logo

వైకాపా సేవలో.. గాంధీ అర్బన్‌ బ్యాంకు

గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు... విజయవాడ కేంద్రంగా సహకార రంగంలో ఏర్పడింది... పర్యవేక్షణ అంతా ప్రభుత్వ సహకార వ్యవస్థదే... వేలాదిమంది డిపాజిటర్లు నమ్మకం పెట్టుకున్న ఘనత దీని సొంతం...

Published : 29 Jun 2024 04:48 IST

గత ఎన్నికల్లో ఛైర్మన్‌ ప్రచారం
తెదేపా కార్యాలయంపై దాడిలో ఓ డైరెక్టర్‌ ప్రమేయం
ఓట్ల కొనుగోలుకు నగదు లావాదేవీలు
పాలకవర్గంపై ఫిర్యాదుల వెల్లువ

ఈనాడు, అమరావతి: గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు... విజయవాడ కేంద్రంగా సహకార రంగంలో ఏర్పడింది... పర్యవేక్షణ అంతా ప్రభుత్వ సహకార వ్యవస్థదే... వేలాదిమంది డిపాజిటర్లు నమ్మకం పెట్టుకున్న ఘనత దీని సొంతం... దాన్ని నిలబెట్టుకోలేని ఛైర్మన్, కొంతమంది డైరెక్టర్లు దారి తప్పారు. . నాటి వైకాపా సేవలో తలమునకలైన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది... అంతేకాదు... మొన్నటి ఎన్నికల్లో వైకాపా తరఫున ఓట్ల కొనుగోలుకు ఈ బ్యాంకు శాఖ నుంచి డబ్బులు పంపిన విషయంపైనా గుసగుసలు వినిపిస్తున్నాయి. 
మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన వైకాపా హయాంలో భ్రష్టుపట్టిన రంగాలెన్నో. అన్ని వ్యవస్థల్లోనూ జోక్యం చేసుకుని.. వాటిని దారి మళ్లించి స్వప్రయోజనాలకు వాడుకున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందులో తాజాగా వినిపిస్తున్న పేరు గాంధీ కోపరేటివ్‌ బ్యాంకు. దీని పాలకవర్గం వైకాపాకు కొమ్ము కాసింది. బ్యాంకు ఖాతాదారుల్లో విశ్వసనీయత సన్నగిల్లుతుందేమోనన్న ధ్యాసే లేకుండా.. ఆ పార్టీ నాయకుల పట్ల పూర్తి పక్షపాతంగా వ్యవహరించినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా మొన్నటి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరఫున బ్యాంకు ఛైర్మన్‌ ప్రచారం చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెదేపా కార్యాలయంపై దాడి చేసిన వారిలో పాలకవర్గంలోని ఓ డైరెక్టర్‌ ఉన్నట్టు తెలిసింది. 

గతంలోనూ వివాదాలే...

ఇతర జాతీయ బ్యాంకులతో పోలిస్తే.. గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు అదనపు వడ్డీతో డిపాజిట్లను ఆకర్షిస్తోంది. ఇంటి రుణాలు, బంగారం తాకట్టు రుణాలు, విద్యా, వ్యక్తిగత రుణాలను ఇస్తోంది. విజయవాడ నగరంలో పలుప్రాంతాలతోపాటు, రూరల్‌లో, గుంటూరులోనూ శాఖలున్నాయి. గతంలో పలు వివాదాలు చుట్టుముట్టినప్పుడు కోపరేటివ్‌ రిజిస్ట్రార్‌ విచారణ చేశారు. గాజువాకలో కొత్త శాఖ ఏర్పాటు విషయంలో నిధులు దుర్వినియోగం అయినట్టు, ఒక స్థలం కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఫిర్యాదులొచ్చాయి. బ్యాంకు చరిత్రలోనే తొలిసారి ఛైర్మన్‌పై కొంతమంది అవిశ్వాసం ప్రకటించి.. తేదీ ఖరారయ్యాక రాజీ కుదుర్చుకున్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో మళ్లీ వివాదాలు చెలరేగాయి. ప్రస్తుతం అవి తీవ్రరూపం దాల్చాయి. వైకాపా అనుకూల నిర్ణయాలు తీసుకున్నట్టు ఉన్నతాధికారులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. 

అవినాష్‌కు మద్దతుగా..

మొన్నటి ఎన్నికల్లో వైకాపా తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్‌ తరఫున బ్యాంకు ఛైర్మన్‌ ప్రచారం చేసినట్టు తాజాగా చిత్రాలు బయటకొచ్చాయి. బ్యాంకు ఉద్యోగులు ఏ రాజకీయపార్టీకీ ప్రచారం చేయకూడదన్న నిబంధన ఉంది. అలాంటిది ఛైర్మన్‌ ఎలా ఉల్లంఘించారన్నది ప్రశ్న. అంతేకాదు.. బ్యాంకులో వైకాపా అనుకూల నిర్ణయాలను అమలు చేసినట్టు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ బ్యాంకు డైరెక్టర్‌గా ఉన్న జోగిరాజు... గతంలో తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా వెలుగు చూశాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపా కార్యాలయంపై ఏడాది కిందట దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. జోగిరాజుకు మద్దతుగా ఛైర్మన్‌ ఉన్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ప్రచారానికి కూడా ఈ బ్యాంకు నుంచి నగదు సమకూర్చినట్టు ఫిర్యాదులున్నాయి. వైకాపా నాయకులు, కొంతమంది కార్పొరేటర్లకు ఛైర్మన్‌ రసీదు ఇస్తే... దాన్ని పటమట బ్రాంచిలో చూపించి నగదు తీసుకునేవారు. ఆ తరువాత వాటిని సర్దుబాటు చేసుకునేవారని తెలిసింది. పటమట శాఖ నుంచి ఇలా అనధికారికంగా దాదాపు రూ. 4 కోట్ల వరకు పంపిణీ చేసినట్టు సమాచారం. ఇలా ఎలా సర్దుబాటు చేశారనేది గోప్యంగా ఉంచారు. ఆడిట్‌లో బయటపడే అవకాశం ఉంది. ఇలా ఒక్క పటమట శాఖలోనే చేశారా? మిగిలిన శాఖల్లోనూ ఉందా? అన్నది తేలాల్సి ఉంది. ఈ బ్యాంకులో ఇప్పటికీ మాజీ సీఎం జగన్‌ నామస్మరణ జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. సహకార చట్టం ప్రకారం నడపాల్సిన బ్యాంకులో రాజకీయాలకు పెద్దపీట వేయడంపై విమర్శలు వస్తున్నాయి. రుణాల మంజూరులోనూ వైకాపా నాయకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు వెళ్లాయి.

ఎన్నికల ప్రచారం చేయకూడదు

బ్యాంకు వ్యవహారంపై డీఎల్‌సీవో, జిల్లా రిజిస్ట్రార్‌ (సహకార రంగం) కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా తాజాగా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. గతంలో అవిశ్వాసానికి నోటీసు వస్తే.. తేదీ ప్రకటించామని కానీ ఎవ్వరూ రాకపోవడంతో వీగిపోయిందని పేర్కొన్నారు. గతంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి డీసీవోకు నివేదిక ఇచ్చామని చెప్పారు. బ్యాంకు పాలకవర్గం రాజకీయపార్టీల కోసం ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని