logo

వక్రించిన విధి.. తండ్రీకుమారుల దుర్మరణం

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు సంకు మాధవరావు, రామరాజు అక్కడికక్కడే మృతి చెందారు

Published : 30 Jun 2024 05:37 IST

గ్యాస్‌ సిలిండర్ల లారీ దూసుకెళ్లడంతో ఘటన
ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఢీకొన్న వాహనాలు

మృతులు మాధవరావు, రామరాజు (పాత చిత్రం) 

నందిగామ, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు సంకు మాధవరావు, రామరాజు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం... ఐతవరం గ్రామానికి చెందిన చలమల మైసూర్‌ లారీని డ్రైవర్‌ రామకృష్ణ తీసుకువచ్చి జాతీయ  రహదారి పక్కన ఆపారు. యజమాని ఇంటికి డ్రైవర్‌ వెళ్లి మాట్లాడి వచ్చి లారీకి పట్టా కడుతుండగా గ్యాస్‌ సిలిండర్ల లారీ వచ్చి ఢీ కొట్టింది. ఇద్దరు డ్రైవర్లు మాట్లాడుకుని సర్ధుబాటు చేసుకున్నారు. తరువాత ఐతవరం గ్రామానికి చెందిన లారీ వెళ్లిపోయింది. గ్యాస్‌ సిలిండర్ల లారీ ఇంజిన్‌ స్టార్ట్‌ కాక ఆగిపోయింది. కీసర టోల్‌ప్లాజాలో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న సంకు రామరాజు(40) వచ్చి ఆగిన గ్యాస్‌ సిలిండర్ల లారీకి ఫొటోలు తీస్తున్నారు. ఆ సమయంలో స్థానిక తాగునీటి పథకంలో పని చేస్తున్న రామరాజు తండ్రి మాధవరావు(60) నీరు విడుదల చేసి వస్తూ.. కుమారుడిని చూసి ఆగారు. ఇద్దరూ గ్యాస్‌ సిలిండర్ల లారీ ఎదుట ఉన్న సమయంలో కంటైనర్‌ వాహనం వేగంగా వచ్చి గ్యాస్‌సిలిండర్ల లారీని ఢీకొట్టింది. తండ్రి, కుమారుల మీదుగా గ్యాస్‌ సిలిండర్ల లారీ దూసుకెళ్లింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్‌ వాహనం తరువాత ఆర్టీసీ బస్సును కూడా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. గ్రామస్థుల సమాచారం మేరకు కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై దుర్గామహేశ్వరరావు, ఏఎస్సై పొదిలి రమేష్‌ సందర్శించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌ పరిశీలించి సంతాపం తెలిపారు. మార్చురీలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మృతదేహాలకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

జీవనాధారం కోల్పోయిన కుటుంబం

తండ్రి, కుమారులు చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వచ్చే కొద్దిపాటి జీతంతో గడిచిపోతున్న కుటుంబం జీవనాధారం కోల్పోయింది. మామ, భర్త మృతితో రామరాజు భార్య వీరకుమారి, ఎనిమిది, ఆరు తరగతులు చదువుతున్న కుమారుడు, కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మాధవరావు భార్య ఏడాది కిందటే మృతి చెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని