logo

కారుచౌకగా కొల్లగొట్టుడే..!

అక్కడ గజం.. ప్రభుత్వ విలువ ప్రకారం రూ.91 వేలు. మార్కెట్‌ విలువ చదరపు గజం రూ.2 లక్షలు ఉంది. స్థలం స్వరూపం బట్టి ఇంకా ఎక్కువే పలుకుతోంది.

Updated : 30 Jun 2024 06:29 IST

వైకాపా అండతో బరితెగింపు...

వెలుగులోకి గాంధీ బ్యాంకు అక్రమాలు 
రూ.2.10 కోట్ల ఆస్తి రూ.88 లక్షలకే స్వాహా
పాలకవర్గం, అధికారుల బినామీలకే

గాంధీ కో- ఆపరేటివ్‌ బ్యాంకు ఇదే.. 

ఈనాడు, అమరావతి : అక్కడ గజం.. ప్రభుత్వ విలువ ప్రకారం రూ.91 వేలు. మార్కెట్‌ విలువ చదరపు గజం రూ.2 లక్షలు ఉంది. స్థలం స్వరూపం బట్టి ఇంకా ఎక్కువే పలుకుతోంది. ప్రభుత్వం మారక ముందు ధరలివి. ఇప్పుడు ఇంకా 20-25 శాతం పెరిగాయి. విజయవాడ నగరంలో ఎంజీ రోడ్డు ప్రధాన రహదారిలో 80 గజాల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనం ఉంది. ప్రభుత్వ విలువ ప్రకారం రూ.72.80 లక్షలు. భవనం విలువ దాదాపు రూ.50 లక్షలు. అంటే దాదాపు రూ.1.23 కోట్లు ఉంటుంది. మార్కెట్‌ ధర ప్రకారం గజం రూ.2 లక్షలు ఉంది. భవనంతోపాటు రూ.2.10 కోట్లు పలుకుతుంది. కానీ ఈ భవనాన్ని కేవలం రూ.88 లక్షలకే వేలంలో కొనుగోలు చేసిన ఉదంతమిది.   

బ్యాంకు పాలకవర్గంలో వైకాపా నాయకులు ప్రణాళిక ప్రకారం ఈ ఆస్తిని తమ అనుచరులు దక్కించుకునేలా చక్రం తిప్పారు. విజయవాడలోని గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు పాలక వర్గం తీరిది. దీనిపై ఆ భవన యజమాని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మారడంతో ఈ బ్యాంకులో జరిగిన అక్రమాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. వైకాపా నాయకుల అండతో బ్యాంకులో ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఖాతాదారులను అడ్డంగా దోచేస్తున్నారు. ఈ బ్యాంకు మహాజన సభ ఆదివారం నిర్వహించనున్నారు. బ్యాంకులో జరిగే మోసాలపై ఖాతాదారులు ప్రశ్నించేందుకు సిద్ధం అవుతున్నారు. బ్యాంకు వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన సహకార శాఖ అధికారులు సైతం పాలకవర్గంతో మిలాఖత్‌ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పక్కా ప్రణాళికతో...

లబ్బీపేటలో రవిబాబుకు 80 గజాల స్థలంలో 3 అంతస్తుల భవనం ఉంది. దీన్ని తనఖా పెట్టి గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో రుణం తీసుకున్నారు. దస్త్రాల పరిశీలనలో కొంత సరళంగా ఉంటారని ఇక్కడ ఎక్కువ మంది తనఖా రుణాలు తీసుకుంటారు. పట్టణ ప్రణాళిక ప్లాన్‌ ఇతర డాక్యుమెంట్లలో కొద్దోగొప్పో తేడా ఉన్నా.. రుణాలు మంజూరు చేయడం ఈబ్యాంకుకు అలవాటు. పాలకవర్గం సిపార్సుతో ఇస్తుంటారు. వాయిదాలు చెల్లించకపోవడంతో భవనం వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. యజమాని కూడా ప్రయత్నాలు చేసి వేలానికి తప్పనిసరిగా అంగీకరించారు. దీంతో ప్రకటన జారీ చేసి వేలం నిర్వహించి రూ.88 లక్షలకే పాడేశారు. ఇది కూడా పాలకవర్గంలోని డైరెక్టర్ల సంబంధీకులు దక్కించుకున్నారు. బ్యాంకు సీఈవో భర్త తరపున ఒకటో పట్టణవాసికి ఈ వేలం దక్కింది. బినామీ పేర్లతో దీన్ని దక్కించుకున్నారు. సీఈవో భర్త వేలంలో పాల్గొనే వీలులేదు. పాలకవర్గం డైరెక్టర్లు పాల్గొనకూడదు. కానీ నేరుగా ఓ డైరెక్టర్‌ వేలంలో పాల్గొన్నారు. ఎవరూ పోటీకి రాకుండా సిండికేట్‌ చేశారు. తమ రుణం కంటే ఎక్కువ సొమ్ము వస్తే వేలం ఖరారు చేస్తారు. తక్కువకే దీన్ని ఖరారు చేసి తీసుకున్నారు.  

పంపకాలతో మరుగు..

పాలకవర్గంలో ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూసినప్పుడు పంపకాలతో సరిచేస్తున్నారు. బ్యాంకు మిగిలిన డైరెక్టర్లు, కొందరు కీలక అధికారులు సమాన వాటాలుగా పంచుకుని సర్దుబాటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు ఆధ్వర్యంలో కొత్త శాఖ ప్రారంభించే విషయంలో నిధులు అవకతవకలు వెలుగు చూస్తే.. వాటిని పంపకాలతో సరిచేసుకున్నారని తెలిసింది. ఛైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం వరకు వెళితే.. తప్పనిసరిగా డీఎల్‌సీవో అవిశ్వాసం తేదీని ఖరారు చేస్తే.. ముందురోజు ఓ నక్షత్ర హోటల్‌లో సమావేశమై.. తలా పిడికెడు తీసుకుని మమ అనిపించారు. అవిశ్వాస సమావేశానికి డైరెక్టర్లు రాకుండా గైర్హాజరయ్యారు. గాజువాకలో కొత్తశాఖ పేరుతో పాలకవర్గం ఆమోదం లేకుండానే రూ.40 లక్షల విలువైన సామగ్రి కొన్నారు. ఇవి ఎక్కువ ఉన్నాయని అభ్యంతరం చెప్పడంతో పైవిధంగా సర్దుబాటు చేసుకున్నారు. హనుమాన్‌ జంక్షన్‌లో 400 గజాల స్థలాన్ని రూ.కోట్లు వెచ్చించి కొన్నారు. అక్కడ మార్కెట్‌ విలువ లేకున్నా.. కొనడం వివాదమైంది. నూజివీడులోనూ ఓ స్థలాన్ని బ్యాంకు కోసం ఇలాగే కొన్నారు. కానీ తనఖా ఆస్తులను మాత్రం కారుచౌకగా బయటవారికి కట్టబెడుతున్నారు. 

మొత్తుకున్నా వినలేదంతే...

వాణిజ్య ప్రాంతంలోని భవనం ఇంత తక్కువకు ఎలాగని యజమాని లబోదిబోమన్నారు. కానీ పట్టించుకోలేదు. తాను రుణం మొత్తం చెల్లిస్తానని వేలం రద్దు చేయాలని యజమాని కోరినా పాలకవర్గం అంగీకరించలేదు. వివాదం కావడంతో వేలం ఖరారు చేసి కొంత సొమ్ము అనధికారికంగా చెల్లించేలా సర్దుబాటు చేసుకున్నారు. ఈ విషయంలోనూ వైకాపా నేతలు కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. బ్యాంకు ఉద్యోగి భర్త బెదిరింపులకు దిగినట్లు సమాచారం. వేలంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌.. సేల్‌ ఆఫీసర్‌ కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. సేల్‌ ఆఫీసర్‌గా సహకార శాఖ ఉద్యోగి ఉన్నారు. ఆయన గత పదేళ్లుగా ఇదే ఉద్యోగంలో ఉన్నారు. ప్రతి మూడేళ్లకు మార్చాల్సి ఉన్నా.. పాలక వర్గం మార్చకుండా కొనసాగిస్తోంది. ఆయన ఛైర్మన్, ఇతర డైరెక్టర్లు చెప్పినట్లు వింటున్నారు. ఈ సంఘటన ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి బంగారం తాకట్టులోనూ చాలా జరిగాయి. నివేశన స్థలాల తాకట్టులో చౌకగా కొట్టేయడం బ్యాంకు పాలక వర్గానికి సర్వ సాధారణంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం రెచ్చిపోయారు. అడిగేవారు లేకుండా పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని