logo

AP News: కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు

దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ హామీని జగన్‌ తుంగలో తొక్కారు.

Updated : 29 Jun 2024 08:03 IST

జగన్‌ హయాంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు..

ఈనాడు, అమరావతి: దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ హామీని జగన్‌ తుంగలో తొక్కారు. ఆదాయం పెంచుకునేందుకు తూట్లు పొడిచారు. తామేం తక్కువ తినలేదని వైకాపా నేతలు వ్యవహరించారు. తమ అనుయాయుల కోసం వైకాపా నేతలు ప్రభుత్వ మద్యం దుకాణాలను ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు ఇష్టానుసారం మార్పించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టించారు. నేతలు చెప్పడం.. అధికారులు తలాడించడం చకచకా జరిగిపోయాయి. వెరసి దుకాణాలకు ఆదాయం గణనీయంగా పడిపోయి, వైకాపా సానుభూతిపరుల బార్లు కళకళలాడాయి. గత ఐదేళ్లలో మద్యం దుకాణాల తరలింపునకు వైకాపా ప్రజాప్రతినిధులు, నేతల సిఫార్సుల బాగోతాలు ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేశారనే విమర్శలు వస్తున్నాయి. తమ అనుచరులకు ఆదాయం పెంచుకునే అంశంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఏమాత్రం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 

ఎందుకంత శ్రద్ధ..?

  • విజయవాడ శివారు సింగ్‌నగర్‌ పైపుల రోడ్డులో ఓ బార్‌ వ్యాపారం సక్రమంగా జరగకపోవడంతో.. వైకాపా నేతలతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని గన్నవర మండలం సూరంపల్లికి మార్పించాడు. అప్పటికే అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణం ఉంది. అక్కడ కూడా వ్యాపారం సరిగా సాగలేదు. గతంలో నామినేటెడ్‌ పోస్టులో పనిచేసిన కడప జిల్లాకు చెందిన నేత అండతో.. అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వంశీ సిఫార్సు లేఖ తీసుకున్నారు. సూరంపల్లి నుంచి ముస్తాబాదకు మద్యం దుకాణాన్ని తరలించాలని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీకి వల్లభనేని వంశీ గత ఏడాది జనవరిలో లేఖ రాశారు. ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా ఎక్సైజ్‌ అధికారులు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ ఆమోదముద్ర వేశారు. అయినా బార్‌కు ఆదాయార్జనే ధ్యేయంగా దూరంగా ఉన్న ముస్తాబాదకు తరలించేశారు.  
  • బెంజి సర్కిల్‌ నుంచి ఓ దుకాణాన్ని గన్నవరం మార్చారు. ఇక్కడ ఓ బార్‌కు ఇబ్బందికరంగా ఉందనే కారణంతో నేతల సిఫార్సుతో మార్చేశారు. బీసెంట్‌ రోడ్డులో దుకాణాన్ని మార్చేందుకు వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి ఒకరు సిఫార్సు లేఖ ఇచ్చి, తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గొల్లపూడి నుంచి తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు మూడు దుకాణాలను తరలించారు. ధర్నా చౌక్‌ ప్రాంతం నుంచి కూడా దుకాణాన్ని మరోచోటకు తరలించారు. 

సూరంపల్లి నుంచి ముస్తాబాదకు తరలించడంతో మూతబడిన మద్యం దుకాణం

స్వప్రయోజనాలకే పెద్దపీట...

వైకాపా నేతలు తమ అనుచరుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ లేఖలు ఇచ్చినా.. వాటిపై అధికారులు ఏమాత్రం విచారించకుండానే ఆమోదించడం చర్చనీయాంశం అవుతోంది. వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాల రాబడికి గండికొట్టారు. సూరంపల్లి దుకాణం తరలింపు కోసం వంశీ రాసిన లేఖలో అవాస్తవాలు పొందుపర్చారు. ఆ ప్రాంతం మద్యం దుకాణం ఏర్పాటుకు సరైంది కాదనీ, మారిస్తే దుకాణానికి, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. దగ్గరలో జాతీయ రహదారి, పాఠశాలలు ఉన్నాయన్నారు. వాస్తవానికి ఈ ప్రాంతం నుంచి కిలోమీటరు దూరంలో విద్యాసంస్థలు కూడా లేవు. ఈ దుకాణంలో రోజుకు సగటున రూ.4.50 లక్షలు, వారాంతాల్లో రూ.7.50 లక్షల వరకు విక్రయాలు సాగుతుంటాయి. ముస్తాబాదకు మార్చిన తర్వాత దీని ఆదాయం సగానికి పడిపోయింది. బార్‌ రాబడి రెట్టింపు అయింది. ఇలా పలువురు వైకాపా నేతలు ఇబ్బడిముబ్బడిగా తరలింపు కోసం లేఖలు ఇచ్చినట్లు తెలిసింది. వీటి ఆధారంగా అధికారులు దుకాణాలను మార్చేశారు. 

అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వంశీ.. ప్రభుత్వ మద్యం దుకాణం ముస్తాబాదకు తరలించాలని ఉన్నతాధికారులకు రాసిన లేఖ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని