logo

కృష్ణ... కృష్ణా..!

జిల్లాకో విశ్వవిద్యాలయంలో భాగంగా మచిలీపట్నంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ మసకబారుతోంది.

Updated : 29 Jun 2024 05:50 IST

దిగజారుతున్న విశ్వవిద్యాలయ విలువలు
కేసులు పెట్టుకునే స్థాయికి వర్గ విభేదాలు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాకో విశ్వవిద్యాలయంలో భాగంగా మచిలీపట్నంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ మసకబారుతోంది. కనీస సౌకర్యాల విషయాన్ని పక్కన పెడితే విద్యాబోధన, పరిపాలనాపరమైన విషయాల్లో అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  మూల్యాంకనంలో అవకతవకలు, పీహెచ్‌డీల ప్రదానంలో ఆశ్రితపక్షపాతం, అధ్యాపకుల పదోన్నతుల్లో వర్గ రాజకీయాలు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు పరిపాటిగా మారాయి. చివరకు కీలకస్థానంలో ఉన్న వారి మధ్య వ్యక్తిగత విభేదాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే స్థాయికి చేరుకున్నాయంటే విశ్వవిద్యాలయ విలువలు ఏ మేరకు దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
విశ్వవిద్యాలయంలో సీనియర్‌ ఆచార్యులు ఎంవీ బసవేశ్వరరావు నూజివీడు పీజీ కేంద్రంలో తనకు కేటాయించిన బాధ్యతల గడువు ముగియడంతో విశ్వవిద్యాలయంలో తన పోస్టులో చేరేలా రిపోర్ట్‌ చేసేందుకు వస్తే వీసీ అందుకు అనుమతించలేదు. ఈ సందర్భంగా ఇరువురి నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో వీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఆచార్య జయశంకరప్రసాద్‌ తనకు తెలియకుండా ఛాంబర్‌ను స్వాధీనం చేసుకుని అందులోని రికార్డులు, థీసిస్‌ పత్రాలు, తదితరాలు మాయం చేశారని, బాధ్యులు ఎవరో తేల్చకుంటే ఇనగుదురుపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించారు. ఇలా రోజుకో రకంగా విభేదాలు, ఆరోపణలు ఫిర్యాదుల రూపంలో రచ్చకెక్కే స్థాయికి చేరుకుంటున్న పరిస్థితుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ప్రక్షాళన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

విద్యార్థి సంఘాల ఆగ్రహం

గతంలో ఇద్దరు ముగ్గురు ఉపకులపతులు విశ్వవిద్యాలయ అభివృద్ధే ధ్యేయంగా శ్రమించినా గడచిన ఐదు సంవత్సరాలుగా అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నియామకాల్లో రాజకీయ జోక్యం, ఇష్టానుసారం ఒప్పంద ఉద్యోగులను నియమించుకున్న నేపథ్యంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వర్గాలుగా విడిపోయారు. వర్గ రాజకీయాలను పోషించుకునే క్రమంలో విద్యా సంబంధ విషయాలను పూర్తిగా గాలికొదిలేయడంతో పాటు విశ్వవిద్యాలయ అవసరాలను పూర్తిగా విస్మరించారంటూ పలు సందర్భాల్లో విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.

నేరుగా గవర్నర్‌కే ఫిర్యాదులు

విశ్వవిద్యాలయంలోని పరిస్థితులపై అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఏకంగా గవర్నర్‌కే ఫిర్యాదు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ.కోట్లలో జరిగిన ఆర్థిక నిధుల దుర్వినియోగం గురించి ఫిర్యాదులో వివరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు అనుకూలంగా ఉన్నవారికే  పీహెచ్‌డీలు ప్రదానం చేస్తున్నారని, ఈ కారణం వల్ల మనోవ్యధకు గురైన ఓ విద్యార్థిని గతేడాది ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా విశ్వవిద్యాలయ నిధులతో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటును ప్రశ్నించిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ సంఘ నాయకులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏంబీఏ విభాగ అధిపతిని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించడం, ఆయన లేని సమయంలో తాళం పగలగొట్టి ఛాంబర్‌ను స్వాధీనం చేసుకోవడంతో చివరి సెమిస్టర్‌ పరీక్షలకు హాజరైన ఎంబీఏ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రశ్నార్థకంగా మారింది. మూల్యాంకన విషయంపై ఎవరూ నోరుమెదపకోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. మరోపక్క విశ్వవిద్యాలయ నిధులు రూ.10కోట్లు రాజకీయ ఒత్తిడితో ప్రజాపనులశాఖ(సీపీడబ్ల్యూడీ)కి మళ్లించారని, కమిషన్ల కోసం విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన దాదాపు రూ.43.32 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులకు కేటాయించారనే విమర్శలున్నాయి. ఎంవోయూ గడువు ముగిసినా స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి పనులు చేస్తున్న గుత్తేదారునికి అనుకూలంగా వ్యహరిస్తున్నారంటూ తీవ్ర అభియోగాలు మోపుతూ తాజాగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రజాసమస్యల పరిష్కార వేదిక(మీకోసంలో)లో మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు.

ఉపకులపతి జ్ఞానమణి రాజీనామా

కృష్ణా విశ్వవిద్యాలయం(మచిలీపట్నం),న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి జి. జ్ఞానమణి తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారిన క్రమంలో తాను రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇంతకు ముందు ఉపకులపతిగా పనిచేసిన కె.బి చంద్రశేఖర్‌ పదవీకాలం గతేడాది జనవరితో ముగియగా అప్పుడు ఉన్నత విద్యామండలి వైస్‌ఛైర్మన్‌గా ఉన్న కె. రామమోహనరావు ఇన్‌ఛార్జి వీసీగా ఆరునెలలపాటు విధులు నిర్వహించారు. ఆ తరువాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో జువాలజీ ఆచార్యులుగా, ఆర్ట్‌అండ్‌సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి  ఉద్యోగ విరమణ చేసిన జ్ఞానమణిని కృష్ణావిశ్వవిద్యాలయానికి ఉపలకులపతిగా గత ప్రభుత్వం నియమించింది. గతేడాది జులై 13 నుంచి జ్ఞానమణి ఉపకులపతిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజీనామాను గవర్నర్‌ ఆమోదించిన అనంతరం ప్రభుత్వం కొత్త ఉపకులపతి నియామకంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని