logo

ఎగవేతదారులకు పోలీసుల అండ

చిట్టీల పేరుతో మోసగించిన మహిళకు వైకాపా నాయకులతోపాటు పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి

Published : 30 Jun 2024 05:14 IST

బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
కొమ్ముకాస్తున్న వైకాపా నాయకులు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : చిట్టీల పేరుతో మోసగించిన మహిళకు వైకాపా నాయకులతోపాటు పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమను మోసగించిన వ్యవహారంపై బాధితులు శుక్రవారం ఉదయమే హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా శనివారం రాత్రి వరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. హనుమాన్‌జంక్షన్‌లో అనధికార చిట్టీల పేరుతో మోసగించిన ఘరానా మహిళపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎంజీనగర్‌ కాలనీకి చెందిన షేక్‌ నర్గీస్‌ అనే మహిళ కొన్నేళ్లుగా అనధికార చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ.. తమ వద్ద నుంచి నెల వాయిదాల పేరుతో వసూళ్లు చేసి, సొమ్ము ఎగవేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము సక్రమంగా ప్రతి నెలా వాయిదాలు చెల్లించినా పాడుకున్న చిట్టీలకు సంబంధించిన నగదు మొత్తాన్ని ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. ఇటీవల గట్టిగా నిలదీస్తే రోజుల వ్యవధిలోనే చెల్లిస్తానని నమ్మబలికి, తీరా తమకే ఎదురు నోటీసులు జారీ చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిగో నగదు ఇచ్చేస్తున్నానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన నర్గీస్, చిట్టీలు వేసిన మహిళల దగ్గర తాను అప్పులు తీసుకుని, చాలా వడ్డీ కట్టానని, ఇక బాకీ చెల్లించలేననే విధంగా నోటీసులు జారీ చేయించడం గమనార్హం.

ముందస్తుగానే  ప్రణాళిక

నర్గీస్‌ కుటుంబం మొదట్నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారులుగా ఉండేవారని బాధితులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఒక సోదరుడు మినహా మిగతా వారంతా వైకాపా గెలుపు కోసం పనిచేశారని పేర్కొంటున్నారు. నర్గీస్‌ సోదరుడు రఫీ ఎంజీనగర్‌ కాలనీలో యువకుల్ని సమీకరించి వంశీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, నగదు, మద్యం పంపిణీ చేయడంలో చురుగ్గా వ్యవహరించాడని గుర్తు చేస్తున్నారు. తరచుగా కాలనీల్లో జూదం, కోడి పందేల శిబిరాలు కూడా నిర్వహించాడనే ప్రచారం ఉంది. మరోపక్క ఎంతోకాలం నుంచి చిట్టీలు వేయడం, అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వడం ద్వారా కాలనీలో దందా నిర్వహిస్తూ వచ్చిన నర్గీస్, తెదేపా కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తమకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో ఇక్కడి నుంచి పలాయనం సాగించేందుకు ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాలనీలో ఉన్న ఇల్లు, ఇతరత్రా ఆస్తులను అల్లుడి పేరిట బదలాయించి, నగదు, బంగారాన్ని ముందుగానే తరలించేశారని, తమకు నోటీసులు పంపి, వారు రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

 పోలీసుల తీరుపై  సందేహం

తమను మోసగించిన వ్యవహారంపై బాధితులు శుక్రవారం ఉదయమే హనుమాన్‌జంక్షన్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. శనివారం రాత్రి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పైగా మోసగించిన మహిళ పరారీలో ఉండటం, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కొక్కరుగా రహస్య ప్రాంతాలకు జారుకుంటున్నా పట్టనట్లు వ్యవహరించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా హయాంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పూర్తిగా అంటకాగిన పోలీసులు, ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ, ఆయన వర్గీయులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్సై జనార్దన్‌ మాట్లాడుతూ బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారన్నారు. విచారణ చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని