logo

ప్రజా సంతృప్తి నూరు శాతం చూడాలన్నదే లక్ష్యం

ప్రజల్లో సంతృప్తి నూరు శాతం చూడాలన్నదే తన లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Published : 30 Jun 2024 05:17 IST

 మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాదర్బార్‌కు విశేష స్పందన

మహిళల సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి కొల్లు 
మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: ప్రజల్లో సంతృప్తి నూరు శాతం చూడాలన్నదే తన లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. తెదేపా నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ్‌ స్ఫూర్తితో మచిలీపట్నం నియోజకవర్గంలోనూ ప్రతి శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించడంతో పాటు తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. నగర పరిధిలోని అన్ని డివిజన్లలో నగరవాసులను పట్టి పీడిస్తున్న డ్రెయినేజ్, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు.

300లకు పైగా వినతులు.. మంత్రి ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎక్కువ సంఖ్యలో టిడ్కో గృహ లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందాయి. తమ వాటాగా నగదు కట్టించుకున్నారని, బ్యాంకు రుణాలు వచ్చాయని అయినా తమకు గృహాలు కేటాయించలేదని అర్జీల్లో పేర్కొన్నారు. టిడ్కో నిర్మాణాలు ఇప్పట్లో పూర్తి కావని అసత్యాలు చెప్పి తమకు జగనన్న లేఔట్‌లో స్థలం ఇచ్చి టిడ్కో లబ్ధిదారునిగా తప్పించి వైకాపా వారికి కేటాయించుకున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలున్నా రాజకీయ కక్షతో తమకు వచ్చే సామాజిక పింఛను నిలిపివేశారని, తిరిగి పునరుద్ధరించాలనే అభ్యర్థనలతో కూడిన అర్జీలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. టిడ్కో గృహాలు, సామాజిక పింఛన్లకు సంబంధించే సుమారు 200 వరకూ అర్జీలు అందాయి. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన మంత్రి రవీంద్ర తక్షణ పరిష్కారయోగ్యమైన అర్జీలకు వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని, మిగిలిన వాటిని సంబంధిత శాఖలకు పంపి సంతృప్తికర పరిష్కారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన మహిళలు, వృద్ధుల వద్దకు స్వయంగా ఆయనే వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బండి రామకృష్ణ, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు