logo

కట్టు తప్పిన ఖాకీలు..!

అరాచక శక్తులు పేట్రేగుతుంటే.. పీచమణచాల్సిన పోలీసుల్లో కొందరు వారితో అంటకాగుతున్నారు. న్యాయం కోసం స్టేషన్‌ మెట్లెక్కిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు

Updated : 30 Jun 2024 06:21 IST

పోలీసుల్లో పెరిగిన విచ్చలవిడితనం
అసాంఘిక శక్తులతో చెట్టపట్టాలు 
ఠాణాల్లో పెచ్చుమీరిన అవినీతి

ఈనాడు, అమరావతి: అరాచక శక్తులు పేట్రేగుతుంటే.. పీచమణచాల్సిన పోలీసుల్లో కొందరు వారితో అంటకాగుతున్నారు. న్యాయం కోసం స్టేషన్‌ మెట్లెక్కిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. సామాన్యులను బెదిరించి పీల్చి పిప్పి చేస్తున్నారు. కొన్ని స్టేషన్లలో అయితే పాలన పూర్తిగా గాడి తప్పింది. వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఇదీ నగరంలోని పలు స్టేషన్లలో పరిస్థితి. గత వైకాపా పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో చట్టం నీరుగారిపోయింది. వైకాపా నేతలు చెప్పిందే శాసనమన్నట్టు పలువురు పోలీసులు వ్యవహరించారు. సెటిల్మెంట్లు, సివిల్‌ పంచాయతీలను ఉన్నతాధికారులు అడ్డుకోలేకపోయారు. కింది స్థాయిలో జవాబుదారీతనమే కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో వీఆర్‌కు వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. కీలకమైన శాంతి, భద్రతల విభాగంలో ఉన్న పలువురిపై వేటు పడుతోంది.

అవినీతి మరకలు.. రౌడీషీటర్లతో సంబంధాలు

నున్న స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు బరి తెగించి మరీ రౌడీషీటర్లు, గంజాయి ముఠాలతో అంటకాగుతున్నారు. వారితో తిరుగుతున్నారు. అసాంఘిక శక్తులతో కలిసి మద్యం పార్టీలు చేసుకోవడం పరిపాటిగా మారింది. అసలే ఇది సమస్యాత్మక స్టేషన్‌. ఈయనపై ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్‌ చేశారు. 

భవానీపురం స్టేషన్‌లో ఎవరి దారి వారిదే..

నగరంలో కీలకమైన భవానీపురం స్టేషన్‌లో పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది. సిబ్బంది వర్గాలుగా విడిపోయి.. ఒకరిపై మరొకరు దుష్పృచారం చేసుకునే స్థాయి వరకు వెళ్లింది. కొందరికి అసాంఘిక శక్తులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అవినీతికి అడ్డాగా మారింది. ఇక్కడి సీఐ కృష్ణను సరిగ్గా పోలింగ్‌ ముందు రోజు సీపీ రామకృష్ణ బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణల కారణంగా వీఆర్‌కు పంపించారన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత వచ్చిన సీఐ కూడా ఎక్కువ రోజులు లేరు. గత వారం సిక్‌ లీవ్‌పై వెళ్లారు. గత నెలలో మద్యం పార్టీలో ఎస్‌.ఐ పాల్గొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. టేబుళ్లపై రెండు మందు గ్లాసులు కనిపిస్తుండగా.. యూనిఫాంలో ఉన్న పూర్వ భవానీపురం ఎస్‌.ఐ రవీంద్రబాబు తాపీగా సిగరెట్‌ తాగుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇది గతంలో రవీంద్రబాబు భవానీపురం స్టేషన్‌లో పని చేసినప్పుడు తీసిందిగా భావిస్తున్నారు. ఆయన ఇక్కడున్నప్పుడు పలు సెటిల్‌మెంట్లు చేశారన్న ఆరోపణలూ వచ్చాయి. నాటి వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధితో సన్నిహిత సంబంధాలున్నాయి. 

  • భవానీపురం స్టేషన్‌లో ఎస్‌.ఐ. రామకృష్ణను ఇటీవల వీఆర్‌కు పంపించారు. ఈయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేసుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. చివరకు వేకెన్సీ రిజర్వుకు పంపించారు. రి నున్న పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల సీఐ సహాయకుడైన హెడ్‌కానిస్టేబుల్‌ రామ్మోహన్, ఏఎస్‌ఐ కోటేశ్వరరావు స్టేషన్‌లోనే తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ గొడవ జరిగినట్టు చెబుతున్నారు.  సిబ్బంది అతికష్టమ్మీద శాంతింపచేయాల్సి వచ్చింది. 

నిస్తేజంగా స్పెషల్‌ బ్రాంచి: నగర పోలీసు కమిషనర్‌కు కళ్లు, చెవులుగా ఉండాల్సిన స్పెషల్‌ బ్రాంచి నిస్తేజంగా మారింది. సంఘటనలు, రోజువారీ వ్యవహారాలు, స్టేషన్లలో జరిగే తతంగాలపై నిఘా పెట్టి.. సీపీకి ఎప్పటికప్పుడు నివేదించడం ఈ విభాగం బాధ్యత. ఇంతటి కీలకమైన విభాగం సమాచార సేకరణ, నిఘాలో తీవ్రంగా విఫలమవుతోంది. సమాచారం కోసం ఇతరులపై ఎక్కువ ఆధారపడడమే ఇందుకు కారణం. మూడో పక్షం నుంచి సీపీకి ఫిర్యాదులు వస్తేనే అసలు విషయం తెలుస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని