logo

కీలకంగా మారిన పోస్ట్‌మార్టం నివేదిక

అజిత్‌సింగ్‌నగర్‌ లూనా సెంటరులోని మదర్సాలో జరిగిన కరిష్మా (17) అనుమానాస్పద మృతిపై అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Published : 30 Jun 2024 04:58 IST

కరిష్మా మృతిపై దర్యాప్తు ముమ్మరం

అజిత్‌సింగ్‌నగర్‌ (మధురానగర్‌), న్యూస్‌టుడే : అజిత్‌సింగ్‌నగర్‌ లూనా సెంటరులోని మదర్సాలో జరిగిన కరిష్మా (17) అనుమానాస్పద మృతిపై అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కలుషిత ఆహారం వల్లే మృతి చెందినట్లు ముందుగా చెప్పినా బాలిక మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా మదర్సాలోని మిగిలిన బాలికలు, యువతులను శుక్రవారమే వారి కుటుంబ సభ్యులు వచ్చి ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. మదర్సాను అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు మూసి వేసి అక్కడ పికెట్‌ ఏర్పాటు చేశారు.

బాలికల వాంగ్మూలం నమోదు

కరిష్మా మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ కాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదిక కీలకంగా మారింది. బాలిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా టీం ఆఫ్‌ డాక్టర్స్‌తో పోస్ట్‌మార్టం చేయించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే మరణం ఎన్ని గంటలకు జరిగింది? ఏ కారణంతో సంభవించిందో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ తరువాతే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని అంటున్నారు. కాగా మదర్సాకు సంబంధించిన రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరిష్మాతో పాటు అస్వస్థతకు గురయ్యారని చెపుతున్న బాలికల నుంచి అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు శుక్రవారమే వివరాలు నమోదు చేసుకున్నారు. వారంతా బుధవారం మధ్యాహ్నం నుంచే వాంతులు, విరేచనాలు అయ్యాయని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు. దోసకాయ కూర, దొండకాయ కూర, పెరుగన్నం తిన్నామని వారిలో ముగ్గురు బాలికలు తెలిపారు. అయితే ఎవరూ మాంసాహారం తినలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలిక ఎలా మరణించిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మరణించిన తరువాతే కరిష్మాను ఆసుపత్రి తీసుకువచ్చారని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని