logo

అతివల జీవితాల్లో వెలుగులు

మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం  ప్రత్యేక  కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల ముందు  ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు ఇచ్చే రుణాల ద్వారా  ఆర్థిక స్వావలంబన సాధించేదిశగా చర్యలు తీసుకుంటుంది.

Published : 29 Jun 2024 04:35 IST

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి చర్యలు
కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం  ప్రత్యేక  కార్యాచరణ చేపట్టింది. ఎన్నికల ముందు  ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు ఇచ్చే రుణాల ద్వారా  ఆర్థిక స్వావలంబన సాధించేదిశగా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే  ఇప్పటివరకు ఉన్న పథకాల్లో పలు మార్పులు చేయడంతోపాటు  మహిళలకు ఎక్కువ లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు చేసింది.  ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కార్యాచరణ చేపట్టారు.

పొదుపు నుంచి రుణాలు

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు  లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి లాంటి పథకాల ద్వారా బ్యాంకులు  రుణాలు ఇస్తున్నాయి. కూటమి  ప్రభుత్వం  సంఘాల్లో సభ్యుల అవసరాల తీరేలా కొత్తగా పలు మార్పులు చేసింది. దీనిలో భాగంగానే బ్యాంకులు ఇస్తున్న రుణాలను అవసరం మేరకు వినియోగించుకుని సంఘ సభ్యుల పొదుపు నిధులను వినియోగించుకోవాలని సూచించింది. పొదుపు నుంచి తీసుకున్న రుణాలకు చెల్లించే వడ్డీ కూడా సంఘాలకే జమ కావడంతో అవి ఆర్థికంగా బలోపేతం అవుతాయని భావించి ఆ దిశగా  ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంకులు సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు ఇస్తున్నాయి.వీటికి సభ్యులు చెల్లించే వడ్డీ బ్యాంకులకు వెళ్తాయి. అదే పొదుపు నుంచి తీసుకుంటే సంఘాల ఖాతాలకే జమై సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు.

ఖాతాల్లో  రూ.కోట్లల్లో నిల్వలు

స్వయం సహయక సంఘాలకు చెందిన మహిళలు ప్రతి ఒక్కరూ నెలకు రూ.100లు తగ్గకుండా పొదుపు  చేస్తున్నారు. ఈ మేరకు ఏడాదిలో రూ.12వేల నుంచి రూ.15వేల వరకు పొదుపు చేస్తారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాల సభ్యుల పొదుపు నిధులు బ్యాంకుల్లో రూ. కోట్లల్లో నిల్వ ఉంది. వాటి ఆధారంగానే సంఘాలకు రుణాలు ఇస్తున్నాయి. ఇకపై బ్యాంకులో పొదుపుఖాతాల్లో ఉన్న నిల్వ ఆధారంగా మహిళలకు స్వయం ఉపాది అవసరాల మేరకు రుణాలు ఇవ్వవచ్చు. ఈ అప్పును సంఘ మహిళలు సమావేశం నిర్వహించుకుని ఎంత పొదుపు ఉంది, బ్యాంకులో ఎంత ఉంచాలి, సంఘంలో ఎంతమంది సొమ్ము అవసరమనేది సంఘాల సమావేశాల్లో నిర్ణయించాలి. సభ్యుల తీర్మానం ప్రకారం బ్యాంకుల నుంచి సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆసొమ్ము తీసుకుని అవసరమైన సభ్యులకు వడ్డీకి ఇస్తారు. వడ్డీతో కలిపినెలవారీవాయిదాలు తిరిగి  ఆఖాతాకే చెల్లిస్తే బ్యాంకులో వీరిపొదుపులో జమ అవుతాయి. 

రూ.10లక్షల వరకు  వడ్డీ రాయితీ

గత వైకాపా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సున్నా వడ్డీ రుణాలు రూ.కోట్లల్లో అందిస్తున్నామని ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో  ఆశించిన మేరకు మహిళలకు లబ్ధి చేకూరలేదు. సంఘాలు రూ.20లక్షల వరకు రుణం తీసుకున్నా  కేవలం రూ.3లక్షలకు మాత్రమే వడ్డీ రాయితీ వర్తింప చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.10లక్షల వరకు వడ్డీ రాయితీ అందించాలని  నిర్ణయించడంతోపాటు ఆమేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఎక్కువ సంఘాలకు, అధిక మొత్తం లబ్ధి    చేకూరే అవకాశం ఉంది.

అవగాహన కల్పిస్తున్నాం

నూతన ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వివిధ పథకాల ద్వారా ఎక్కువ లబ్ధి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం సంఘాల పొదుపు ఖాతాల నుంచి రుణాలు తీసుకునే అంశంపై అవగాహన కల్పిస్తున్నాం.   వడ్డీ రాయితీ వర్తింపు తదితర అంశాలపై అన్ని ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహించి ఎక్కువమంది వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నాం.

కనకారావు, బ్యాంకు లింకేజీ రుణాల డీపీఎం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని