logo

చింతతీరే రోజులొచ్చాయి!

నాటి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన పథకాల్లో చింతలపూడి ఎత్తిపోతల ఒకటి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపుగా 70 శాతం పూర్తయిన పనులను ముందుకు కొనసాగించకుండా గాలికి వదిలేసింది.

Published : 29 Jun 2024 04:29 IST

తెదేపా కూటమి రాకతో అన్నదాతల్లో ఆశలు
ఎత్తిపోతలు పూర్తయితే తీరనున్న సాగు, తాగునీటి కష్టాలు

ఎన్‌ఎస్‌పీ మూడో జోన్‌ పరిధిలోని 21వ ప్రధాన ఉపకాలువ  

న్యూస్‌టుడే - తిరువూరు, విస్సన్నపేట: నాటి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన పథకాల్లో చింతలపూడి ఎత్తిపోతల ఒకటి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపుగా 70 శాతం పూర్తయిన పనులను ముందుకు కొనసాగించకుండా గాలికి వదిలేసింది. రైతుల ప్రయోజనాలకు దారుణంగా గండి కొట్టింది. తిరిగి తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... చింతలపూడి ఎత్తిపోతల పథకంపై సమీక్షించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ పథకానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబే... దాన్ని పూర్తి చేసి సాగర్‌ కాలువల్లో గోదావరి జలాలను పారిస్తారని రైతులు ఆశగా చెబుతున్నారు. సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఈ పథకం ద్వారా ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఎక్కువ లబ్ధి కలుగుతుంది. 

  • గత ఐదేళ్లలో విధ్వంసకర పాలన సాగించిన జగన్‌... చింతలపూడి ఎత్తిపోతలను అసలు పట్టించుకోలేదు. గోదావరి వరద జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నా కళ్లప్పగించి చూశారే తప్ప.. వాటి సద్వినియోగానికి ఆలోచించలేదు. ఫలితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమైంది. సాగు నీరు లేక ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. సాగు భూములు బీళ్లుగా మారిపోయాయి.

మిగిలింది 30 శాతం పనులే

గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలోనే రూ. 3,356 కోట్లు ఖర్చు చేసి 70 శాతానికిపైగా పనులను పూర్తి చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే రివర్స్‌ టెండరింగ్‌ పేరిట ఏడాది పాటు పనులను నిలిపేసింది. కేవలం రూ. 88.90 కోట్లు ఖర్చు చేసి చేతులు దులిపేసుకుంది. నిర్వాసితులైన రైతులకు రూ. 200 కోట్లు చెల్లించకపోవడంతో భూసేకరణ నిలిచిపోయింది. తెదేపా ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలో 600 ఎకరాల భూసేకరణ చేపట్టి పరిహారంగా రూ. 50 కోట్లు చెల్లించారు. మరో రూ. 49 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2019లో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో నిలిచిపోయింది. తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో సేకరించిన భూములకు రూ. 150 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. తాజాగా అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేస్తే పథకం అందుబాటులోకి వస్తుంది. 

చివరి ఆయకట్టు వరకు నీరు..

తిరువూరు, విస్సన్నపేట మండలాల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే గోదావరి జలాలు చేరేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఎత్తిపోతల పథకం నిర్మించాలని 2017లో పైలాన్‌ ఆవిష్కరణ సందర్భంగా రైతులు చేసిన విజ్ఞప్తికి నాటి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. విస్సన్నపేట మండలం పిట్లవానిగూడెం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇది పూర్తయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని ఏడాది పొడవునా అందించడానికి వీలవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని