logo

‘గత అయిదేళ్లలో అప్రకటిత ఎమర్జెన్సీ’

నాటి వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్లపాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌యాదవ్‌ మండిపడ్డారు.

Published : 29 Jun 2024 04:22 IST

మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్‌.  వేదికపై దుర్గాప్రసాద్, లక్ష్మణరావు తదితరులు  

ఈనాడు డిజిటల్, అమరావతి: నాటి వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్లపాటు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌యాదవ్‌ మండిపడ్డారు. ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, అక్రమాలు, అన్యాయాలే. ప్రజలు ఐదేళ్లు ఓపిక పట్టి ఒక్కసారిగా అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించారన్నారు. శుక్రవారం విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ‘1975 జూన్‌ 25 ఎమర్జెన్సీ కాలంనాటి యథార్థ సంఘటనలు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు కారణమైన కాంగ్రెస్‌కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ‘1975 జూన్‌ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. నియంతృత్వాన్ని అమలు చేసి ప్రజల స్వేచ్ఛను అణగదొక్కారు. మీడియాపై ఆంక్షలు విధించారు. లక్షల మందిని జైల్లో పెట్టించారు. దేశమంతా కారాగారంలా మారిపోయింద’ని ఆయన అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో పాటు కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేశాయన్నారు. గతంలో అధికారం కోసం రాజ్యాంగాన్ని సవరించిందీ.. ఎమర్జెన్సీని విధించిందీ కాంగ్రెస్సే.. నాటి విషయాలను నేటి తరం తెలుసుకోవాలన్నారు సత్యకుమార్‌. వైకాపా పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, భాజపా ఎన్జీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్‌ విభాగ సంచాలకుడు కోనేరు దుర్గాప్రసాద్, భాజపా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల క్లస్టర్‌ ఇన్‌ఛార్జి కిలారు దిలీప్, సత్యమూర్తి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని