logo

Vijayawada: చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్‌ అరెస్టు

తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్‌ అనుచరుడైన ఈశ్వరప్రసాద్‌ను అరెస్టు చేశారు.

Updated : 05 Jul 2024 09:25 IST

కోర్టులో హాజరుపరిచిన పటమట పోలీసులు
రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయాధికారి

కంటి గాయంతో బాధపడుతున్న గాంధీ (పాతచిత్రం)

న్యూస్‌టుడే - పటమట: తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పటమట పోలీసులు వైకాపా నేత, దేవినేని అవినాశ్‌ అనుచరుడైన ఈశ్వరప్రసాద్‌ను అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌ కోసం పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా.. న్యాయాధికారి రిమాండ్‌ను తిరస్కరించారు. తనపై దాడిలో ఈశ్వరప్రసాద్‌ పాల్గొన్నారని గాంధీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో అప్పట్లో ఏ3గా చేర్చి, ఆ తర్వాత పేరును తొలగించారు. అధికార వైకాపా నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు వ్యవహరించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఘటన జరిగిన సమయంలో ఈశ్వరప్రసాద్‌ లేరని అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. నలుగురు నిందితులను చూపించి ఛార్జిషీట్‌ను కూడా న్యాయస్థానంలో దాఖలు చేశారు. ప్రభుత్వం మారడంతో తాజాగా.. ఈ కేసులో కదలిక వచ్చింది. గతంలో నిందితుడిగా చేర్చి తొలగించిన వ్యక్తిని.. తాజాగా అరెస్టు చేశారు. ఈశ్వరప్రసాద్‌ను ఏ5గా చూపిస్తూ 307 సెక్షన్‌ చేర్చి ఇన్‌ఛార్జి కోర్టు అయిన 3వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గురువారం హాజరుపరిచారు. గతంలో 326 సెక్షన్‌ నమోదు చేసి.. ఇప్పుడు ఏ5కు హత్యాయత్నం సెక్షన్‌ జోడించడం కుదరదని న్యాయాధికారి తిరుమలరావు రిమాండ్‌ను తిరస్కరించారు. నిందితుడిని వదిలేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

పక్కా ప్రణాళికతోనే దాడి... 2022 సెప్టెంబరు 3న సాయంత్రం 5 గంటల సమయంలో తెదేపా నేత చెన్నుపాటి గాంధీ.. పటమటలంకలోని కొమ్మా సీతారావమ్మ జడ్పీ ఉన్నత పాఠశాల రోడ్డులో జరుగుతున్న భూగర్భ డ్రెయినేజీ పనులు పరిశీలిస్తున్నారు. తాగునీటి లీకేజీ గురించి కార్పొరేషన్‌ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడి తిరిగి వెళ్తుండగా.. వైకాపా నేతలు గద్దె కల్యాణ్, సుబ్బు, లీలాప్రసాద్, వల్లూరి ఈశ్వరప్రసాద్‌లు గాంధీని ఆపి మా ప్రభుత్వంలో నీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. దీనిపై వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు పదునైన ఆయుధంతో గాంధీ కుడికన్నుపై బలంగా పొడవడంతో తీవ్ర గాయమైంది. దీనిపై అప్పట్లో సెక్షన్‌ 326, 506 కింద కేసు నమోదు చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతల దాడి కేసులో అప్పట్లో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో గాయం నివేదికను సమర్పించక పోవడంతో రిమాండ్‌ తిరస్కరణకు గురైంది. గద్దె కల్యాణ్, లీలా కృష్ణ ప్రసాద్, సుబ్బులను నిందితులుగా చూపించారు. గాయానికి సంబంధించి నివేదిక పొందుపరచక పోవడంతో సెక్షన్‌ 326ను పరిగణనలోకి తీసుకోలేమనీ, నిందితులకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేయాలని పేర్కొంటూ అప్పట్లో న్యాయాధికారి రిమాండ్‌ను తిప్పి పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


కేశినేని చిన్నిపై దాడి కేసులో నలుగురి అరెస్టు

ఎ.కొండూరు: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితులైన కంభంపాడుకు చెందిన వైకాపా వర్గీయులు కాలసాని చెన్నారావు, చిమటా రామకృష్ణ, చిమటా వెంకటేశ్వర్లు, చిమటా గోపాలరావును అరెస్టు చేసినట్లు ఎస్సై సీహెచ్‌.కృష్ణ గురువారం తెలిపారు. మరో నిందితుడైన మెంతుల శివకృష్ణ పరారీలో ఉన్నాడన్నారు. వివరాలిలా ఉన్నాయి. ఈ ఏడాది మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కంభంపాడు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన ప్రస్తుత ఎన్డీయే కూటమి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని), ఆయన అనుచరులపై వైకాపా ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త వైకాపా మండల యువత అధ్యక్షుడైన కాలసాని చెన్నారావు తన అనుచరులతో కలిసి రాళ్లతో దాడి చేశారు. ఎంపీని ఆయన అనుచరులను చంపుతానని బెదిరించి భయానక వాతావరణం సృష్టించారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై గత నెల 30న ఎ.కొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు పైన తెలిపిన నలుగురు నిందితులను అరెస్టు చేసి తిరువూరు న్యాయస్థానంలో గురువారం హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ వారికి బెయిల్‌ మంజూరు చేశారు. నిందితులపై బీఎన్‌ఎస్‌ 143, 147, 341, 352, 506 రెడ్‌విత్‌ 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని