నిరాశ్రయులు రాత్రి వేళ ఇక్కడ పడుకుంటారు. రోజంతా ఏదో ఒక పనిచేసుకుని రాత్రయ్యే సరికి ఇక్కడికి వస్తారు. నగరంలో ఎక్కడా సరిపడా వసతిగృహాలు లేక వీరంతా ఇలా రోడ్లుపై జీవనం సాగిస్తున్నారు.

నగరం మొత్తంలో నాలుగే గృహాలు..

నగరంలో వేల మంది నిరాశ్రయులు రోడ్లపై దిక్కుతోచని స్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. నగరంలో ప్రతి లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతంలో ఒక నిరాశ్రయ వసతి గృహం ఉండాలి. కానీ.. సుమారు 12 లక్షలకు పైగా జనాభా ఉన్న విజయవాడ మున్సిపాలిటీలో మాత్రం కేవలం నాలుగే ఉన్నాయి. వీటిని పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా మున్సిపాలిటీ అధికారులు నడిపిస్తున్నారు. వీటిలోనూ కృష్ణలంక వసతి గృహ సామర్థ్యం 50మంది ఉండగా.. సౌకర్యాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. మిగిలిన మూడింటిలో ఒక్కో దాంట్లో సుమారు వంద మంది వరకు ఆశ్రయం పొందొచ్చు. సుమారు 2 వేలకు పైగా ఉన్న నిరాశ్రయులకు ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. వీటిలో భోజన వసతి కూడా లేదు.  నిరాశ్రయులు గృహాల్లో ఉండటానికి గుర్తింపు కార్డు ఉండాలి. చాలామందికి లేకపోవడంతో గృహాలకు రావడం లేదు. మహిళల కోసం ఒక్క వసతి గృహం కూడా లేదు. 

 మా గురించి ఆలోచించాలి

మాది నూజివీడులోని వెలమల కాలనీ. ఎటువంటి ఆస్తులు లేవు. నా భార్య, నేను పొలం పనులకు కూలీగా వెళ్తూ జీవనం కొనసాగించే వాళ్లం. నా కుమారుడుకి పదేళ్ల కిందట పెళ్లిచేశాం. తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వారి నుంచి విడిపోయి.. మేమిద్దరమే ఓ అద్దింట్లో ఉంటున్నాం. కరోనాతో నా భార్య మృతి చెందింది. తర్వాత ఏం చేయాలో తోచక విజయవాడ వచ్చేశాను. ఏదైనా హోటల్‌లో పని దొరికితే చేస్తాను. లేకుంటే.. ఏదైనా ఆలయం దగ్గర, దాతలు ఇచ్చిన ఆహారం తిని జీవిస్తున్నాను. మాలాంటి వారి కోసం ప్రభుత్వం ఆలోచించి.. ఏదైనా వసతి ఏర్పాటు చేయాలని నా విజ్ఞప్తి
- శ్రీనివాసరావు, నూజివీడు


షెల్టర్‌ కట్టిస్తే.. బాగుంటుంది..

నేను విజయవాడ వచ్చి పదేళ్లపైనే అవుతోంది. మాది మహబూబ్‌నగర్‌. నిత్యం తాగుతావని ఇంట్లో తరచూ గొడవజరిగేది. ఇంటి నుంచి వచ్చేశా. నాకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇప్పుడు వారు ఎలా ఉన్నారో తెలియదు. ఇంటికి వెళ్లాలని లేదు. రోజూ ఏదోఒక పనిచేసుకుంటాను. పని దొరక్కపోతే.. దేవాలయాల దగ్గర ప్రసాదాలతో ఆ రోజు సరిపెట్టుకుంటా. దుర్గగుడి సమీపంలో ఫుట్‌పాత్‌పై ప్రతిరోజు పడుకుంటా. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తరిమేస్తుంటారు. ఏదైనా ప్రత్యేకంగా షెల్టర్‌ లాంటిది కట్టిస్తే.. రాత్రివేళ పడుకునేందుకు బాగుంటుంది. 
- ప్రసాద్, మహబూబ్‌నగర్‌(తెలంగాణ)
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని