logo

యువకుడి ఉన్మాదం.. వీధిన పడిన చిరు వ్యాపారి కుటుంబం

యువకుడి ఉన్మాదం చిరు వ్యాపారి కుటుంబాన్ని వీధిన పడేసింది. విద్యాధరపురం చెరువు సెంటరుకు చెందిన చిరువ్యాపారి కంకిపాటి శ్రీరామప్రసాద్‌ (57) హత్య ఉదంతం నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది.

Published : 29 Jun 2024 04:36 IST

విజయవాడలో ఘాతుకం

విద్యాధరపురం, న్యూస్‌టుడే: యువకుడి ఉన్మాదం చిరు వ్యాపారి కుటుంబాన్ని వీధిన పడేసింది. విద్యాధరపురం చెరువు సెంటరుకు చెందిన చిరువ్యాపారి కంకిపాటి శ్రీరామప్రసాద్‌ (57) హత్య ఉదంతం నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. నిందితులు, బాధితులు ఇరువురూ భవానీపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని వారే కావడంతో సీఐ ఉమామహేశ్వరరావు అప్రమత్తమయ్యారు. శుక్రవారం వేకువజామునే రెండు పోలీసు బృందాలను క్షేత్ర స్థాయికి పంపి నిందితుడి కుటుంబం వివరాలు సేకరించారు. బాధిత కుటుంబానికి రక్షణ ఏర్పాట్లు చేశారు. ఉన్మాద చర్య ఫలితంగా చిరువ్యాపారి కుటుంబం వీధిన పడింది. శ్రీరామప్రసాద్‌కు(చిల్లర కొట్టు రాము) భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధులైన తండ్రి సాంబశివరావు, తల్లి సామ్రాజ్యం కూడా ఆయనపైనే ఆధారపడ్డారు. తమ కుమార్తె జోలికి రావొద్దని మందలించడమే శ్రీరామప్రసాద్‌పై గడ్డం శివమణికంఠ కత్తితో తెగబడడానికి కారణం. మణికంఠ ఉన్మాద చేష్టకు ఇద్దరు యువతుల భవిష్యత్తు దిక్కుతోచని స్థితిలో పడింది. వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ ఆ కుటుంబానికి మరింత భారంగా మారింది. 

వ్యాపారం పెరుగుతున్న సమయంలో..

కొవిడ్‌ సమయంలో తీవ్రంగా నష్టపోయిన శ్రీరామప్రసాద్‌కు ఇంటి అద్దె కట్టడమే భారమైంది. వ్యాపారం క్రమంగా పుంజుకుంటున్న సమయంలో ఉన్మాది చేష్ట శరాఘాతమైంది. పెద్దల సమక్షంలో మందలిస్తే బుద్ధిగా ఉంటాడనుకుంటే కక్ష పెంచుకొని కాటు వేశాడని శ్రీరామప్రసాద్‌ కుటుంబం వాపోయింది. ఇద్దరు కుమార్తెల చదువులు, వివాహం చేయడానికి సైతం వారికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. చుట్టుపక్కలవారు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రస్తుతం బాసటగా నిలిచారు.

తొలి నుంచి దుందుడుకు స్వభావం

గుప్తా సెంటర్‌కు చెందిన శివమణికంఠ గట్టువెనక ప్రాంతంలో పలు పాఠశాలల్లో పీఈటీగా పనిచేశాడు. అతడి వ్యవహార శైలి నచ్చకపోవడంతో గతంలో పలు పాఠశాలల యాజమాన్యాలు అతడిని విధుల నుంచి తొలగించాయి. ప్రస్తుతం భవానీపురంలోని ప్రయివేటు పాఠశాలలో పనిచేస్తున్న మణికంఠ చిరువ్యాపారి కుమార్తె దర్శినిని పెళ్లి చేసుకుంటానని వెంటపడుతుండడంతో ఆ విషయం తండ్రికి చెప్పింది. తండ్రి స్థానిక పెద్దలను తీసుకు వెళ్లి మణికంఠను మందలించడంతో అతడు కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ప్రేమించిన యువతి సమక్షంలోనే ఆమె తండ్రిని దారుణంగా హతమార్చడం చూపరులను కలచివేసింది. ప్రయివేటు పాఠశాలల్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ సహజ సిద్ధమైన దుందుడుకు స్వభావం కారణంగా రాజకీయ పక్షాల ప్రదర్శనల్లో అల్లరి చేయడం, బెదిరింపులకు దిగడం, రాజకీయ నాయకులతో సెల్ఫీలు దిగి ఇన్‌స్టాల్లో పెట్టి గొప్పలు చెప్పడం అతని నైజంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని